Skip to main content

త్వరలో 2011 గ్రూప్-1 రివైజ్డ్ మెరిట్ జాబితా

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకు ముందు నిర్వహించిన 2011 గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి సవరించిన జాబితాను వచ్చేవారంలో విడుదల చేయనుంది. ఈమేరకు కసరత్తు కొలిక్కి వచ్చిందని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి సాయి తెలిపారు.
ఈసారి న్యాయవివాదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసు కుంటున్నామన్నారు. 2011 గ్రూప్-1కు సంబంధించి తొలి నుంచి అనేక ఆటంకాలు ఎదురవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్‌లో 150 ప్రశ్నలకు 6 ప్రశ్నలు తప్పుగా రాగా, దానిపై న్యాయవివాదం నెలకొంది. దీనిపై ఎన్ని అభ్యం తరాలు వచ్చినా అప్పటి కమిషన్ అధికారులు పట్టించు కోలేదు. చివరకు హైకోర్టు ఈ ప్రశ్నలకు సంబంధించి యూపీఎస్‌సీతో పరిశీలన చేయించాలని సూచించినా దీనిపై కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటికే మెయిన్స్‌ పరీక్షను కూడా పూర్తిచేసి ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. మరోపక్క ప్రశ్నలపై ఏర్పాటైన కమిటీ ప్రిలిమ్స్‌లోని ఆరు ప్రశ్నలు, సమాధానాలు తప్పు అని తేల్చగా, చివరకు ఈ వ్యవహారంలో దీర్ఘకాలిక విచారణ అనంతరం కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు ప్రశ్నలు తొలగించి ప్రిలిమ్స్ అర్హుల జాబితా రూపొందించి మళ్లీ మెయిన్స్‌ను నిర్వహించాలని సూచించింది. దీనిపై గత సెప్టెంబర్‌లో ఏపీపీఎస్సీ మెయిన్స్‌ను తిరిగి నిర్వహించింది. కీ విడుదల అనంతరం దాదాపు 42 మార్కులకు సంబంధించి తప్పులు దొర్లడంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు నిపుణుల కమిటీ సూచనల మేరకు ఆ ప్రశ్నలన్నిటినీ తొలగించి ఫలితాలు విడుదల చేసి, ఇంటర్వ్యూ తేదీలను కూడా కమిషన్ ప్రకటించింది. ఈ ఫలితాల జాబితాలో అనేక పొరపాట్లు చోటుచేసు కోవడంతో మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. 42 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు తొలగించినందున ఆ మేరకు స్కేలింగ్ చేసి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేయాల్సి ఉండగా స్కేలింగ్ చేయకుండానే జాబితా ఇవ్వడంతో తప్పులు దొర్లాయి. చివరకు ఇంటర్వ్యూలను వాయిదా వేసి మళ్లీ సవరించిన మెరిట్ జాబితాను విడుదల చేస్తామని కమిషన్ ప్రకటించింది.
Published date : 24 Feb 2017 02:09PM

Photo Stories