Skip to main content

2030 నాటికి ప్రతి జిల్లాలో ఒక మల్టీ డిసిప్లినరీ కళాశాల.. అస‌లేంటి ఈ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌?

దేశంలోని పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు.. మల్టీ డిసిప్లినరీ విధానం అమలు చేస్తున్నాయి. కొత్త జాతీయ విద్యా విధానంలోనూ ‘మల్టీ డిసిప్లినరీ’ విధానానికి పెద్ద పీట వేశారు.

 2030 నాటికి ప్రతి జిల్లాలో ఒక మల్టీ డిసిప్లినరీ కళాశాలను అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు. అసలు మల్టీడిసిప్లినరీ విధానం అంటే ఏమిటి.. ఈ విధానం తీరుతెన్నులు.. దీనితో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం..

మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అంటే.. ఒకే సమయంలో విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ భిన్నమైన విభాగాల సబ్జెక్టులను అధ్యయనం చేసేందుకు వీలు కల్పించడం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా విధానం ఎప్పటి నుంచో అమలవుతోంది. కొన్ని దేశాల్లో ఆర్ట్స్, సైన్స్‌ సబ్జెక్టులను కలిపి చదివేందుకు, అవసరమైనప్పుడు ఏదైనా సబ్జెక్టు మార్చుకునే అవకాశం కూడా ఉంది.

కొత్త విద్యా విధానం..
నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ లక్ష్యాల్లో ముఖ్యమైనది.. మల్టీ డిసిప్లినరీ విధానం. ఇంజనీరింగ్‌కు ప్రముఖ విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఐఐటీల్లో సైతం ఆర్ట్స్, హుమానిటీస్‌ కోర్సులను ప్రవేశ పెట్టాలని కొత్త విద్యావిధానం ప్రతిపాదించింది. 2040నాటి కల్లా దేశంలోని దాదాపు అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో మల్టీడిసిప్లినరీ విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మల్టీ డిసిప్లినరీ విధానం వల్ల విద్యార్థి ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ భిన్న రంగాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. ఆర్ట్స్, హుమానిటీస్‌ సబ్జెక్టులను కూడా చదువుతారు; అలాగే సైన్స్‌ విద్యార్థులు.. సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. విద్యార్థి మ్యాథమెటిక్స్‌తో పాటు పబ్లిక్‌ పాలసీని అధ్యయనం చేయవచ్చు. జర్నలిజం లేదా పర్యావరణం కోర్సులు తీసుకోవచ్చు.

విభిన్న అంశాలపై అవగాహన..
ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే మల్టీడిసిప్లినరీ విధానం అమలులో ఉంది. ఈ విధానంలో విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వారిలోని భిన్న భావనలు, ఆలోచనలు, దృక్పథాలను, సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా విద్యా ర్థులు తమకు నిజంగా దేనిపై ఆసక్తి ఉందో.. ఆ రంగంలో రాణించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కాలేజీలో అధ్యాపకులు కూడా విద్యార్థుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడంతోపాటు వారి ఆసక్తి మేరకు కోర్సులను బోధిస్తారు.

భిన్న నైపుణ్యాలు..
విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులను అధ్యయ నం చేయడం వల్ల భిన్న నైపుణ్యాలు అలవడుతాయి. ఈ విధానంలో ఉన్నత విద్య అనేది అధునా తన జ్ఞానాన్ని పొందడం మాత్రమే గాక.. విభిన్న అంశాలు నేర్చుకునేందుకు దోహదపడుతుంది. విద్యార్థి ఆసక్తులను గుర్తించడంతో పాటు వారి అభిరుచులను పెంపొందించుకోవడం, ప్రతిభను మెరుగుపరచుకోవడానికి మల్టీ డిసిప్లినరీ విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టుల నిపుణులను తరచూ కలవడం ద్వారా సదరు అధ్యాపకుల నుంచి మరింత విజ్ఞానం పొందేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థి సంపూర్ణ పౌరుడిగా ఎదిగేందుకు, ఏదో ఒక విభాగానికే పరిమితం కాకుండా.. విభిన్న నైపుణ్యాలు సముపార్జించేందుకు దోహదం చేస్తుంది. తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఉపాధి పొందేందుకు దన్నుగా నిలుస్తుంది మల్టీడిసిప్లినరీ విధానం.

విమర్శనాత్మక ఆలోచన..
మల్టీడిసిప్లినరీ విధానం ద్వారా విద్యార్థిలో తార్కిక ధోరణి, విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. ఉదాహరణకు కామర్స్‌/బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న విద్యార్థి.. మల్టీ డిసిప్లినరీ విధానంలో ఎలక్టివ్‌ సబ్జెక్టులుగా పర్యావరణం, ఆర్థికశాస్త్రాలను తీసుకుంటే.. ఆ విద్యార్థి కోర్సు తర్వాత ‘గ్రీన్‌ మార్కెటింగ్‌’పై కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేందుకు దారి చూపుతుంది. ఇది మరికొందరికి ఉపాధిని చూపే మార్గం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక, సామాజిక సమస్యలను విమర్శనాత్మకంగా పరిష్కరించే నైపుణ్యాలు బహుళ కోర్సులు పూర్తి చేసిన వారిలో అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి: part 2: మల్టీ డిసిప్లినరీ విధానంతో అవకాశాల విస్తరణతో కొత్త ఉద్యోగాల సృష్టి..

Published date : 26 Mar 2021 03:38PM

Photo Stories