Skip to main content

ఎంబీఏ Vs ఎంటెక్

ఈ రెండింట్లో బెస్ట్ కోర్సు ఏది? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎక్కువ మంది ఎంబీఏ వైపు ఎందుకు అడుగులేస్తున్నారు...జాబ్ మార్కెట్లో ఎంబీఏతో మంచి అవకాశాలు లభిస్తాయా.. లేదా ఎంటెక్‌తో సుస్థిర కెరీర్ అందుతుందా..! ఇవి ప్రస్తుతం చాలామందికి ఎదురయ్యే సందేహాలు!! ముఖ్యంగా బీటెక్ పూర్తిచేసి.. ఉన్నత విద్య దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన అభ్యర్థులు.. ఎంబీఏ, ఎంటెక్‌లలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో స్పష్టతకురాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎంబీఏ, ఎంటెక్‌తో భవిష్యత్ కెరీర్ అవకాశాలపై నిపుణుల విశ్లేషణ...
బీటెక్ తర్వాత ఉన్నత విద్య పరంగా ప్రధానంగా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండూ సుస్థిర కెరీర్‌ను అందించేవే! కానీ, గత కొన్నేళ్లుగా జాబ్ మార్కెట్లో మారుతున్న ట్రెండ్ కారణంగా ఎంబీఏ పూర్తిచేసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కార్పొరేట్ రంగంలో అవకాశాలను అందుకోవటంలో ముందుంటున్నారు. ఎంటెక్ చదివిన వారు బోధన, పరిశోధన రంగంలో స్థిరపడటంలో సఫలమవుతున్నారు.

పోల్చడం సరైందేనా?
ఎంబీఏ, ఎంటెక్..రెండూ భిన్నమైన కోర్సులు. కరిక్యులం నుంచి కోర్సు స్వరూపం వరకు దేన్ని పరిశీలించినా ఉత్తర, దక్షిణాల్లా ఉంటాయి. అంతేకాదు.. కెరీర్ అవకాశాలు, వేతనాలు, జాబ్ ప్రొఫైల్స్ పరంగా చూసినా.. ఎంటెక్, ఎంబీఏ రెండూ పూర్తిగా విభిన్నమైనవి. కానీ, అనూహ్యంగా కెరీర్ కోణంలో.. ఈ రెండు కోర్సులను విపరీతంగా పోల్చుతుంటారు. ముఖ్యంగా బీటెక్ పూర్తిచేసిన వారికి సంబంధించి ఉన్నత విద్య పరంగా ఎంబీఏ, ఎంటెక్‌లలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో ఈ పోలికలు ఎక్కువ. వాస్తవం ఏమంటే... బీటెక్ తర్వాత ఐఐఎంలు వంటి టాప్ బీస్కూల్లో ఎంబీఏ చేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లో అపార అవకాశాలు లభిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థుల్లో ఎక్కువమంది ఎంబీఏ వైపు అడుగులేస్తున్నారనేది నిపుణుల మాట.

ఇంజనీరింగ్ టు ఎంబీఏ :
2016 క్యాట్‌లో 100 పర్సంటైల్ పొందిన 20 మందీ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారే. అలాగే 2017 క్యాట్‌లో 20 మంది 100 పర్సంటైల్ సాధించగా.. వారిలో 17 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ఉన్నారు. ఐఐటీల వంటి అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో చదివిన వారు సైతం ఎంబీఏ వైపు మొగ్గుచూపడాన్ని బట్టి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఎంబీఏకి క్రేజ్ ఉందని అర్థమవుతుంది. బీటెక్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులకు ఎంబీఏ అనుకూలం అనే భావన ఉంది. కానీ, క్యాట్ ర్యాంకర్లలో అన్ని బ్రాంచ్‌ల వారు ఉండటం గమనార్హం.

ఎంబీఏ.. ఎందుకంత క్రేజ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకుంటే.. గూగుల్, ఫేస్‌బుక్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు ఇష్టపడతాడు. ఆపై కష్టపడి ప్లేస్‌మెంట్ సైతం సాధిస్తాడు. జాబ్‌లో చేరిన తర్వాత నైపుణ్యాలను పెంచుకుంటూ కెరీర్‌ను పరుగులు పెట్టించి.. ఒక స్థాయికి చేరుకుంటాడు. అక్కడే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కెరీర్ పరంగా స్తబ్ధత ఏర్పడుతోంది. ఈ స్తబ్ధతను ఛేదించే ఆయుధమే ఎంబీఏ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెక్నికల్ నైపుణ్యాలతో కెరీర్‌లో ఒక స్థాయికి చేరుకోవచ్చు. కానీ, అంతకుమించి ముందుకెళ్లాలంటే మాత్రం మేనేజీరియల్ స్కిల్స్ (నిర్వహణ నైపుణ్యాలు) తప్పనిసరి. ఎంబీఏ పూర్తిచేసిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కొన్నేళ్ల పని అనుభవం తర్వాత టెక్నికల్ డొమైన్ నుంచి మేనేజ్‌మెంట్ రోల్స్‌లోకి సులభంగా మారుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఎక్కువ మంది బీటెక్ అభ్యర్థులు ఎంబీఏ వైపు అడుగులేస్తున్నారు.

