Skip to main content

ఆహార రంగంలో కొలువుల తరంగం.. మంచి భవిష్యత్తు అందుకోండిలా..

ఆహారం లేకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆహార రంగంలో కెరీర్‌ను కోరుకునే వారికి ఫుడ్‌టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫుడ్‌ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ కోర్సులు చదవాలనుకునే అభ్యర్థుల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ నిఫ్టెమ్‌).. 2021–22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. నిఫ్టెమ్‌ అందిస్తున్న ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు.. ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం...
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన హరియాణ (సోనేపట్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టెమ్‌).. ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) గుర్తింపు కలిగిన డీమ్డ్‌ యూనివర్సిటీ ఈ నిఫ్టెమ్‌. అధునాతన సౌకర్యాలు, వసతులతో కూడిన విద్యాసంస్థ ఇది.

కోర్సులు–ప్రవేశాలు..
  • బీటెక్‌: ఇది నాలుగేళ్ల కోర్సు. అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు–189. బీటెక్‌ పుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్‌ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్‌–2021లో అర్హత సాధించి ఉండటం తప్పనిసరి. సెంట్రల్‌ సీట్‌ అలోకేషన్‌ బోర్డ్‌(సీఎస్‌ఏబీ) నిర్వహించే సీటు కేటాయింపు ద్వారా ప్రవేశం పొందవచ్చు.
  • ఎంటెక్‌: ఈ కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో ఈ కోర్సు అందిస్తారు. ఒక్కో విభాగంలో 18 సీట్లుంటాయి. కనీసం 60శాతం మార్కులతో సంబంధిత విభాగంలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. గేట్‌ స్కోర్‌లేని వారు నిఫ్టెమ్‌ నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
  • ఎంబీఏ: ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌/ఫైనాన్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ విభాగాల్లో ఎంబీఏ చేయచ్చు. మొత్తం సీట్లు–32. కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/తత్సమాన విద్య ఉత్తీర్ణులై ఉండాలి. గత రెండేళ్ల క్యాట్‌/మ్యాట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ సెట్‌ల స్కోర్‌లేని వారికి ఇంటర్నల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
  • పీహెచ్‌డీ: మొత్తం సీట్లు–33. అగ్రికల్చర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సైన్సెస్, బేసిక్‌ అండ్‌ అప్లయిడ్‌ సైన్సెస్, ఫుడ్‌ ఇంజనీరింగ్, ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీలో చేరొచ్చు. కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. నెట్‌ జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించాలి. లేదా నిఫ్టెమ్‌ నిర్వహించే రీసెర్చ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, ఇంటర్వూ్య ద్వారా ప్రవేశం కల్పిస్తారు. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ జేఆర్‌ఎఫ్‌/ఇతర జేఆర్‌ఎఫ్‌ అర్హత సాధించిన వారు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరు ఇంటర్వూకు హాజరవ్వాల్సి ఉంటుంది.

ప్రోత్సాహకాలు..
  • బీటెక్‌/ఎంటెక్‌లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నిఫ్టెమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. కార్పొరేట్‌ స్కాలర్‌షిప్‌ పేరిట ప్రతి నెలా స్టయిపెండ్‌ పొందవచ్చు.
  • గేట్‌ ర్యాంకుతో ఎంటెక్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.
  • ఫుల్‌ టైం పీహెచ్‌డీలో చేరిన వారిలో కొంత మందిని ఎంపిక చేసి నిఫ్టెమ్‌ ఫెలోషిప్‌ ఇస్తారు.

ఉద్యోగావకాశాలు..
దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఒకటి. ఈ రంగంలో డిమాండ్‌ తగ్గట్టు నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత లేదు. దీంతో ఫుడ్‌ టెక్నాలజీ నిపుణులకు అధిక డిమాండ్‌ నెలకొంది. కాబట్టి ఫుడ్‌టెక్నాలజీలో కోర్సులు పూర్తిచేసి.. నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కొలువులు దక్కించుకోవచ్చు. ఫుడ్‌సేఫ్టీ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లు, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ డిపార్ట్‌మెంట్లు, స్టోరేజ్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సంస్థలు, లేబొరేటరీలు, క్వాలిటీ అష్యూరెన్స్‌ యూనిట్లు మొదలైన విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఫుడ్‌ టెక్నాలజిస్ట్, క్వాలిటీ కంట్రోల్‌ ఎక్స్‌పర్ట్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్, న్యూట్రిషనిస్ట్‌ తదితర ఉద్యోగాల్లో చేరొచ్చు.

కొలువులిచ్చే సంస్థలు..
  • నెస్లే
  • డాబర్‌ ఇండియా
  • ఐటీసీ లిమిటెడ్
  • ఆగ్రో టెక్‌ఫుడ్స్
  • పార్లే
  • అమూల్
  • పెప్సీకో
  • బ్రిటానియా
  • హిందుస్థాన్‌ యూనీలివర్
  • గోద్రేజ్
  • క్యాడ్‌బరీ
  • ఎంటీఆర్‌ తదితర సంస్థలు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

వేతనాలు
..
గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులతో ఆహార రంగంలో కొలువు సొంతం చేసుకున్న వారికి వార్షిక ప్రారంభ వేతనం రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఉంటుంది. అనుభవం, పనితీరు ఆధారంగా వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం
..
దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రాములకు దరఖాస్తుకు చివరి తేదీ: 08.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.niftem.ac.in  
Published date : 26 Jul 2021 01:33PM

Photo Stories