అనైతిక ధోరణులకు ఆలవాలం నేటి పరీక్షా విధానం
Sakshi Education
- ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్, ఆ.నా.వి.
మన దేశంలో రోజురోజుకి విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయనేది వాస్తవం. కర్ణుడి చావుకి వంద కారణాలన్నట్టు విద్యా ప్రమాణాలు దిగజారటానికి కూడా కారణాలు అనేకం. నియంత్రణా సంస్థల ఉదాసీన వైఖరి, అవినీతి మయమైన వ్యవస్థ, భద్రత లోపిస్తున్న పరీక్షా పత్రాల పంపిణీ, నాసిరకమైన మూల్యాంకన విధానం, పర్యవేక్షణ లోపిస్తున్న పరీక్షల నిర్వహణ, లోపభూయిష్టమైన ఫలితాల ప్రకటన వంటి అనేక లోపాలు మన విద్యా వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కానరాని అనైతిక కార్యకలాపాలన్నీ మన దేశ విద్యా వ్యవస్థను పెన వేసుకుని వుండటం మన విద్యార్థి లోకం చేసుకున్న దురదృష్టం.
మన దేశంలోని పరీక్షా విధానం కేవలం ఒక మండలంలోని వంద మందిని వరుసలో నిలబెట్టి వారికి వరుస సంఖ్యను (ర్యాంకులు) ఇవ్వటానికి మాత్రమే పనికొస్తుందేకాని, వారి విషయ పరిజ్ఞానాన్ని, విశ్లేషణాత్మక సామర్ధ్యం, తెలివి తేటలను అంచనా వెయ్యటానికి ఏ మాత్రం ఉపయోగపడదు. కేవలం ర్యాంకుల పరుగు పందెంలో ముందున్నామా లేదా అని ఆలోచిస్తున్నారు తప్ప, ఏ మాత్రం జ్ఞానాన్ని ఆర్జించాం? అని ఎవరూ ఆలోచించక పోవటం విచారకరం. ర్యాంకుల పందేల్లో మొదటి వరుసలో నిలవటానికి ఏన్ని అనైతిక చర్యలకు పాల్పడాలో అన్నింటికీ పాల్పడుతున్నారు. సామూహిక చూచిరాతల దగ్గర్నుంచి, ప్రశ్నాపత్రాలను ముందుగానే చేజిక్కించుకోవటం, మూల్యాంకనం దగ్గర తమ మనుషులతో మాయచెయ్యటం వరకు, వీరు పాల్పడని పాపపు పనంటూ... లేదు. దీని కంతటికీ కారణం లోపభూయిష్టమైన పరీక్షా విధానాలను మన దేశంలో ఇంకా అమలవుతుండటమేనని ప్రాథమిక పరిశీలన స్పష్టం చేస్తోంది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం మార్పులకు నోచుకోని పరిమితమైన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నా పత్రాలను రూపకల్పన చెయ్యటం, కేవలం సిద్ధాంత పరమైన పాఠ్యాంశాలు తప్ప ఆచరణాత్మక అంశాల జోలికి వెళ్ళకపోవటం, ప్రశ్నా పత్రాల రూపకల్పనలో ఏ మాత్రం విశ్లేషాత్మకమైన అంశాలు లేకుండా కేవలం బహుళైచ్ఛిక ప్రశ్నలతో రూపొందిచటం, ప్రతి ప్రశ్న... ‘వివరింపుము‘, ‘చిన్న వ్యాసం రాయుము‘, ‘తెలియ చేయండి‘, అంటూ వుండటంతో విద్యార్థులు ఏ మాత్రం కష్టపడకుండా బట్టీపడితే సరిపోతుంది. ప్రశ్న ఏదైనా విద్యార్థులు రాసే సమాధానం మాత్రం ఒక్కటే అంటే వాళ్ళు పరీక్షలకు ఏ విధంగా సిద్ధమౌతున్నారో అర్థమౌతోంది.
