గ్రూప్-2పరీక్షకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 982 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 1,376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొంతమంది కలసి ఒకేసారి ఆన్‌లైన్ దరఖాస్తు చేయడం వల్ల పక్కపక్కనే హాల్‌టిక్కెట్ల నంబర్లు వచ్చాయని, వారు మాస్‌కాపీయింగ్ చేసే అవకాశముందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నిమిషానికి 200, సెకనుకు 3 చొప్పున దరఖాస్తులు అప్‌లోడ్ అవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి వేల మంది దరఖాస్తు చేస్తుంటారని, అందువల్ల కలసి దరఖాస్తు చేసేవారికి పక్కపక్కనే హాల్‌టికెట్ల నంబర్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ పక్కపక్కనే ఉన్నా కూడా.. వారిలో ఒకరికి వచ్చే ప్రశ్నపత్రం కోడ్ మరొకరికి రాదని చెప్పారు. ఏ, బీ, సీ, డీలుగా నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఓఎమ్మార్ సమాధాన పత్రాల్లో రోల్‌నంబర్, సెట్‌కోడ్‌ను తప్పుగా నమోదు చేస్తే ఆ పత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు 6,57,010 మంది దరఖాస్తు చేశారని, వీరిలో 5 లక్షల మందికి పైగా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. 26న ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. 9.45 తర్వాత అభ్యర్థులను లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే చూసుకుంటే సకాలంలో పరీక్షకు హాజరుకావచ్చని వివరించారు.
సూచనలు :
సూచనలు :
- హాల్‌టికెట్‌పై ఫొటో స్పష్టంగా లేకపోతే అభ్యర్థులు తమతో పాటు మూడు పాస్‌పోర్టు ఫొటోలు వెంట తీసుకువచ్చి ఇన్విజిలేటర్‌కు అందించాలి. డిక్లరేషన్ ఇచ్చి పరీక్షకు హాజరుకావచ్చు.
- హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా మరే గుర్తింపు కార్డునైనా అభ్యర్థులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
- సాధారణ వాచీలు, వస్త్రాలను ధరించి మాత్రమే పరీక్షకు హాజరుకావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
- పరీక్ష హాల్లోకి హాల్‌టికెట్‌తో పాటు బాల్‌పెన్(బ్లూ/బ్లాక్) తీసుకురావచ్చు.
- పెన్సిల్, జెల్‌పెన్నుల ద్వారా ఓఎమ్మార్ షీట్‌పై బబుల్ చేయకూడదు. అలాంటి పత్రాలను మూల్యాంకనానికి నోచుకోవు.
- పరీక్ష ముగిసే వరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు.
- దివ్యాంగులు, గర్భిణులకు ఆయా కేంద్రాల్లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో సీటింగ్ ఏర్పాటు.
- దివ్యాంగులు తమ తరఫున పరీక్ష రాసే అభ్యర్థిని తెచ్చుకోవడంతో పాటు తమ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాన్ని, పరీక్ష రాసే అభ్యర్థి(స్క్రైబ్) గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
- మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే పోలీసు చర్యలతో పాటు తక్షణమే డీబార్ చేస్తారు.
- అన్ని పరీక్షా కేంద్రాల సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఏర్పడితే 040-24603493, 94, 95, 96 నంబర్లను సంప్రదించవచ్చు.
- నమూనా ఓఎమ్మార్ షీట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు ఒకసారి అందులోని సూచనలు, ఇతర అంశాలను ముందుగా పరిశీలించవచ్చు.
Published date : 24 Feb 2017 11:40AM