Skip to main content

ఎంబీబీఎస్...కొత్త కరిక్యులం!

ఎంబీబీఎస్.. వైద్యవృత్తిలో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులకు మార్గం! డాక్టర్‌గా రాణించేందుకు ఈ కోర్సులో నేర్చుకున్న నైపుణ్యాలే పునాది!! మరోవైపు.. ఎంబీబీఎస్ కరిక్యులం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేదనే అభిప్రాయం! డాక్టర్ పట్టాతో బయటకువస్తున్న అభ్యర్థులకు రోగులకు అందించే సేవల గురించి సరైన అవగాహన ఉండట్లేదనే వ్యాఖ్యలు! దాంతో ఎంబీబీఎస్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు కొంతకాలం క్రితమే కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది అంటే.. 2019-20 విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌లో కొత్త కరిక్యులం అమలు కానుంది. దీనికి సంబంధించి తాజాగా ఎంసీఐ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం కూడా లభించింది. ఈ నేపథ్యంలో ఎంబీబీఎస్ నూతన కరిక్యులం, సిలబస్‌పై నిపుణుల విశ్లేషణ...
ఎంబీబీఎస్ కొత్త సిలబస్‌పై గత రెండేళ్లుగా సాగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు సిలబస్‌లో మార్పులకు ఆమోదం లభించింది. ఫలితంగా ఎప్పుడో 21 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఎంబీబీఎస్ సిలబస్ స్థానంలో... తాజా పరిస్థితులకు అనుగుణంగా కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. ఎంబీబీఎస్ కోర్ కోర్స్ ప్రారంభానికి ముందే ఫౌండేషన్ కోర్సు నిర్వహించడం.. రోగులకు అవయవ దానంపై అవగాహన కల్పించడం.. వంటి పలు అంశాల్లో కొత్త నైపుణ్యాలు అందించేలా ఎంబీబీఎస్ నూతన కరిక్యులం రూపొందింది.

AETCOM ప్రధానంగా..
ఎంబీబీఎస్ నూతన కరిక్యులంలో వైద్యరంగంపై విద్యార్థుల దృక్పథంలో మార్పులు తేవడం ముఖ్య లక్ష్యంగా నిర్దేశించారు. అందుకోసం ఆటిట్యూడ్, ఎథిక్స్ అండ్ కమ్యూనికేషన్ (AETCOM) నైపుణ్యాలు పెంపొందించేలా ప్రత్యేక శిక్షణనివ్వనున్నారు. అదేవిధంగా రోగులు, వారి బంధువులకు ధైర్యం చెప్పే దృక్పథాన్ని కాబోయే వైద్యులు పెంపొందించుకునేలా కొత్త కరిక్యులంను రూపొందించారు. వాస్తవానికి ఎంబీబీఎస్ విద్యార్థులు పుస్తకాలకే పరిమితమవుతున్నారనే అభిప్రాయంతోపాటు వైద్య వృత్తిని డబ్బు సాధన మార్గంగా చూస్తున్నారనే వాదన కూడా ఏఈటీకామ్‌ను ప్రవేశపెట్టేందుకు దోహదం చేసిందని చెబుతున్నారు. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు సర్టిఫికెట్లు, ఉన్నత డిగ్రీలు, కెరీర్ కోసం తపిస్తూ.. వైద్య వృత్తికి అవసరమైన ఎథిక్స్‌కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. ఈ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఆటిట్యూడ్, ఎథిక్స్, కమ్యూనికేషన్ అంశాలను నూతన కరిక్యులంలో తప్పనిసరి చేయనున్నారు.

ఫౌండేషన్ కోర్సు:
ఇంతకాలం ఎంబీబీఎస్‌లో చేరుతున్న విద్యార్థులు నేరుగా కోర్ సబ్జెక్ట్‌ల అభ్యసనంతోనే కోర్సును ప్రారంభిస్తున్నారు. దాంతో అప్పటివరకు కోచింగ్‌లు తీసుకొని ప్రవేశ పరీక్షలో ర్యాంకులతో ఎంబీబీఎస్‌లో అడుగుపెట్టిన విద్యార్థులకు వైద్య వృత్తికి సమాజంలో ఉన్న ప్రాధాన్యం, ఈ వృత్తికి అవసరమైన మానవతా దృక్పథం గురించి అవగాహన ఉండటంలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అందుకే కొత్త కరిక్యులంలో ఎంబీబీఎస్ కోర్ కోర్సు ప్రారంభానికి ముందే ఫౌండేషన్ కోర్సు నిర్వహించేలా మార్పులు చేశారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో మొదటి రెండు నెలలు ఫౌండేషన్ కోర్సు బోధన జరుగుతుంది. ఇందులో భాగంగా వైద్యవిద్య ముఖ్య ఉద్దేశం.. నేటి పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైద్య పద్ధతులు.. వైద్యరంగంలో నైతిక విలువల ఆవశ్యకత.. అభ్యసన నైపుణ్యాలు.. కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వీటితోపాటు సామాజిక పరిస్థితులపై అవగాహన కలిగేలా లైఫ్ సపోర్ట్, సోషియాలజీ అండ్ డెమోగ్రాఫిక్స్, బయో-హజార్డ్ సేఫ్టీ, పర్యావరణ అంశాలు, సామాజిక దృక్పథం వంటి వాటిని కూడా బోధించనున్నారు. రెండు నెలల ఈ ఫౌండేషన్ కోర్సు పూర్తయ్యాకే కోర్ సబ్జెక్ట్‌లలో బోధన మొదలవుతుంది.