మరోవంక నానాటికి ఉన్నత విద్య చదివే వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. వీరందరి సమాధాన పత్రాలు మూల్యాంకనం చెయ్యటానికి తగినంత మంది అర్హతగల ఉపాధ్యాయులు లేరనేది నగ్న సత్యం. అనుభవం ఉన్న ఉపాధ్యాయులు వివిధ కారణాలతో మూల్యాంకనానికి దూరంగా వుండటంతో, ఎటువంటి అనుభవంలేని జూనియర్ ఉపాధ్యాయులు మూల్యాంకనం చెయ్యటంతో నిజమైన ప్రతిభగల విద్యార్థులు నష్టపోతున్నారు. ఉదాహరణకు సంస్కృతం రెండో భాషగా తీసుకున్న విద్యార్థులు సమాధానలను తెలుగులో కాని ఇంగ్లీషులో కాని రాసే వెసులుబాటు కల్పించారు మన ఏలినవారు. అందువల్ల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసేవారు అమూడు భాషలకు చెందిన వారైవుండవచ్చు. ఒక ఆంగ్ల ఉపాధ్యాయడు సంస్కృత భాష సమాధాన పత్రాన్ని ఎలా మూల్యాంకనం చేయగలడు? అనే ఆలోచన మన అధికారులకు రాకపోవటం మన విద్యా వ్యవస్థ చేసుకున్న దురదృష్టం. అసలు మన ఏలిన వారి దృష్టిలో అసలు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు 0 నుంచి 9 వరకు అంకెలు వస్తే సరిపోతుంది. మూల్యాంకనంలో కూడా అవినీతి ఊడలు కట్టుకుని ఉంటే అధికారులకు మాత్రం అవేవి కనపడవు. ఎందుకంటే వారే లంచం తీసుకుని అర్హత లేని ఉపాధ్యాయులను మూల్యాంకనానికి అనుమతించటం, సీనియర్ ఉపాధ్యాయుల పేరుతో జూనియర్ల చేత మూల్యాంకనం చేయించటం, ఒక సంస్థలో చదివిన విద్యార్థుల సమాధాన పత్రాలను అదే సంస్థ ఉపాధ్యాయులచే మూల్యాంకనం చేయించటం వంటి అనేక అక్రమాలకు తెరతీస్తున్నారు. ఒక్కోదానికి ఒక్కో రేటు.
ఇక వృత్తి విద్యాకోర్సుల్లో అయితే ఈ దరిద్రాలు మరీ ఎక్కువ. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల కన్నా, వాటిలో చేరే విద్యార్థులు తక్కువగా వుండటంతో చాలా కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ద్రవం నుంచి గట్టెక్కడానికి, కళాశాల యాజమాన్యాలు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయి. కళాశాలకు రాకపోయినా పరవాలేదు, హాజరు నుంచి మినహాయిస్తాం, సంవత్సరాంతం పరీక్షల్లో చూచి రాసుకోవచ్చు అంటే విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన వీరే తప్పుడు దారులు తోక్కిస్తున్నారు. ఇక ప్రాక్టికల్స్, ప్రాజెక్టు వర్కు, సెమినార్లు వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక్కో దానికి ఒక్కో రేటు కట్టి విద్యార్థులకు అర్హత పత్రాలను అమ్మకుంటున్నారు. నాలుగే ళ్ళ ఇంజనీరింగ్ విద్యలో ఒక్కటంటే ఒక్క పాఠ్యపుస్తకం కూడా కోనకుండా పాసవుతున్న విద్యార్థులు నేడు కోకొల్లలు.
ఇటువంటి పరీక్షా విధానం వల్ల విద్యార్థుల్లో విశ్లేషణా సామర్ధ్యం, సమస్యలకు పరిష్కారం కనుగొనే తెలివితేటలు రాత సామర్ధ్యం, జీవననైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు వంటివి అడుగంటి పోతున్నాయని గ్రహించిన అఖిల భారత సాంకేతిక విద్యా సమాఖ్య పుస్తకాలను చూచి పరీక్ష రాసే విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. ఇటువంటి విధానం కనుక ఆచరణలోకోస్తే, కేవలం పరీక్షా నిర్వహణేకాక, తరగతి గదుల్లో బోధనా పద్ధతుల దగ్గరినుంచి విద్యార్థి అభ్యాస పద్ధతుల వరకు అన్నింటిలో గణనీయ మార్పు తప్పని సరి.
ఈ నూతన విధానంలో విద్యార్థి సమాధానలను బట్టీ పట్టాల్సిన అవసరం లేదు, పరీక్షలు చూడకుండా రాయాల్సిన అవసరం లేదు. కాపీలు పెట్టి రాయాల్సిన అవసరం అంతకన్నా లేదు. విద్యార్థి పరీక్ష హాలుకు తనకు నచ్చిన పాఠ్యపుస్తకాలు, నోట్సులు, ఇతరత్రా అవసరమైన అన్ని పుస్తకాలు నిరభ్యంతరంగా తీసుకు వెళ్ళవచ్చు. ఈ పరీక్షా విధానం మొత్తం బ్లూమ్స్ అభ్యాసనా విధానంలో ఇక భాగం. బ్లూమ్స్విద్యాభ్యాస విధానంలో మూడు అంచెల్లో విద్యార్థి సామర్ధ్యాన్ని పరీక్షించటం జరుగుతుంది. విద్యార్థి అత్యున్నత స్థాయిలో, తన మేధా పాఠాల గుండా అలోచించి విశ్లేషాణాత్మక సమాధానాలను రాయటం ఈ విధానం యొక్క ముఖ్యోద్ధేశం.
విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య విశ్లేషణాత్మక, గుణాత్మక నైపుణ్యాలు, విధానాలు, సూత్రాలు పెంపొందించుట బ్లూమ్స్ విధానం యొక్క ప్రాథమిక లక్షణం. బ్లూమ్స్విధానం వల్ల విద్యార్థుల్లో మూడు రకాల నైపుణ్యాలు పెంపొందుతాయి. అవి, అభిజ్ఞాన నైపుణ్యాలు (విషయ పరిజ్ఞానం, తెలివి తేటల అభివృద్ధికి దోహదపడతాయి), ప్రభావిత నైపుణ్యాలు (విద్యా వ్యవస్థ లోని భావోద్వేగాలను అర్థం చేసుకోవటం), ఇంద్రియ పరిజ్ఞానం (మానసిక దృఢత్వం, సమస్యలనెదుర్కొనే సామర్ధ్యం, నిగ్రహం) వంటివి. ఇటువంటి నైపుణ్యలు పెంపోందించటానికి బ్లూమ్స్ విధానం పునాది రాయిగా దోహద పడుతుంది.
గత కొద్ది నెలలుగా మనదేశంలోని సాఫ్ట్‌వేర్ రంగం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిన తర్వాత తగినంత పనితీరు కనబర్చకపోవటంతో వీరిని ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తున్నారు. దేనికి?... కారణం, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, స్కాలర్లు, అందరికి కేవలం మార్కుల ఆధారంగా అర్హత పత్రాలు అందుతున్నాయి తప్ప, ఆయా సంబంధిత రంగాలలో వీరు ఎంత వరకు ఉపయోగపడతారు? వీరు చదివిన చదువుల్లో నాణ్యత ఎంత? అనేది ఎవ్వరూ పరీక్షించకపోవటమే. జనాభా పెరిగిపోతున్న భారత దేశం లాంటి దేశంలో కేవలం రాశి తప్ప వాశి సాధ్యపడదని వాదించే వారు లేక పోలేదు.
ఇటువంటి తరుణంలో కఠినమైన నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొస్తే తప్ప మన విద్యా వ్యవస్థ బాగుపడదు. పుస్తకాలు చూసి రాసే విధానం వల్ల అర్థ జ్ఞానం లేని అభ్యాసం, అంకెలు, వాస్తవాలు, సిద్ధాంతాలను బట్టీ పట్టడం, పదేపదే పాఠాలను వల్లె వేయటం వంటి మూస ధోరణులకు స్వస్తి పలకవచ్చు. ఈ విధానం వల్ల ముందు పరీక్షలంటే విద్యార్థుల్లో భాయాందోళనలు దూరమౌతాయి. విశ్లేషణాత్మక, ఊహాత్మక, సృజనాత్మక అలోచనా శక్తి పెంపోంది సమాస్యాత్మకమైన ప్రశ్నలకు తేలికగా సమాధానాలు విద్యార్థి రాయగలుగుతాడు. ఏది ఏమైనా ఈ విధానమైనా... నాణ్యమైన బోధన మీద ఆధారపడి వుంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ విధానంలో ప్రశ్నలకు సమాధానం రాయటమంటూ ఏదీ ఉండదు. విద్యార్థులు ప్రతి విశ్లేషించాల్సి వుంటుంది. ‘భోదన - సాధన’ వంటి పురాతన పద్ధతులకు స్వస్తి చెప్పి, ‘బోధన - శోధన’ అనే నూతన విధానం ద్వారా ప్రస్తుతమున్న పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయగలిగితే, తరగతి గదుల్లోని బోధనా విధానం కూడా తప్పకుండా మార్పు చెందుతుంది.
పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు మన దేశంలో కేవలం సమాచార కేంద్రాలుగా మాత్రమే మనుగడసాగిస్తున్నాయి. వీటిలోకి ప్రవేశించిన విద్యార్థి బుర్రనిండుగా అక్షరం ముక్కలను కుక్కుకొని వస్తున్నాడు తప్ప ఏమాత్రం విజ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నట్టు ఏనాడైతే ఈ సమాచార కేంద్రాలు చర్యలతో, వాదోపవాదాలతో, గోష్ఠులతో, సదస్సులతో పునర్జీవింపబడతయో ఆనాడు విద్యార్థుల్లో వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం పెంపొందుతుంది. ఈ రెండింటినీ నేటి మన విద్యావ్యవస్థలో భూతద్దం పెట్టి వెతికినా కానరావు.
ఇకనైనా మేల్కొని, పరిపూర్ణమైన అభ్యాస విధానాలను రూపొందించక పోతే, ఒక తరాన్ని మన చేజేతులతో నాశనం చేసిన వాళ్ళమౌతాం. కేవలం విధానాలన్నింటినీ కాగితాలకే పరిమితం చేస్తే మళ్ళీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. ఉపాధ్యాయులు కొంతన్నా నిజాయితీగా నడుంబిగిస్తే మార్పు తప్పకుండా వస్తుంది. ప్రతి తరగతిలో తలవంచుకుని పాఠాలు వినే విద్యార్థుల స్థానంలో, తల ఎత్తి ప్రశ్నించే భావిహేతువాదులను రూపొందించాలి. ఏనాడైతే స్వేచ్ఛా సంస్కృతి, సంప్రదాయం, సృజనాత్మక, పరిశీలనాత్మక విద్య అందుబాటులోకొస్తుందో అనాడు ఇది నిజం అవుతుంది.

Published date : 28 May 2018 02:08PM