Union Budget: పన్ను పోటు ఉంటుందా...? నిర్మలమ్మ కనికరిస్తుందా...!
2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల స్లాబ్ రేట్లలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో మాత్రం స్వల్ప రేట్లతో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది.
పన్ను చెల్లింపుదారుల అత్యధిక పన్ను రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. రూ. 20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే.. రూ.10–12.5 లక్షల నుంచి రూ.10–20 లక్షలకు, 20 శాతం పన్ను రేటు పరిధిలోకి వచ్చే స్లాబ్‌ని విస్తరించడంతో పాటు దీనికి అనుబంధంగా ఉండాలని ఆశిస్తున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు. అలాగే, గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన రిటర్న్స్‌కు ఈ విధానాన్ని పొడిగించాలని కోరుతున్నారు.
పన్ను మినహాయింపు పరిమితులు
అలాగే ఆర్థిక సంస్థల ద్వారా మంజూరైన రుణాలకు సెక్షన్ 80 ఈఈబీ కింద మినహాయింపు ఉంది. అయితే.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే అది వర్తిస్తోంది. ఈ కాలపరిమితిని 2025 మార్చి 31 వరకు పొడిగించాలంటున్నారు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు.
పీఎఫ్ కంట్రిబ్యూషన్ మినహాయింపు
2020 బడ్జెట్ ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ లో యాజమాన్య వాటా రూ. 7.5 లక్షలు దాటితే పన్ను వర్తిస్తుంది. అలాగే పీఎఫ్ నిధుల ఉపసంహరణపై కూడా పన్ను విధించబడుతోంది. అయితే.. ఈ పన్నులో మినహాయింపు కోరుతున్నారు పన్ను చెల్లింపుదారులు. ఇక ఇప్పటికే కంట్రిబ్యూషన్ సంవత్సరంలో పన్ను చెల్లించి ఉంటే, సేకరించిన పీఎఫ్/ఎన్‌పీఎస్/ఎస్‌ఏఎఫ్ బ్యాలెన్స్‌లో ఏదైనా భాగానికి డబుల్ టాక్సేషన్‌ను తొలగించే విధానంపై స్పష్టత ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు.
టాక్స్ రిటర్న్స్ సవరణ కోసం కాలపరిమితి
రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి గడువు కాగా.. సవరించిన రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు తేదీ డిసెంబర్ 31. అయితే.. తక్కువ వ్యవధి ఉండటంతో లోపాలు సరిచేసుకునేందుకు తగినంత అవకాశం లభించడం లేదంటున్నారు. గడువును ఏడాదికి పునరుద్ధరిస్తే సవరింపులకు తగిన సమయం లభిస్తుందని పన్ను చెల్లింపుదారులు చెబుతున్నారు.