2021 నుంచి ఏటా నాలుగు సార్లు జరగనున్న ఐఐటీ మెయిన్ పరీక్ష.. పదమూడు భాషల్లో నిర్వహణ..
విద్యార్థులు తమ అభీష్టంమేరకు నాలుగుసార్లూ హాజరు కావచ్చు. ఒకటి కంటే ఎక్కువసార్లు రాస్తే.. ర్యాంకుల కేటాయింపులో బెస్ట్ స్కోర్‌నే పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు..ఇంటర్మీడియెట్‌లో కనీసం 75 శాతం మార్కులు; లేదా బోర్డ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న వారికే సీట్ల కేటాయింపు జరుగుతుందనే నిబంధనపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. జేఈఈ-మెయిన్-2021 విధి విధానాలు.. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు.. విద్యార్థులు బెస్ట్ స్కోర్ సాధించడానికి ప్రిపరేషన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం...
జేఈఈ-మెయిన్-2021లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన మార్పు.. పరీక్షను నాలుగుసార్లు నిర్వహించాలనే నిర్ణయం! ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ-మెయిన్‌ను నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన సెషన్‌లో హాజరయ్యే అవకాశం ఉంది. అటెంప్ట్‌ల పరంగా ఎలాంటి పరిమితి లేదు. నాలుగుసార్లు హాజరవ్వచ్చు. ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు హాజరైతే.. ఏ సెషన్‌లో అత్యుత్తమ స్కోర్ సాధిం చారో దానినే పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిం చనున్నారు. ఉదాహరణకు ఫిబ్రవరి సెషన్‌లో తక్కువ స్కోర్, ఏప్రిల్ సెషన్‌లో ఎక్కువ స్కోర్ వస్తే.. ఏప్రిల్ సెషన్ స్కోర్‌నే ర్యాంకుల కేటాయింపులో పరిగణిస్తారు.
పదమూడు భాషల్లో పరీక్ష..
జేఈఈ-మెయిన్-2021ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం పదమూడు భాషల్లో నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, హిందీ,తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, మళయాళం, పంజాబీ, తమిళం, ఉర్దూ మీడియంలలో విద్యార్థి తనకు నచ్చిన భాషలో పరీక్షరాసే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటర్మీడియెట్ ప్రాంతీయ లేదా మాతృభాషలో చదివిన విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పశ్నల అనువాదంలో లోపాలు లేకుండా చూస్తేనే ప్రాంతీయ భాషల్లో నిర్వహణ ఉద్దేశం నెరవేరుతుందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఛాయిస్ విధానం..
జేఈఈ-మెయిన్-2021లో మరో కీలక మార్పు.. పరీక్షలో ఛాయిస్ విధానానికి శ్రీకారం చుట్టడం! పార్ట్-ఎ, పార్ట్-బిలుగా జరిగే పరీక్షలో.. పార్ట్-బిలోని పది ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం గుర్తిస్తే సరిపోతుంది. కొవిడ్ పరిస్థితులు, ఆన్‌లైన్ క్లాస్‌లు.. ఆయా బోర్డ్‌లు సిలబస్‌ను కుదించిన నేపథ్యంలో విద్యార్థులకు సానుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాని మొత్తంగా సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. గతంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేకుండా యథా తథంగా ఉంచడంపై విద్యార్థుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్ట్-ఎ సిలబస్‌లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో.. 2020-21లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది.
ఇంకా తెలుసుకోండి: part 2: జేఈఈ మెయిన్‌లో ఉన్న ఈ నిబంధనపై విద్యార్థుల్లో తీవ్ర వ్యతిరేకత..