మంచి కాంబినేషన్ :
ఫ్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో కెరీర్ గ్రోత్, నాలెడ్జ్, స్కిల్స్ కోణంలో.. ఇంజనీరింగ్ + ఎంబీఏ కాంబినేషన్ అత్యుత్తమంగా నిలుస్తోంది. ఎంబీఏ నేపథ్యమున్న ఇంజనీరింగ్ విద్యార్థులు వేగంగా సూపర్‌వైజరీ, మేనేజీరియల్ స్థాయికి చేరుతున్నారు. అయితే ఇంజనీరింగ్ మాత్రమే చదివిన అభ్యర్థులు మాత్రం కొంత వెనకబడుతున్నారనే వాదన ఉంది. ఇంజనీరింగ్ మాత్రమే ఉన్నవారితో పోల్చితే బీటెక్+ఎంబీఏ అర్హత కలిగిన వారి సరాసరి వేతనం కూడా ఎక్కువగానే ఉంటోంది. దీన్నిబట్టి కార్పొరేట్ ప్రపంచం.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కాంబినేషన్‌కు అనుకూలమని అర్ధమవుతోంది. ఎంబీఏ కరిక్యులం గ్రూప్ డిస్కషన్‌కు ఆస్కారం కల్పిస్తోంది. కోర్సులో భాగంగా ఉండే ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లు, ఇండస్ట్రీ విజిట్స్ తదితరాల కారణంగా వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందుతున్నాయి. ఆయా నైపుణ్యాలు భవిష్యత్‌లో మేనేజీరియల్ స్థాయిలో రాణించేందుకు దోహదపడుతున్నాయి.

సవాళ్లకు సిద్ధంగా..
ఇంజనీరింగ్ సిలబస్ విద్యార్థుల ఆలోచనలకు శాస్త్రీయతను జోడిస్తే.. ఎంబీఏ కరిక్యులం వాస్తవికతను ఆపాదిస్తుంది. ముఖ్యంగా ఎంబీఏ ద్వారా వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే నేర్పు, మానవ వనరుల ఆవశ్యకతపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. కోర్సులో భాగంగా అలవరచుకొనే కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలు కెరీర్‌కు కొత్త నగిషీలు అద్దుతాయి.

ఎంబీఏ.. ఎవరికి బెటర్ ?
సూక్ష్మ పరిశీలన, సమస్యా పరిష్కార నైపుణ్యం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సమస్య విశ్లేషణ వంటివి ఎంబీఏ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలుగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా బిజినెస్ సంబంధిత అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఎంబీఏ చక్కగా సరిపోతుంది. ఎంటెక్‌తో పోల్చితే ప్రాక్టికల్ అప్రోచ్ కొంత తక్కువగా ఉన్నప్పటికీ.. మేనేజ్‌మెంట్ సిద్ధాంతాలు, కేస్ స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. బిజినెస్ వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లు సంక్లిష్టంగా ఉంటాయి. ఎంబీఏ ఔత్సాహికులకు సవాళ్లను సంతోషంగా స్వీకరించే దృక్పథం అవసరం.

ఎంటెక్.. సాంకేతికతపై పట్టు
ఎంటెక్ చదివితే బోధన, పరిశోధన రంగంలో భవిష్యత్‌కు భరోసా ఖాయం అంటున్నారు నిపుణులు. సాంకేతికతపై పట్టు, ఆసక్తి ఉన్నవారికి ఎంటెక్ చక్కగా సరిపోతుంది. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఎంటెక్‌ను ఎంచుకోవాలి. కానీ, ఈ విభాగంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కొంతకాలం ఓపిగ్గా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎంటెక్ పూర్తిచేసిన వెంటనే ఆకర్షణీయ వేతనాలు అందుకునే అవకాశం ఉన్నా.. సమున్నత కెరీర్‌ను కోరుకునే వారు మాత్రం పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వంటివి పూర్తిచేయాలి. గేట్, యూజీసీ-నెట్ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందితే ఫెలోషిప్ లభిస్తోంది. తద్వారా ఒకే సమయంలో అధ్యయనంతోపాటు ఆదాయానికి మార్గం సుగమం అవుతుంది. సాంకేతిక రంగంలో ఎవర్‌గ్రీన్‌గా నిలవాలంటే.. నిరంతర అధ్యయనంతోపాటు తాజా ఆవిష్కరణలు - ఫలితాలు - ప్రభావాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