క్షేత్ర నైపుణ్యాలు..
ఇప్పటివరకు ఉన్న ఎంబీబీఎస్ సిలబస్ పూర్తిగా థియరీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో కొనసాగుతోంది. దీంతో విద్యార్థులకు వాస్తవ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో ప్రజల ఆరోగ్య అవసరాల పట్ల అవగాహన పరిమితంగా ఉంటోంది. దీనికి పరిష్కారంగా కొత్త కరిక్యులంలో వాస్తవ పరిస్థితులు, క్షేత్ర నైపుణ్యాలకు ప్రాధాన్యం లభించేలా మార్పులు చేయడం జరిగింది. అందుకోసం మొదటి సంవత్సరం నుంచే క్లినికల్, నాన్-క్లినికల్ సబ్జెక్ట్‌లలో థియరీతోపాటు ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేశారు. థియరీ, ప్రాక్టీస్ మధ్య అంతరాన్ని తగ్గించేలా ఎంబీబీఎస్ తొలి సంవత్సరం నుంచి బేసిక్, లేబొరేటరీ సైన్స్‌లకు ప్రాధాన్యం లభిస్తుంది. కొత్త సిలబస్‌లో ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ క్లినికల్ మెడిసిన్‌పై ఎక్కువ దృష్టిపెట్టడం జరిగింది.

క్లినికల్ ఎక్స్‌పోజర్..
విద్యార్థులకు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించడమే ఎంబీబీఎస్ నూతన కరిక్యులం ముఖ్య లక్ష్యం. కాబట్టి నూతన కరిక్యులంలో భాగంగా తొలి ఏడాది నుంచే క్లినికల్ ఎక్స్‌పోజర్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అందుకోసం విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే బోధన ఆసుపత్రుల్లోని రోగుల విభాగాలను సందర్శించడం, అక్కడ రోగులతో మాట్లాడటం, వారి సమస్యలు తెలుసుకోవడం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నూతన కరిక్యుల ప్రకారం ప్రతి వైద్య కళాశాల స్థానిక ఆరోగ్య పరిస్థితుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. మెడికల్ కళాశాల సమీప ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, తాలూకా హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థులు వాటిని సందర్శించేలా చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఒక విద్యార్థి ఎంబీబీఎస్ పూర్తయ్యే నాటికి పరిపూర్ణమైన వైద్యుడిగా రూపొందించడం ప్రధాన లక్ష్యమని ఎంసీఐ అకడమిక్ కమిటీ పేర్కొంది.

కేస్ బేస్డ్ లెర్నింగ్ :
నూతన కరిక్యులంలో మరో ముఖ్యమైన అంశం.. కేస్ బేస్డ్ లెర్నింగ్. అంటే.. ఏదైనా ఒక వాస్తవ కేస్‌కు సంబంధించి విద్యార్థుల మధ్య గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలి. కేస్ బేస్డ్ లెర్నింగ్‌కు మొదటి సంవత్సరంలోనే ప్రాధాన్యం ఇచ్చేలా కరిక్యులంలో మార్పులుచేశారు. క్లినికల్ ట్రైనింగ్‌లో నైపుణ్యం అందించడంలో భాగంగా బేసిక్స్‌ను, లేబొరేటరీ సెన్సైస్‌ను అనుసంధానం చేయనున్నారు. నూతన కరిక్యులం ప్రకారం నిర్దేశిత అంశాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌ను విద్యార్థులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌కు లెసైన్స్ ఇచ్చేలా నూతన కరిక్యులంను రూపొందించారు.

