Skip to main content

గ్రూప్ 2 మెయిన్స్‌ లీకేజీ, మాస్‌కాపీయింగ్ పై ఏపీపీఎస్సీకి ఫిర్యాదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్‌లో ప్రశ్నల లీకేజీ, కొన్నిచోట్ల మాస్ కాపీయింగ్ జరగడం ముమ్మాటికీ నిజమేనని కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈమేరకు జూలై 26న కొంతమంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాత్రింబవళ్లు ఎంతో శ్రమించి వ్యయప్రయాసలకోర్చి గ్రూప్-2 మెయిన్స్‌ను బాగా రాశామని, కానీ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంలోని లోపాల కారణంగా తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూప్-2 మెయిన్స్‌ ప్రశ్నల స్క్రీన్‌షాట్లు, పేపర్‌లోని ప్రశ్నలు ఒక్కటేనని, పేపర్ లీకైందనడానికి స్క్రీన్‌షాట్లే సాక్ష్యమని స్పష్టమవుతోందని, ఇవే అంశాలు పత్రికల్లో చూసి తాము తీవ్ర ఆందోళనలో పడ్డామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో లోపాలకు అనేక తార్కాణాలున్నాయన్నారు.
  1. పరీక్ష హాలులోకి మొబైల్ ఫోన్లను అనుమతించారు.
  2. కొందరు అభ్యర్థులు పరీక్ష హాలులోనే డిస్కస్ చేసుకొని ఒకరి కంప్యూటర్ మోనిటర్‌ను ఇంకొకరు చూస్తూ జవాబులు రాశారు.
  3. ఒకే సమయంలో కొందరు అభ్యర్థులు బాత్‌రూముకి వెళ్లి అక్కడ చర్చించుకొని సమాధానాలు రాశారు.
  4. కొన్ని సెంటర్లలో పరీక్ష ప్రారంభమై 60 నుంచి 70 ప్రశ్నలకు సమాధానాలు రాశాక గంట తరువాత సాఫ్ట్‌వేర్ సమస్య వచ్చి ఆగిపోయింది. మళ్లీ మొదటి నిమిషం నుంచి పరీక్షను ప్రారంభించడం, మొత్తంగా మూడున్నర గంటల సమయం ఇచ్చి రాయించారు. దీనివల్ల గంటకు పైబడి అదనపు సమయం వారికి దొరికింది. దీనివల్ల మిగిలిన వారికి అన్యాయం జరిగింది.
  5. మరోవైపు రెండో రోజు ఉదయం, మధ్యాహ్నం ఏకధాటిగా అయిదారు గంటలపాటు పరీక్ష నిర్వహించడంతో కొందరు అభ్యర్థులు నష్టపోయారు.
  6. పెన్నులు కూడా అనుమతించకుండా ఏపీపీఎస్సీయే పెన్నులు సరఫరా చేసిన పరీక్ష హాలులోకి కెమెరా ఫోన్లు ఎలా వెళ్లాయి? స్క్రీన్‌షాట్లు ఎలా బయటకు వచ్చాయి? ఈ స్క్రీన్‌షాట్లతో వాట్సప్‌ల ద్వారా జవాబులు తెప్పించుకొని కాపీయింగ్ చేయడానికి ఆస్కారమేర్పడింది. మాల్‌ప్రాక్టీస్ మాస్ కాపీయింగ్ జరిగిందనడానికి ఇదే తార్కాణం.
  7. కొన్ని సెంటర్లలో అభ్యర్థులు కూర్చునే ప్లేస్‌లను పరీక్ష నిర్వాహకులు కేటాయించకుండా ఒక గ్రూపు అభ్యర్థులు పక్కపక్క కూర్చొని సమాధానాలు చూసుకొని రాశారు.
  8. విశాఖ గీతం వర్సిటీలో కంప్యూటర్ మొరాయించడంతో 187 మంది పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. సంస్థ తప్పిదం వల్ల విద్యార్థులు నష్టపోవడం ఎంతవరకు న్యాయం? 120 మంది విద్యార్థులు పరీక్ష సమయం ముగిసి ప్రశ్నలు బయటకు వచ్చాక పరీక్ష ఎలా రాస్తారు? ఎలా రాయించారు?
  9. సెంటర్లుగా ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు కుమ్మైక్కై మాల్‌ప్రాక్టీస్ చేయించినట్లు సమాచారం ఉంది. పి.కొత్తకోట, వేటపాలెం, విశాఖపట్నం, హయత్‌నగర్ (హైదరాబాద్) సెంటర్లలో ఇలా జరిగినట్లు అభ్యర్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటికి స్పష్టమైన ఆధారాలు ఇవ్వాలని కమిషన్ కోరడం విచిత్రంగా ఉందని, పరీక్ష రాస్తున్న ఇతర విద్యార్థులు వీటికి ఎలా ఆధారాలు చూపిస్తారని అభ్యర్థులు కమిషన్ ఛైర్మన్‌ను ప్రశ్నించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించకుండా అభ్యర్థులను ఆధారాలు అడగడం అన్యాయమన్నారు. ఈ విషయంలో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎంతో కష్టపడి పరీక్ష రాసిన ఇతర అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
Published date : 27 Jul 2017 05:48PM

Photo Stories