ఐటీఐతో పాలిటెక్నిక్ డిప్లొమా.. ఎల్‌పీసెట్ నోటిఫికేషన్ వివరాలు ఇవే..
తెలంగాణలో ఐటీఐ చదివిన విద్యార్థులకు నేరుగా పాలిటెక్నిక్ కోర్సుల రెండో సంవత్సరంలో ప్రవేశానికి వీలు కల్పించే లేటరల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు(ఎల్‌పీసెట్) ప్రకటన వెలువడింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ(ఎస్‌బీటీఈటీ).. ఎల్‌పీసెట్–2021 నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 23 తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి పూర్తి చేసిన తర్వాత తక్కువ వ్యవధిలో ఉపాధి కల్పించే కోర్సు ఐటీఐ. రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులవగానే చాలామంది విద్యార్థులు ఏదో ఒక ఉపాధి మార్గం ఎంచుకుంటారు. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే.. పాలిటెక్నికల్ డిప్లొమా రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు. దీనివల్ల ఉన్నత విద్య పరంగా ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులను అభ్యసించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ(ఎస్‌బీటీఈటీ).. ఎల్‌పీసెట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు..
ఎల్‌పీసెట్‌కు దరఖాస్తు చేయాలనుకునే వారు కనీసం 60శాతం మార్కులతో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణతతోపాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (డీఈటీ) నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
ప్రవేశం కల్పించే కోర్సులు..
సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ తదితర విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ఎల్‌పీసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం..
ఎల్‌పీసెట్ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. మొత్తం మూడు విభాగాలు నుంచి 120 మార్కులకు 120 ప్రశ్నలుంటాయి. మ్యాథమెటిక్స్–60, ఫిజిక్స్ –30, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు.
సిలబస్ అంశాలు..
మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్ నుంచి అల్జీబ్రా, అనాలిసిస్, అర్థమెటిక్, కాలిక్యులస్, కాంబినేటోరియల్ గేమ్ సిద్ధాంతం, ఏరియా మేనేజ్‌మెంట్, సర్కిల్, ఫంక్షన్స్, ఫ్రాక్షన్స్, ఫ్రాక్టల్స్, డివిజన్, జియోమెట్రీ, ఇన్ఫినిటీ, లాజిక్–సింబాలిక్ అండ్ మ్యాథమెటికల్, డెసిమల్ ఫ్రాక్షన్స్, కౌంటింగ్, నంబర్ థియరీ, కాంప్లెక్స్ నంబర్స్, న్యూమరికల్ అనాలిసిస్, ట్రయాంగిల్, ట్రిగ్నోమెట్రీ, షేప్స్, వర్డ్ ప్రాబ్లమ్స్ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి.
ఫిజిక్స్: ఇందులో న్యూటన్ మెకానిక్స్, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్, లీనియర్ మూమెంటం, సర్కిలర్ మోషన్ అండ్ రొటేషన్, ఆసిలేషన్స్ అండ్ గ్రేవీయేషన్, ఫ్లూయిడ్ మెకానిక్స్, టెంపరేచర్ అండ్ హీట్, కైనెటిక్ థియరీ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, కండక్టర్లు అండ్ కెపాసిటర్లు, ఎలక్ట్రిక్ సర్క్యూట్లు, ఆయాస్కాంతత్వం, వేవ్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, జియోమెట్రిక్ ఆప్టిక్స్, అటామిక్ ఫిజిక్స్ అండ్ క్వాంటం ఎఫెక్ట్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ తదితర టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
కెమిస్ట్రీ: ఇందులో మ్యాటర్ అండ్ ఇట్స్ స్టేట్, అటామిక్ స్ట్రక్షర్, కెమికల్ బాండింగ్, పిరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, యాసిడ్ బేస్ అండ్ సాల్ట్స్, బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్, ఎలక్ట్రోలాసిస్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్, ఫ్యూయెల్స్, మెటలర్జీ, మెటల్ అండ్ నాన్‌మెటల్, కెమికల్ రియాక్షన్స్, రేడియోసిటీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కాటలైస్ట్, హైడ్రోకార్బన్స్, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండ్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ది పీహెచ్ స్కేల్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల అమ్మకం చివరి తేదీ: 21.06.2021
రూ.100 ఆలస్య రుసుముతో దరఖాస్తుల అమ్మకానికి చివరి తేదీ: 22.06.2021
పూర్తిచేసిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 23.06.2021
పరీక్ష తేదీ: త్వరలో వెల్లడిస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.sbtet.telangana.gov.in