Skip to main content

అవకాశాల తరంగం బీఎఫ్‌ఎస్‌ఐ

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ).. నేటి యువతకు అవకాశాల హారం! ఇది ట్రెడిషన్ డిగ్రీ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు అన్ని నేపథ్యాల వారికీ లక్షల సంఖ్యలో అవకాశాలను అందుబాటులో ఉంచుతోంది. వచ్చే ఏడాది కాలంలో రెండున్నర లక్షల ఉద్యోగాల కల్పనకు వేదికగా నిలవనున్న బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో నియామక శైలిపై విశ్లేషణ...
బీఎఫ్‌ఎస్‌ఐ.. ఇప్పుడు యువతకు అవకాశాల పరంగా బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ మొదలు.. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వంటి టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలకు వేదికగా మారుతోంది. కొత్త సంస్కరణల అమలు, కొత్త బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల ఏర్పాటుకు అనుమతులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి నిబంధనల్లో సడలింపు వంటి నిర్ణయాలు.. బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థల కార్యకలాపాలను శరవేగంగా విస్తరిస్తున్నాయి. మరింత సమర్థ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైన నిపుణుల కోసం అన్వేషిస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిక్రూటింగ్ ప్రక్రియలు చేపడుతున్నాయి.

రెండున్నర లక్షల ఉద్యోగాలు
26 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేటు బ్యాంకులు, 40కు పైగా ఇన్సూరెన్స్ సంస్థల్లో వచ్చే ఏడాది కాలంలో 2.45 లక్షల కొత్త నియామకాలు జరుగుతాయని అంచనా. ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్ పేరుతో ప్రైవేట్ బ్యాంకులకు అనుమతులు ఇవ్వడం.. అవి ఈ ఏడాదిలోనే కార్యకలాపాల ప్రారంభం దిశగా అడుగులు వేస్తుండటంతో నియామకాల అంచనాలు నిజమవుతాయన్నది నిపుణుల అభిప్రాయం. అంతేకాకుండా 2016లో దాదాపు లక్షన్నర ఉద్యోగాలతో టాప్ రిక్రూటర్‌గా బీఎఫ్‌ఎస్‌ఐ నిలవనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయిదేళ్లలో పది లక్షలు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డీసీ) అంచనాల ప్రకారం వచ్చే అయిదేళ్లలో (2017-2022) బీఎఫ్‌ఎస్‌ఐ పరిధిలోని బ్యాంకింగ్ అండ్ ఎన్‌బీఎఫ్‌సీ (Non Banking Financial Companies), స్టాక్ బ్రోకింగ్ హౌసెస్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థల్లో 1.01 మిలియన్ ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఎస్‌డీసీ ప్రత్యేకంగా బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల్లో శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

నియామకాలు ఇలా..
  • క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్ స్కేల్-1 కేడర్ ఉద్యోగాలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.
  • ప్రైవేటు బ్యాంకులు సైతం తమ బ్యాంకుల్లో నియామకాలకు ప్రత్యేకంగా సొంతంగా రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ వంటి విధానాలు అవలంబిస్తున్నాయి. కొత్త నియామకాల పరంగా ప్రైవేటు బ్యాంకులు అనుసరిస్తున్న మరో కొత్త విధానం కొలాబరేటివ్ కోర్సులను నిర్వహించి వాటిని పూర్తిచేసిన అభ్యర్థులకు నేరుగా ఆఫర్ లెటర్స్ అందించడం. ముఖ్యంగా ప్రొబేషనరీ ఆఫీసర్ కేడర్ నియామకాలకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు తదితర ప్రైవేటు బ్యాంకులు మణిపాల్ యూనివర్సిటీతో కలిసి సంయుక్తంగా మేనేజ్‌మెంట్ పీజీ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఐటీ నిపుణులకు పెరుగుతున్న అవకాశాలు
ఇటీవల కాలంలో బ్యాంకుల్లో ఆధునిక టెక్నాలజీ ఆధారిత సేవలు ఊపందుకుంటున్నాయి. మిస్డ్ కాల్ అలెర్ట్‌తో కస్టమర్స్‌కు అవసరమైన సేవలందించడం మొదలు.. ఈ-బ్యాంకింగ్ వరకు పలు స్థాయిల్లో టెక్నాలజీ ఆధారిత సేవలకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిపుణులకు కూడా బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న సేవల్లో 30 నుంచి 40 శాతం సేవలు టెక్నాలజీ ఆధారితంగానే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
  • బ్యాంకుల్లో ఐటీ రంగ స్పెషలిస్ట్ నియామకాల పరంగా ప్రస్తుతం మూడు ప్రొఫైల్స్ ముందంజలో ఉన్నాయి. అవి.. క్లౌడ్ సర్వీసెస్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్. వినియోగదారులకు వేగంగా, సులభంగా అదే విధంగా వారు స్వయంగా కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రొడక్ట్స్‌ను, సర్వీసెస్‌ను రూపొందించే క్రమంలో ఇంటర్నెట్ ఆధారిత సేవలందించేందుకు క్లౌడ్ టెక్నాలజీ స్పెషలిస్టులకు డిమాండ్ పెరిగింది.
  • అదే విధంగా వినియోగదారుల అభిరుచులు, ఆసక్తులు గుర్తించేందుకు సంబంధిత డేటాను నిక్షిప్తం చేసేందుకు డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ స్పెషలిస్టుల అవసరం ఏర్పడుతోంది.

