Skip to main content

ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ టెస్టు వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం మార్చి 10వ తేదీన నిర్వహించాల్సిన స్క్రీనింగ్ టెస్టును వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 1న ప్రకటించింది.
పాలనాపరమైన కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. స్క్రీనింగ్ టెస్టును ఎప్పుడు నిర్వహించేదీ తరువాత తెలియజేస్తామని పేర్కొంది.

నిబంధనలకు విరుద్ధంగా స్క్రీనింగ్ టెస్టు..
ఇలా ఉండగా ఏపీపీఎస్సీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో తగిన సంఖ్యలో దరఖాస్తులు లేకపోయినా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో150లో స్క్రీనింగ్ టెస్టు నిర్వహణపై స్పష్టమైన నిబంధనలు ప్రకటించింది. సంబంధిత నోటిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించి ఉంటేనే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని పేర్కొంది. అంతకు తక్కువగా ఉంటే కనుక స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడానికి వీల్లేదు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు 16,130 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ పోస్టులకు ఫిబ్రవరి 24న స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తామని నోటిఫికేషన్లో తేదీని ప్రకటించారు.

ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతోనే వాయిదా..
తగినంత సంఖ్యలో దరఖాస్తులు లేకున్నా ఇలా ఉండగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు ఏపీపీఎస్సీ నిర్ణయించి ఆమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. స్క్రీనింగ్ టెస్టు నిర్వహణకు 25వేలు దరఖాస్తులుండాలన్న నిబంధనను తొలగించాలని, దరఖాస్తుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని పోస్టులకూ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు వీలుగా ఏపీపీఎస్సీకి అనుమతించాలని కోరింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అందుకోసమే ఫిబ్రవరి 24న నిర్వహించాల్సిన స్క్రీనింగ్ టెస్టును మార్చి 10వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఇప్పట్లో ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం లేకపోవడంతో మార్చి 10న జరగనున్న స్క్రీనింగ్ టెస్టును కూడా వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Published date : 02 Mar 2019 02:32PM

Photo Stories