Skip to main content

చిన్న వ‌య‌స్సులో ప్రభుత్వ ఉద్యోగం.. ఈ కోర్సుతో సాధ్యం..

ఐటీఐలు అంటే.. ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు! ఉపాధికి దగ్గరి దారి లాంటివి ఐటీఐ కోర్సులు!!

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ఇటు ప్రభుత్వ రంగంతోపాటు అటు ప్రైవేటు కంపెనీల్లోనూ అవకాశాలు అనేకం. స్వయం ఉపాధి మార్గాలు కూడా ఎక్కువే. విద్యార్థి ఆసక్తిని బట్టి ఉన్నత చదువులకు సైతం వెళ్లేందుకు అవకాశముంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఐటీఐ కోర్సులు, అర్హతలు, ప్రవేశాలు, ఉన్నత విద్య, ఉపాధి మార్గాల గురించి తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఐటీఐల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. అంధ్రప్రదేశ్‌లో ప్రవేశాలకు జూలై 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తెలంగాణలో జూలై 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్క దరఖాస్తుతో ఆయా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో ప్రవేశం పొందొచ్చు.

అర్హతలు..
ఐటీఐలు అందించే ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ ట్రేడుల్లో ప్రవేశాలకు ఎనిమిదో తరగతి/పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 14ఏళ్లు నిండి ఉండాలి.

ప్రవేశ ప్రక్రియ..
ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. చేరాలనుకుంటున్న ఐటీఐలు, ట్రేడ్‌లకు సంబంధించి ప్రాథమ్యాలు పేర్కొనాలి. దాంతోపాటే స్కాన్‌ చేసిన సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఎనిమిది/పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్‌ నిబంధనలు, పేర్కొ న్న ప్రాథమ్యాల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మెరిట్‌ జాబితా ఆధారంగా అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ఎంపిక చేస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.

డిమాండ్‌కు తగ్గ కోర్సులు..
రెండు తెలుగు రాష్ట్రాల్లోను దాదాపు ఒకేవిధమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టర్నర్‌/సర్వేయర్‌/టూల్స్‌ అండ్‌ డై మేకర్‌/ప్లంబర్‌/ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌/పెయింటర్‌ జనరల్‌/మెకానిక్‌ మెషీన్‌ టూల్స్‌/మెషినిస్ట్‌ గ్రైండర్‌/ మెషినిస్ట్‌/ఇన‌్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌/ఫిట్టర్‌/ఎలక్ట్రోప్లేటర్‌/ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/ఎలక్ట్రీషియన్‌/డ్రాఫ్ట్‌మన్‌ మెకానిక్‌/డాప్ట్‌మన్‌ సివిల్‌/కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌/కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ మెయింటనెన్స్‌ వంటివి ప్రధానమైనవి. చాలా కోర్సులు రెండేళ్లు కాలపరిమితి గలవి కాగా, కొన్ని కోర్సుల కాల వ్యవధి ఏడాది. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి.

ఉన్నత విద్య, ఉపాధి..
ఐటీఐ ట్రేడ్‌లు.. వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందించే కోర్సులు. కాబట్టి ఐటీఐ కోర్సులతో చక్కటి ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు. ఐటీఐ అభ్యర్థులు రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్రెంటిస్‌ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆసక్తి ఉంటే.. స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటుచేసుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఉన్నత విద్యావకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఐటీఐ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ విధానంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులో నేరుగా రెండో ఏడాదిలో చేరిపోవచ్చు. డిప్లొమా తర్వాత ఈసెట్‌ ద్వారా లేటరల్‌ ఎంట్రీతో బీటెక్‌లో ప్రవేశం పొందొచ్చు. ఇంజనీరింగ్‌తోనే సరిపెట్టకుండా గేట్‌/పీజీఈసెట్‌ ద్వారా ఎంటెక్‌ సైతం చేయవచ్చు. అంటే.. పదో తరగతి తర్వాత ఓవైపు చిన్న వయసులోనే ఉపాధి పొందుతూనే.. మరోవైపు ఆసక్తి, వీలును బట్టి ఉన్నత చదువులకు వెళ్లవచ్చు.

  • ఆంధ్రప్రదేశ్‌లో అడ్మిషన్లకు వెబ్‌సైట్‌: https://iti.nic.in/login.jsp
  • తెలంగాణలో ప్రవేశాలకు వెబ్‌సైట్‌: https://iti.telangana.gov.in

మేలైన కోర్సులు..
ఐటీఐలో రెండేళ్లు, ఏడాది కాలపరిమితి గల కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం అందిస్తున్నవాటిలో ఏ కోర్సు చేసినా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు. విద్యార్థులకు తరగతి గది శిక్షణతోపాటు వేతనంతో కూడిన ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ కూడా ఇస్తున్నాం. డ్యూయల్‌ ట్రైనింగ్‌లో విద్యార్థులు కంపెనీలకు వెళ్లినప్పుడు వేతనం పొందుతున్నారు. అంటే..శిక్షణలో ఉండగానే జీతం పొందే అవకాశం ఐటీఐలో ఉంది. విద్యార్థి పూర్తిస్థాయిలో ఇండస్ట్రియల్‌ శిక్షణ పొందుతూనే సంపాదించవచ్చు. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు ముందే ఒప్పందం చేసుకొని విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. టాటా ఏరోస్పేస్, మారుతి సుజుకి వంటి పదుల సంఖ్యలో సంస్థలు ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఐటీఐల్లోనే జాబ్‌ మేళాలు నిర్వహించి చక్కటి వేతనాలతో కొలువులు అందిస్తున్నాయి. ఏటా 70 శాతం మంది ఉద్యోగాల్లో చేరుతున్నారు. మిగతా వారు డిప్లొమా కోర్సుల్లో చేరుతున్నారు. కొంతమంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుంటున్నారు.
–పి.జ్యోతిరాణి, మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్‌ (హైదరాబాద్‌)

Published date : 21 Jul 2021 04:04PM

Photo Stories