కొత్తగా ‘ఎలక్టివ్స్’
కొత్త కరిక్యులంలో ఎలక్టివ్స్ విధానం అమలు చేయనున్నారు. దీని ప్రకారం విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్ సిలబస్‌కే పరిమితం కాకుండా.. అనుమతి ఉన్న ఇతర సబ్జెక్ట్‌లను ఎలక్టివ్‌గా ఎంచుకుని వాటిలో నైపుణ్యం పొందాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో అమలు చేయనున్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ఎలక్టివ్ సబ్జెక్ట్‌లో స్వీయ అభ్యసనం విధానంలో రెండు నెలలు చదవాల్సి ఉంటుంది. క్లినికల్ ఎలక్టివ్స్, లేబొరేటరీ పోస్టింగ్స్, కమ్యూనిటీ ఎక్స్‌పోజర్స్‌ను ప్రధానంగా పేర్కొన్నారు. ఎలక్టివ్స్ విధానం- స్వీయ అభ్యసనం/శిక్షణ ఫలితంగా క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్ సామర్థ్యాలు పెరుగుతాయనేది ప్రధాన ఉద్దేశం.

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ :
ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విద్యార్థులే కాకుండా, అధ్యాపకులు కూడా నిరంతరం నూతన నైపుణ్యాలు పొందుతూ.. వాటిని క్లాస్‌రూమ్‌లో, లేబొరేటరీల్లో విద్యార్థులకు బోధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసీఐ అకడమిక్ కమిటీ.. నూతన కరిక్యులంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రీజనల్ లెర్నింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిద్వారా ట్రైనింగ్ ఆఫ్ ద ట్రైనర్స్ పేరుతో నిరంతరం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టనున్నారు.

‘సాంకేతిక’ విద్యా విధానం :
నూతన కరిక్యులంలో భాగంగా ఎంబీబీఎస్ శిక్షణలోనూ.. ఈ రంగంలో వస్తున్న కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. స్కిల్స్ ల్యాబ్, ఈ-లెర్నింగ్, సిమ్యులేషన్ వంటి అంశాల ఆధారంగానూ బోధన చేయాలని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మారిన సిలబస్.. పూర్తిగా ఆధునిక, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలు అందించే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యార్థులకు వైద్య విద్య, వైద్య రంగం ప్రాధాన్యం మొదలు, సామాజిక పరిస్థితులు వరకు అన్ని అంశాలపై అవగాహన లభించి భవిష్యత్తులో ఉన్నతంగా రాణించేందుకు ఆస్కారం లభించనుంది.

ఇంకా ఎన్నో మార్పులు..
అయిదున్నరేళ్ల వ్యవధి ఉండే ఎంబీబీఎస్ కోర్సులో మరెన్నో మార్పులతో కొత్త కరిక్యులం పలకరించనుంది. ఔట్ పేషెంట్, ఎమర్జెన్సీ విభాగాల్లో సహజంగా ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడం.. రోగుల సంరక్షణలో, ఇన్వెస్టిగేషన్స్‌లో పాల్పంచుకోవడం.. రోగికి చికిత్స అందించే క్రమంలో ప్రాథమిక విధానాలపై అవగాహన కల్పించడం... ఫ్యామిలీ మెడిసిన్ ట్రైనింగ్ తప్పనిసరి చేయడం వంటి మరెన్నో కొత్త అంశాలు ఎంబీబీఎస్ నూతన కరిక్యులంలో చేర్చనున్నారు.

నూతన కరిక్యులం లక్ష్యాలు...
  • అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎంబీబీఎస్ విద్యార్థులను తీర్చిదిద్దడం.
  • ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ద్వారా మెడికల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత పెంపొందించడం.
  • భవిష్యత్తులో క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు పెరిగేలా చేయడం.
  • కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ ఫలితంగా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం కనుగొనడం.
  • హెల్త్ ప్రోగ్రామ్స్ సమర్థంగా అమలు చేయడం.

విద్యార్థులకు ఎంతో ప్రయోజనం..
నూతన కరిక్యులంలో పేర్కొన్న అంశాలు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతాయి. వైద్యరంగంలో సుస్థిర భవిష్యత్తుకు దోహదం చేస్తాయి. అయితే వీటిని అమలుచేసే విషయంలో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కమ్యూనిటీ మెడిసిన్, పేషెంట్ కేర్ వంటి వాస్తవ అంశాలను కళాశాలలు తప్పనిసరిగా అమలు చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి.
- డాక్టర్ పుట్టా శ్రీనివాస్, ఎన్‌బీఈ సభ్యులు, ప్రభుత్వ మెడికల్ కళాశాల మహబూబ్‌నగర్ డెరైక్టర్.
Published date : 05 Dec 2018 02:01PM

Photo Stories