ఐటీ విభాగాల్లో ఇతర జాబ్ ప్రొఫైల్స్
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఐటీ విభాగంలో ఇతర డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే వెబ్ డెవలపర్స్, వెబ్ కంటెంట్ మేనేజ్‌మెంట్, నెట్‌వర్కింగ్ ప్రొఫైల్స్‌లో అధిక ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో డాట్ నెట్, జావా, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులకు రిక్రూట్‌మెంట్స్ పరంగా డిమాండ్ ఏర్పడింది.

సంస్థల క్యాంపస్ బాట
బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు కూడా ఉద్యోగ నియామకాలకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ అనలిస్ట్, స్ట్రాటజిక్ అనలిస్ట్, కార్పొరేట్ స్ట్రాటజీ వంటి జాబ్ ప్రొఫైల్స్ కోసం సంస్థలు ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేటు రంగంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ముందంజలో ఉన్నాయి. ఇన్సూరెన్స్ సంస్థలు యాక్చుయేరియల్ స్పెషలిస్ట్స్, స్టాటిస్టికల్ ఎక్స్‌పర్ట్స్ కోసం సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లు (ఐఎస్‌ఐ-కోల్‌కత, ఎన్‌ఐఏ-పుణె ఇతర స్పెషలైజ్డ్ ఇన్‌స్టిట్యూట్స్)లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి.

హోదాలు.. మారుతున్న పేర్లు
అభ్యర్థులను ఆకర్షించేందుకు బ్యాంకులు వివిధ హోదాలకు కొత్త పేర్లు రూపొందిస్తున్నాయి. గతంలో క్లర్క్‌గా పేర్కొనే హోదా కొత్తగా కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌గా మారుతోంది. ఇన్సూరెన్స్ సంస్థల్లో సంప్రదాయ ‘ఏజెంట్’ హోదా పేరు ‘డెరైక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్’, ‘బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్’గా కొత్త రూపును సంతరించుకుంటోంది.

వేతనాలు ఆకర్షణీయంగా
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వేతనాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లో అన్ని అలవెన్సులు కలిపి, నెలకు కనీసం రూ.30 వేల వేతనం లభిస్తోంది. మిడిల్ లెవల్‌లో, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేపట్టే నియామకాల్లో అభ్యర్థులు ఎంపికైన జాబ్ ప్రొఫైల్స్ ఆధారంగా రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నాయి.

ప్రస్తుతం బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో ఎంట్రీ లెవల్ నుంచి టాప్ లెవల్ వరకు వివిధ హోదాల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్‌లో క్లరికల్, పీవో కేడర్ ఔత్సాహికులు ఆయా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా కెరీర్‌లో ముందంజలో నిలవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. వీటికితోడు సాంకేతిక నైపుణ్యాలు కూడా సొంతమైతే కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించడం సులభం అవుతుంది.
- ఎం.బి.ఎన్.రావు, హెడ్, బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్ స్కిల్ కౌన్సిల్.
Published date : 02 Aug 2016 02:05PM

Photo Stories