Skip to main content

కొత్త సిలబస్‌ను చదవడం ఎలా సాధ్యం ?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కొత్తగా తెరపైకి తెచ్చిన గ్రూప్-1 పరీక్షల ముసాయిదా పాఠ్యప్రణాళిక(సిలబస్) నిరుద్యోగులను బెంబేలెత్తిస్తోంది.
ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం రూపొందించిన ఈ సిలబస్ వారికి గుదిబండగా మారుతోంది. ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో మేథమెటిక్స్(గణితం) అంశాలను అధికంగా చేర్చారు. ప్రిలిమ్స్‌లో కేవలం అర మార్కు, ఒక మార్కు తేడాతో వేలాది మంది అభ్యర్థులు అనర్హులుగా మారుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 60 మార్కులకు గణితానికి సంబంధించి ప్రశ్నలే ఉండడం అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. కేవలం మేథ్స్ నేపథ్యం ఉన్న వారికే ఈ సిలబస్ ఉపయోగకరమని, నాన్ మేథమెటిక్స్ అభ్యర్థులకు తీరని నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇతర సబ్జెక్టుల్లో పది మార్కుల ప్రశ్నకు సమాధానం రాస్తే గరిష్టంగా అయిదారు మార్కులు రావడం కష్టమని, అదే మేథ్స్ ప్రశ్నకు సరైన సమాధానం రాస్తే పదికి పది మార్కులు వస్తాయని పేర్కొంటున్నారు. దీనివల్ల గణితం బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే గ్రూప్-1 పోస్టులు దక్కుతాయని అంటున్నారు.

ఏడాదిలోనే సిలబస్‌లో మార్పులు..
ఏపీపీఎస్సీ 2016లో నోటిఫికేషన్లు విడుదల చేసిన సమయంలో సిలబస్‌లో మార్పులు చేసింది. అంతకు ముందు ఉన్న సిలబస్‌లో పలు మార్పులు చేసి కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. ఆ పరీక్షలు గత ఏడాది ముగిశాయి. ఇంతలోనే మళ్లీ సిలబస్‌లో మార్పులు చేసింది. గ్రూప్-1 ముసాయిదా సిలబస్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పేపర్-1లో 120 మార్కులు, పేపర్-2లో 120 మార్కులు ఉంటాయి. ఈ రెండో పేపర్‌లోని తొలి 60 మార్కుల ప్రశ్నల సిలబస్సే ఇప్పుడు చిక్కులు తెస్తోంది. గతంలో జనరల్, మెంటల్ ఎబిలిటీ విభాగంలో మేథ్స్ సబ్జెక్టు చాలా తేలికగా ఉండేది. 5 నుంచి 10 మార్కుల వరకు మాత్రమే గణితంపై ప్రశ్నలు అడిగేవారు. కానీ, ఈసారి ఆ విభాగంలో మొత్తం ప్యూర్ మేథ్స్ సబ్జెక్టును ప్రవేశపెట్టారు. 60 శాతం ప్రశ్నలు ప్యూర్‌మేథ్స్ సబ్జెక్టువే ఉండేలా సిలబస్ రూపొందించారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రీజనింగ్ వంటివి మాత్రమే ఉండగా ఇప్పుడు చాలా కఠినమైన సిలబస్ పెట్టారు. అప్పట్లో మేథ్స్ ప్రశ్నలకు సమాధానాలు రాయకపోయినా పెద్దగా నష్టం ఉండేది కాదని, ఇప్పుడు తప్పనిసరి అయి నష్టపోతామని అంటున్నారు. ఏపీపీఎస్సీ సభ్యుల్లో ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే కావడంతో మేథ్స్ సిలబస్‌ను పెంచేశారని చెబుతున్నారు.

కొత్త సిలబస్ ఎలా చదవాలి?
యూపీఎస్సీలో సిలబస్‌ను మార్చాలంటే కనీసం రెండేళ్ల ముందు ప్రకటన చేస్తారు. కానీ, ఏపీపీఎస్సీ మాత్రం 2016లో సిలబస్‌ను మార్చి వెంటనే మళ్లీ ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సిలబస్‌లో మార్పులు చేయడం గమనార్హం. ఇంత తక్కువ సమయంలో కొత్త సిలబస్‌ను చదవడం ఎలా సాధ్యమని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇప్పటిదాకా రూ.లక్షలు ఖర్చు చేసి, పాత సిలబస్ ప్రకారం కోచింగ్ తీసుకున్నామని, ఇప్పుడు ఒక్కసారిగా సిలబస్‌లో మార్పులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మేథ్స్ నేర్చుకోవడానికి కోచింగ్‌కు వెళితే మెయిన్స్కు సమయం సరిపోదని చెబుతున్నారు.

మెయిన్స్ సిలబస్సూ గుదిబండే..
గ్రూప్-1 మెయిన్స్ సిలబస్‌ను రెండింతలు చేశారు. మెయిన్స్లో చరిత్రకు(హిస్టరీ) సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎథిక్స్, లా కొత్తగా ప్రవేశపెట్టారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మార్పులు చేశారు. ఇవన్నీ తప్పనిసరి చేశారు. వాస్తవానికి యూపీఎస్సీలో ఇలాంటి సబ్జెక్టులు ఆప్షనల్ మాత్రమే. ఎవరికి నచ్చినవి వారు ఎంపిక చేసుకొని పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
Published date : 12 Oct 2018 04:16PM

Photo Stories