Skip to main content

బ్యాంక్ జాబ్స్ నియామకాలపై ఆటోమేషన్ ప్రభావం..

బ్యాంకింగ్.. పేరులో ఉన్నట్లే ఉద్యోగ కల్పనల పరంగా కొన్నేళ్లుగా ఎవర్‌గ్రీన్ సెగ్మెంట్‌గా నిలుస్తున్న రంగం. ఇంజనీరింగ్ నుంచి కామర్స్ వరకు.. టెక్నికల్ టు ట్రెడిషనల్ డిగ్రీలు.. అభ్యర్థుల నేపథ్యం ఏదైనా నిరంతరం నియామకాలతో ఉద్యోగార్థుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే.. ఇందులోనూ కార్యకలాపాలకు ఆధునిక సాంకేతికత వినియోగం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే చాలావరకు ఆటోమేటెడ్ (యాంత్రిక) సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఆర్‌ఐ), ఆటోమేషన్ ప్రభావం గణనీయంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఔత్సాహికులు సంబంధిత నైపుణ్యాలు పెంచుకుంటేనే కొలువుదీరే అవకాశం లభిస్తుంది అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ నియామకాలపై ఆటోమేషన్ ప్రభావం గురించి..
30 నుంచి 40 శాతం!
 బ్యాంకింగ్ రంగ కార్యకలాపాల్లో ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం కొత్త నియామకాలపై 30 శాతం నుంచి 40 శాతం మేర ఉంటుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పేర్కొంది. ముఖ్యంగా కిందిస్థాయి సిబ్బంది నియామకాలు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ స్థాయి సిబ్బంది చేపట్టే కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్‌ను 70 నుంచి 80 శాతం మేరకు ఆటోమేషన్ విధానంలో అందిస్తుండటమే ఇందుకు కారణం. దేశంలోని పలు ప్రముఖ బ్యాంకుల్లో శాఖల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు నియామకాలు లేకపోవడానికి ఆటోమేషన్ ప్రభావమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు తమ సేవలను సాధ్యమైన మేరకు ఆటోమేటెడ్ విధానంలో.. కస్టమర్లే సొంతంగా నిర్వహించుకునే రీతిలో అమలు చేస్తున్నాయి.
 
 ప్రముఖ బ్యాంకులకేనా..?
 ఆటోమేషన్ ప్రభావం ప్రముఖ బ్యాంకులకే పరిమితమని; దేశంలోని బ్యాంకింగ్ వినియోగదారుల పరిస్థితుల దృష్ట్యా మానవ ప్రమేయ సేవలు తప్పనిసరని మరో ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ పేర్కొంది. ఉదాహరణకు మన దేశంలోని ఖాతాదారుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారేనని.. జన్‌ధన్ ఖాతాలను పరిగణనలోకి తీసుకున్నా నిరక్షరాస్యులే ఎక్కువని.. అలాంటివారు ఆటోమేషన్ కార్యకలాపాలు, సెల్ఫ్ సర్వీస్ సిస్టమ్స్‌ను వినియోగించుకోవడం కష్టమేనని పేర్కొంది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం.. రానున్న పది, పన్నెండు నెలల కాలంలో 10 నుంచి 11 శాతం మేర నియామకాలు పెరుగుతాయని తెలుస్తోంది.
 
 యాంత్రీకరణ ఇలా..
 బ్యాంకింగ్ రంగంలో యాంత్రీకరణ సేవలు పెరుగుతున్నాయనడానికి తాజా నిదర్శనం.. పాస్‌బుక్‌లో లావాదేవీల నమోదు తీరు. ఒకప్పుడు ఇందుకోసం ఖాతాదారులు స్వయంగా బ్యాంక్‌కు వెళ్లి క్లర్క్/ఆఫీసర్ స్థాయి అధికారిని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు.. పలు ప్రముఖ బ్యాంకులు పాస్‌బుక్ నమోదు యంత్రాలను నెలకొల్పాయి. పాస్‌బుక్‌ను ఇన్‌సర్ట్ చేసి ఏఏ తేదీల మధ్య లావాదేవీల వివరాలు కావాలో పేర్కొంటే క్షణాల్లో సదరు ఎంట్రీలతో పాస్‌బుక్ చేతికందుతోంది. ఈ రంగంలో సాంకేతిక విప్లవానికి తొలి అడుగుగా ఏటీఎంల ఏర్పాటును పేర్కొనవచ్చు. ఎప్పుడైనా డబ్బులు తీసుకునే ఈ వ్యవస్థ.. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా.. అసలు బ్యాంకుకు వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్ ద్వారా అన్ని సేవలు పొందే వీలు కలిగింది.
 
