Skip to main content

ఇక అన్ని పోస్టులకూ ‘స్క్రీనింగ్’ తప్పనిసరి !

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగ నియామకాలన్నింటికీ స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్ ను తప్పనిసరి చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) భావిస్తోంది.
కొత్త విధానంపై కసరత్తు చేసిన ఏపీపీఎస్సీ ఇందుకు సంబంధించి అనుమతులకోసం ప్రభుత్వానికి ఇటీవల నివేదికను సైతం పంపించింది. ఈ కొత్త విధానానికి ప్రభుత్వం అనుమతిస్తే.. ఇప్పటికే పరీక్షల భారంతో నానా ఇక్కట్లు పడుతున్న నిరుద్యోగులకు ఇది మరింత అశనిపాతమే కానుంది.

గతంలో ఒక్కటే పరీక్ష...
గతంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగ భర్తీ పరీక్షలకు సంబంధించి గ్రూప్-1తోపాటు మరికొన్ని ఎగ్జిక్యూటివ్, తత్సమాన పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో నిర్వహించేవారు. ప్రిలిమ్స్‌లో అర్హత మార్కులు సాధించిన వారికి మెయిన్స్ ను డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు పెట్టేవారు. కిందిస్థాయిలోని గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 కేటగిరీల పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు/ప్రిలిమ్స్‌తో నిమిత్తం లేకుండా నేరుగా ఒక్కటే పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేవారు.

25 వేలమంది కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే స్క్రీనింగ్ టెస్టు :
ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే అన్ని పరీక్షలకూ ఆన్‌లైన్ (కంప్యూటరాధారిత) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో ఆయా పోస్టుల నోటిఫికేషన్లకు అభ్యర్థులు 25 వేలమంది కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తోంది. పోస్టుల సంఖ్యను అనుసరించి 1:50 నిష్పత్తి ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించి.. అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసి మెయిన్స్ ను నిర్వహిస్తోంది. 25వేల మందికన్నా తక్కువగా ఉంటే.. స్క్రీనింగ్ టెస్టుతో నిమిత్తం లేకుండా నేరుగా ఒక్కటే పరీక్ష పెట్టి ఆయా పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తున్నారు. గ్రూప్-1తోపాటు అన్ని కేటగిరీల పోస్టులకూ దరఖాస్తులు 25 వేలు దాటినట్లయితే రెండేసి పరీక్షలను అభ్యర్థులు ఎదుర్కొంటున్నారు. ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టుకు ఒక సిలబస్, మెయిన్స్ కు మరో సిలబస్‌ను ఏపీపీఎస్సీ అమలు చేయడంతో అభ్యర్థులు వాటికి ప్రిపేర్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. ఒకవైపు మెటీరియల్, ప్రామాణిక గ్రంథాలు అందుబాటులో లేకపోవడం, మార్కెట్లో ఉన్న ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి చదవడం, లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో చేరి తర్ఫీదు పొందడం.. ఇలా నానా అవస్థలూ పడుతున్నారు.

ఇకపై అన్ని పోస్టులకూ...
కొన్ని ప్రత్యేక పోస్టులకు దరఖాస్తులు తక్కువగా వస్తే వాటికి ఒక్కటే పరీక్షను ఇప్పటివరకు పెడుతున్నారు. కానీ ఈసారి వాటికీ రెండేసి పరీక్షలు (స్క్రీనింగ్, మెయిన్స్) నిర్వహించేందుకు వీలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. గతంలో 25 వేల మందికి మించితేనే స్క్రీనింగ్ టెస్టు అన్న నిబంధనను తొలగించాలని, పరీక్షలపై పూర్తి అధికారాన్ని ఏపీపీఎస్సీకి ఇవ్వాలని కమిషన్ కోరుతోంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్లో 16 వేల వరకు మాత్రమే దరఖాస్తులు అందాయని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం దీనికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించరాదు. కానీ ఫిబ్రవరి 24న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేందుకు తేదీని కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను కాదని స్క్రీనింగ్ టెస్టు నిర్వహణ సరికాదని పలువురు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థులకు నానా తంటాలు..
గతంలో గ్రూప్-1, ఇతర కొన్ని పోస్టులు మినహా ఇతర పోస్టులకు ఇన్ని అవస్థలు ఉండేవి కావు. ఒక్కటే పరీక్ష ఉండడంతో ప్రిపరేషన్లో అవస్థలు పడేవారు కాదు. కానీ ఈసారి దరఖాస్తులు 25 వేలు దాటితే రెండేసి పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. పోస్టు ఏదైనా సరే దాని భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసే నోటిఫికేషన్లకు 25 వేలకు మించి దరఖాస్తులు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు వీటికోసం ఆశతో దరఖాస్తు చేస్తున్నారు. దీంతో దాదాపు అన్ని పరీక్షలకూ రెండేసి పరీక్షలు రాయాల్సి వస్తోంది.
Published date : 26 Jan 2019 02:35PM

Photo Stories