Skip to main content

ఆర్కిటెక్ట్‌ అవ్వాలనుకునే వారి కోసం ఈ సమాచారం.. నాటా 2021 నోటిఫికేషన్‌ విడుదల..

సిడ్నీలోని ఒపెరా హౌస్‌.. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ బిల్డింగ్‌ వంటి నిర్మాణాలు చూపరులను కళ్లార్పకుండా చేస్తాయి. ప్రస్తుతం మన దేశంలోనూ.. కొత్తగా నిర్మాణమయ్యే పలు కట్టడాలు చూపరులను మంత్రముగ్దులను చేసేలా ఉంటున్నాయి.

ఇలాంటి భవ్య నిర్మాణాల వెనుక ఉన్నది.. ఆర్కిటెక్ట్‌లే! దీన్నిబట్టి ఆర్కిటెక్చర్‌ రంగ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రంగంలో వేతనాలు సైతం ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఆర్కిటెక్ట్‌ కెరీర్‌పై మక్కువ పెంచుకుంటోంది. కాగా, తాజాగా జాతీయ స్థాయిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)–2021కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. నాటాకు అర్హతలు, పరీక్ష విదానం గురించి తెలుసుకుందాం..

అర్హతలు..
నోటిఫికేఫన్‌ ప్రకారం–నాటాకు దరఖాస్తు చేసుకునేందుకు–ఇంటర్‌/10+2(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారు అర్హులు. మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 50 శాతం మార్కులతో డిప్లొమా(10+3) పూర్తిచేసినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. కాని తాజాగా కనీస మార్కుల నిబంధనలో సడలింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైతే సరిపో తుందని పేర్కొన్నారు.

ఐదేళ్ల బీఆర్క్‌..

  • బీఆర్క్‌ కోర్సు వ్యవధి ఐదేళ్లు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సు.. ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కలయికగా ఉంటుంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, ఆధునిక భావాలు కలిగిన యువతకు ఆర్కిటెక్చర్‌ మంచి కెరీర్‌గా నిలుస్తుంది. ఆర్కిటెక్ట్‌గా స్థిరపడాలనుకొనే యువత.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సును పూర్తిచేయాల్సి ఉంటుంది. నాటా ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, డీమ్డ్‌ యూని వర్సిటీల్లోని బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
  • ఈ కోర్సులో ఆరు నెలల ప్రాక్టికల్‌ ట్రైనింగ్, ప్రాజెక్ట్‌ వర్క్‌ తప్పనిసరి. నాలుగో ఏడాది తర్వాత విద్యార్థులకు జ్యూరీ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బీఆర్క్‌ పట్టా ప్రదానం చేస్తారు. దేశంలోని ఆర్కిటెక్చర్‌ విద్యను, కాలేజీలను పర్యవేక్షించి, నియంత్రించే అధికారం కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ఉంది. స్వతంత్ర ప్రతిపత్తితో ఈ సంస్థ పనిచేస్తుంది. ఆర్కిటెక్చర్‌ విద్యను పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆర్కిటెక్ట్‌గా ప్రాక్టీస్‌ చేయాలంటే మాత్రం ఇందులో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.

నాటా..
నాటాలో మంచి స్కోర్‌ సాధిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 450కిపైగా ఇన్‌స్టిట్యూట్స్‌లో బీఆర్క్‌ కోర్సులో ప్రవేశం పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. జాతీయ స్థాయిలో 26వేలకు పైగా బీఆర్క్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీమ్డ్‌ యూనివర్సిటీలతోసహా అన్ని కాలేజీలు నాటా ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. నాటాలో విద్యార్థుల్లోని ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ఇందులో డ్రాయింగ్, ఈస్థటిక్‌ సెన్సిటివిటీ, క్రిటికల్‌ థింకింగ్‌ వంటి అంశాలపై పరీక్ష జరుగుతుంది. నాటా ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండుసార్లు పరీక్షకు హాజరుకావొచ్చు. రెండింటిలో వచ్చిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.