 ఆ సేవలకు సిబ్బంది తప్పనిసరి..
 బ్యాంకింగ్ రంగంలో కొన్ని సేవలకు వినియోగదారులతో నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త వాళ్లతో ఖాతాలు తెరిపించడం, సేవల గురించి వివరించడం వంటి వాటికి మానవ ప్రమేయ కార్యకలాపాలు తప్పనిసరి. కాబట్టి కొత్త నియామకాలపరంగా ఉద్యోగార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అభిప్రాయం. వచ్చే ఆరు నెలల వ్యవధిలో నాలుగు వేల మందిని నియమించుకోవాలని ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఏయూ ఫైనాన్షియర్స్ భావిస్తోంది. రెండేళ్లలో పది వేల మందిని రిక్రూట్ చేసుకునేలా ప్రణాళికలూ రూపొందిస్తోంది. మొన్నటి వరకు మైక్రో ఫైనాన్స్ రంగంలో ఉండి ప్రస్తుతం బ్యాంకుగా అవతరించిన బంధన్ బ్యాంక్ కూడా ప్రస్తుతం ఉన్న 24 వేల మంది సిబ్బందిని  2018 మార్చి నాటికి 30 వేలకు పెంచాలని నిర్ణయించింది.
 
 హైఎండ్ ప్రొఫైల్స్‌పై...
 ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలు.. సాంకేతిక నైపుణ్యాల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుంటే హై ఎండ్ ప్రొఫైల్స్‌వారికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏజీఎం, జీఎం స్థాయి కేడర్లలో నియామకాలపై ఈ ప్రభావం కనిపించనుంది. వీరి స్థానంలో టెక్ నిపుణులను నియమించుకుని రోబోటిక్ సేవల రూపకల్పనకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
 బిగ్‌డేటా, ఐటీ నిపుణులకు డిమాండ్ :
 బ్యాంకింగ్ రంగంలో బిగ్‌డేటా అనలిస్ట్‌లు, బిగ్ డేటా మేనేజ్‌మెంట్ నిపుణులకు డిమాండ్ పెరిగే అవకాశముంది. ఉదాహరణకు కస్టమర్ల ప్రొఫైల్ ఆధారంగా వారికి రుణ మంజూరు అర్హత ఉందో? లేదో?.. బిగ్ డేటా ఆధారంగా నిమిషాల్లోనే తెలుసుకునే వీలు కలుగుతోంది. గతంలో రుణానికి దరఖాస్తు చేస్తే వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు సిబ్బంది  క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాల్సి వచ్చేది. ఇప్పుడు బిగ్‌డేటా సాయంతో కస్టమర్ల గత చెల్లింపుల చిట్టా, బ్యాంకింగ్ కార్యకలాపాల వివరాల ఆధారంగా మంజూరుపై నిమిషాల్లో నిర్ణయం తీసుకోవచ్చు. ఇది పరోక్షంగా బ్యాంకింగ్ రంగంలో ఐటీ నిపుణుల ప్రాధాన్యం పెంచుతోంది. రోబోటిక్స్, బిగ్‌డేటా, డేటాఅనలిస్ట్ వంటి రంగాల్లో నైపుణ్యాలున్నవారి కోసం బ్యాంకులు అన్వేషిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంలలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ సైతం నిర్వహిస్తూ అవసరమైన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.
 
 బ్యాంకింగ్ రంగం.. రిక్రూట్‌మెంట్ గణాంకాలు...
 1.  2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశంలో ప్రైవేటు, ప్రభుత్వ, ఫారెన్ బ్యాంకుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 8.60 లక్షలు
 2.  2016లో 9 వేల మంది పీఓలను నియమించుకున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు. ఇంతే సంఖ్యలో క్లరికర్ కేడర్‌లో నియామకాలు.
 3.  2016-17లో 20 శాతం మేర పెరిగిన నియామకాలు. రానున్న మూడేళ్లలోనూ ఇదే పంథా కొనసాగే అవకాశం.
 
 డిజిటల్ ఆపరేషన్స్‌పై చైతన్యం...
 పట్టణాలు, నగరాల్లోని వినియోగదారుల్లో బ్యాంకు సేవలకు సంబంధించి డిజిటల్ ఆపరేషన్స్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా మొబైల్ ఆధారిత సర్వీసులు ముందంజలో ఉంటున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల వినియోగదారుల ఆసక్తులను, కొన్ని బ్యాంకుల సర్వీసులను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావడం కష్టం. భవిష్యత్తులో మాత్రం బ్యాంకింగ్ రంగంలో ఆటోమేషన్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
 - ప్రొఫెసర్. ఎన్.వి.నరేంద్ర కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, ఐడీఆర్‌బీటీ
Published date : 05 Sep 2017 12:06PM

Photo Stories