Skip to main content

గ్రూప్-1లోకి గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ?

సాక్షి, అమరావతి: గ్రూప్ -2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తుండటం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
ఇది తమకు తీరని నష్టం కలిగిస్తుందని గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన క్యాలెండర్‌ను అమలు చేయలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -2 పోస్టుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

విలీనంతో ఆబ్జెక్టివ్ స్థానంలో డిస్క్రిప్టివ్ :
గ్రూప్- 2లో ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆబ్జెక్టివ్ తరహాలో మూడు పేపర్లలో 450 మార్కులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. 2016 నుంచి గ్రూప్- 2 పోస్టులకు ఆన్‌లైన్ విధానంతోపాటు ముందు 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గ్రూప్- 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపితే ఇప్పటివరకు ఉన్న ఆబ్జెక్టివ్ తరహా పరీక్షకు బదులుగా గ్రూప్-1 పద్ధతిలో డిస్క్రిప్టివ్ తరహాలో వ్యాసరూప పరీక్షలు రాయాలి. ఆబ్జెక్టివ్ విధానంలో సన్నద్ధమవుతున్న తమకు ఇది తీవ్ర ప్రతిబంధకంగా మారుతుందని గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్-1లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న వారికే దీనివల్ల ప్రయోజనమని, ఇది కేవలం ఆ తరహా కోచింగ్ సెంటర్లకు మేలు చేయడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్నాళ్ల శిక్షణ అంతా వృథాయేనా ?
గ్రూప్- 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పు చేస్తే అభ్యర్థులు గ్రూప్-1 తరహాలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1లో మూడు దశల్లో పరీక్షలు రాయాలి. తొలుత ప్రిలిమ్స్ (150 మార్కులకు స్క్రీనింగ్ టెస్టు) ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్‌లైన్లో రాయాలి. ఇక మెయిన్‌‌స పరీక్ష ఆరు పేపర్లతో (ఒక్కో పేపర్ 150 మార్కులకు) డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫై పేపర్ కాగా తక్కిన ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ను నిర్ణయిస్తారు. తరువాత 75 మార్కులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

అధికారి, ఉద్యోగుల సంబంధాలపై ప్రభావం...
గ్రూప్- 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లోకి మార్పు చేయడం వల్ల సుపీరియర్, సబార్డినేట్ రిలేషన్‌షిప్ దెబ్బ తింటుందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఉన్నత పోస్టుకు, కింది పోస్టుకు ఒకే పరీక్ష ద్వారా ఎంపికలు చేస్తే విధి నిర్వహణలో ఉద్యోగుల సంబంధాలు సరిగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అభ్యర్థుల ఆందోళనతో గతంలో వెనక్కి :
2012లో ఉమ్మడి రాష్ట్ర హయాంలో అప్పటి ప్రభుత్వం గ్రూప్- 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ -1బీలోకి మారుస్తూ జీవో 622 విడుదల చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావటంతో జీవోల అమలును నిలుపుదల చేసి పాత పద్ధతిలోనే భర్తీని చేపట్టింది. తరువాత 2016లో టీడీపీ ప్రభుత్వం 110 జీవో ద్వారా గ్రూప్ -2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లోకి మార్పు చేయాలని ప్రయత్నించటంపై మళ్లీ వివాదం రేగింది. దీంతో యధాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మినహా ఇతర కేడర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరాదని కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఒక విధానాన్ని ప్రకటించడంతో అందుకు అనుగుణంగా పరీక్షల ప్యాట్రన్‌ను నిర్దేశిస్తూ జీవో 141 విడుదల చేశారు. గ్రూప్-2తో సహా ఇతర ఎగ్జిక్యూటివ్ పోస్టులకు, నిర్దిష్టంగా ప్రత్యేకించిన మరికొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షలు జరిపి ఇంటర్వ్యూలను కూడా నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి భర్తీ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి తేవటం నిరుద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది.

గ్రూప్-1 బీలోకి ప్రతిపాదిస్తున్న పోస్టులు:
  1. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 (మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సబ్ సర్వీస్)
  2. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (కమర్షియల్ టాక్స్ సబ్ సర్వీస్)
  3. డిప్యూటీ తహసీల్దార్ (ఏపీ రెవెన్యూ సబ్ సర్వీస్)
  4. సబ్ రిజిస్టార్ గ్రేడ్ -2 (ఏపీ రిజిస్ట్రేషన్ సబ్‌సర్వీస్)
  5. జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ (ఏపీ ఎంప్లాయిమెంటు సబ్‌సర్వీస్)
  6. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏపీ కోపరేటివ్ సబ్ సర్వీస్)
  7. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏపీ లేబర్ సబ్‌సర్వీస్)
  8. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్-రూరల్ డెవలప్‌మెంట్ (పంచాయతీరాజ్ సబ్‌సర్వీస్)
  9. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎక్సైజ్ సబ్ సర్వీస్)
  10. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-2 (పంచాయతీరాజ్ సబ్ సర్వీస్)
Published date : 11 Jun 2018 04:10PM

Photo Stories