పరీక్ష విధానం..
నాటాను ఆన్‌లైన్‌ విధానంలో 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షలో 125 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్‌ చాయిస్, మల్టిపుల్‌ సెలక్ట్, ప్రిఫరెన్షియల్‌ చాయిస్‌ టైప్, న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు ఉంటాయి. 1, 2, 3 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

పరీక్షించే అంశాలు..

  • డైగ్రమాటిక్‌ రీజనింగ్‌
  • న్యూమరికల్‌ రీజనింగ్‌
  • వెర్బల్‌ రీజనింగ్‌
  • ఇండక్టివ్‌ రీజనింగ్‌
  • సిట్యువేషనల్‌ జడ్జిమెంట్‌
  • లాజికల్‌ రీజనింగ్‌
  • అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ తదితర అంశాలు ఉంటాయి.
  • మ్యాథ్స్, ఫిజిక్స్, జామెట్రీలోని బేసిక్‌ కాన్సెప్టులపై ప్రశ్నలు అడుగుతారు. అలాగే లాంగ్వేజ్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్, ఎలిమెంట్స్‌ అండ్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ డిజైన్, ఈస్థెటిక్‌ సెన్సిటివిటీ, కలర్‌ థియరీ, లేటరల్‌ థింకింగ్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్, విజువల్‌ పెర్సెప్షన్‌ అండ్‌ కాగ్నిషన్, గ్రాఫిక్స్‌ అండ్‌ ఇమాజినరీ, బిల్డింగ్‌ అనాటమీ అండ్‌ ఆర్కిటెక్చురల్‌ వొకాబ్యులరీ, బేసిక్‌ టెక్నిక్స్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్,నాలెడ్జ్‌ ఆఫ్‌ మెటీరియల్, జనరల్‌ నాలెడ్జ్,కరెంట్‌ అఫైర్స్‌పై ప్రశ్నలు వస్తాయి.

అద్భుత నిర్మాణాలు..
ప్రస్తుతం ప్రపంచం సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటుంది. అబ్బురపరిచే నిర్మాణాలు, ఆకట్టుకునే డిజైన్‌లు.. ఇలా ప్రతిదీ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ రంగం జోరందుకుంటోంది. దీంతో నిర్మాణాలకు చక్కని రూపునిచ్చే ఆర్కిటెక్ట్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రైల్వే, పోస్ట్‌ అండ్‌ టెలిగ్రాఫ్, పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్స్, నేషనల్‌ బిల్డింగ్, ఆర్గనైజేషన్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్, హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. తదితర ప్రభుత్వ అనుబంధ విభాగాలతోపాటు ప్రయివేటు విభాగాల్లోనూ కొలువులు లభిస్తున్నాయి.

ఇద్దరూ ప్రధానమే!
నిర్మాణ రంగానికి సంబంధించి ఆర్కిటెక్చర్, సివిల్‌ ఇంజనీరింగ్‌.. రెండూ ముఖ్యమే! ఆర్కిటెక్ట్‌లు భవనానికి ఆకర్షణీయ రూపం ఇచ్చేందుకు కృషిచేస్తారు. అలాగే సివిల్‌ ఇంజనీర్లుS నిర్మాణానికి సంబంధించి పునాదులు, పటిష్టత, నాణ్యత, వాస్తు, డ్రెయినేజీ, రోడ్లు తదితర అంశాలపై పనిచేస్తారు.

ముఖ్య సమాచారం
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మార్చి 28(ఏప్రిల్‌ సెషన్‌), మే 30 (జూన్‌ సెషన్‌)
  • ఎడిట్‌ ఆప్షన్‌: మార్చి 26–28 (ఏప్రిల్‌ సెషన్‌), మే 25–30 (జూన్‌ సెషన్‌)
  • పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 10, జూన్‌ 12
  • దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.2000(ఒక పరీక్షకు), రూ.4,000 (రెండు పరీక్షలకు); ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 1500 (ఒక పరీక్షకు), రూ.3000(రెండుసార్లు పరీక్ష ).
  • పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.nata.in  
Published date : 25 Mar 2021 04:58PM

Photo Stories