స్పష్టతతో ముందడుగు...
బీటెక్ తర్వాత ఎంటెక్/ఎంబీఏను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు రెండో ఏడాది చివరి నాటికే స్పష్టత తెచ్చుకోవాలి. తద్వారా మూడో ఏడాది నుంచి లక్ష్యం దిశగా కసరత్తు ప్రారంభించొచ్చు. అంశాల వారీగా స్వీయపరిశీలన ద్వారా ఒక నిర్ణయానికి రావాలి. సంబంధిత డొమైన్ (స్పెషలైజేషన్)లో మంచి పట్టున్న విద్యార్థులకు ఎంటెక్ సరైన ఎంపిక. జీపీఏ 7.5 శాతం అంతకంటే ఎక్కువ ఉన్నవారిని అకడెమిక్‌గా ప్రతిభావంతులుగా గుర్తించొచ్చు. వీరికి ఎంటెక్ చక్కగా సరిపోతుంది. ఎంటెక్‌ను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్‌‌జ, ఇంటర్న్‌షిప్స్, ప్రాజెక్టు వర్క్‌పై ఎక్కువగా దృష్టిసారించాలి. బీటెక్ పూర్తయిన వెంటనే గేట్ ర్యాంకు ద్వారా ఎంటెక్‌లో చేరేందుకు ప్రయత్నించడం ఉత్తమం. తద్వారా జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎంటెక్‌ను అభ్యసించొచ్చు. రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో సైతం గేట్ ర్యాంకర్లకు ప్రవేశాలు కల్పించిన తర్వాతే పీజీఈసెట్ ర్యాంకర్లకు సీట్లు కేటాయిస్తారు.

ఎంబీఏలో చేరాలనుకునే అభ్యర్థులకు సాంస్కృతిక, సామాజిక, కార్యక్రమాల్లో పాల్గొనే చొరవ, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి కీలకం. ఎందుకంటే.. ఐఐఎంలు, ఇతర అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి ఆయా అంశాలకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తున్నారు. క్యాట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపితే ఐఐఎంలు, ఇతర జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యా సంస్థల్లో ఎంబీఏలో ప్రవేశాలు పొందొచ్చు. తద్వారా ఉన్నత శ్రేణి మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. వర్సిటీ క్యాం పస్‌లు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మినహా ఇతర కాలేజీల్లో ఎంబీఏ ప్రమాణాల మేరకు ఉండట్లేదనే అభిప్రాముంది. ఎంబీఏను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు కనీసం ఒకటి నుంచి రెండేళ్ల అనుభవం తర్వాత క్యాట్, ఇతర ఎంబీఏ ప్రవేశ పరీక్షలకు హాజరుకావడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఎంబీఏలోని చాలా అంశాలు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ద్వారా మాత్రమే అర్థంచేసుకోగలిగేవిగా ఉన్నాయి.

కోర్సు ఎంపికలో పరిగణించాల్సినవి..
  1. వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి.
  2. ఆయా సబ్జెక్టుల స్వరూపం, లెర్నింగ్ స్కిల్స్‌పై స్పష్టత.
  3. స్పెషలైజేషన్ పరంగా భవిష్యత్తులో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అంచనా.
  4. జాబ్‌మార్కెట్ తీరుతెన్నులు తదితర అంశాలు.

ఎంటెక్ అనుకూలతలు..
  • స్వీయ డొమైన్‌లో నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
  • పరిశోధన, సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలు అందుకోవచ్చు.
  • పీహెచ్‌డీలో చేరేందుకు దోహదపడుతుంది.
  • బెల్, డీఆర్‌డీవో, ఎన్‌టీపీసీఎల్, ఓఎన్‌జీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

ఎంబీఏ అనుకూలతలు..
  • వేగంగా కెరీర్‌లో స్థిరపడొచ్చు.
  • స్వయం ఉపాధి దిశగా వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను అలవరచుకోవచ్చు.
  • అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా..
ఎంబీఏ కంటే ఎంటెక్ సిలబస్ కఠినమనే భావన చాలా మందిలో ఉంది. కానీ, వాస్తవానికి ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల సిలబస్ చాలెంజింగ్‌గా ఉంటుంది. ఐఐఎంలలో కేస్ స్టడీస్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తారు. తద్వారా వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను నేర్పుగా ఎదుర్కోగలిగే నైపుణ్యాలు అలవడతాయి. ఈ కారణంగానే ఐఐఎంలలో చదివిన వారిలో ఎక్కువ మంది ప్రముఖ కంపెనీలకు సీఈవోలుగా స్థిరపడుతుండగా, మరికొందరు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్నారు. గేట్ ర్యాంకు ద్వారా ఎంటెక్ పూర్తిచేసిన వారికి పీహెచ్‌డీ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. పీహెచ్‌డీతో పరిశోధనలు వైపు వెళ్తే.. ఆకర్షణీయ వేతనాలు అందుకోవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియకు కొంచెం సమయం పడుతుంది. ఆసక్తి, భవిష్యత్ కెరీర్ లక్ష్యాలు, స్వీయ సామర్థ్యం తదితరాల ఆధారంగా కోర్సును ఎంపిక చేసుకోవాలి.
- ప్రొఫెసర్ ఉమామహేశ్వర్‌రావు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఓయూ.
Published date : 27 Jun 2018 06:46PM

Photo Stories