గ్రూప్-1, 2 దరఖాస్తు గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్-1, గ్రూప్-2 కేటగిరీ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది.
ఈ నోటిఫికేషన్లలోని యూనిఫారం పోస్టులకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు సమర్పణ గడువును కూడా పొడిగించినట్లు ఏపీపీఎస్సీ జనవరి 24న ఒక ప్రకటనలో తెలిపింది. ఆ మేరకు గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది. ఈ పరీక్షల ఫీజు చెల్లింపును అభ్యర్థులు ఫిబ్రవరి 9 అర్ధరాత్రిలోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక గ్రూప్-1 పోస్టుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది. ఈ పరీక్షల ఫీజును ఫిబ్రవరి 6 అర్ధరాత్రిలోగా చెల్లించాలి. గ్రూప్-2 కేటగిరీలోని ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు గతంలో 18 నుంచి 28 ఏళ్లలోపు వారే అర్హులు కాగా.. తాజాగా రెండేళ్లు పొడిగించారు. ఆ మేరకు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇక గ్రూప్-1లోని డీఎస్పీ పోస్టులకు గతంలో 21 నుంచి 28 ఏళ్లలోపు వారికి మాత్రమే అర్హత ఉండగా.. దాన్ని 30 ఏళ్లుగా చేశారు. జైళ్లశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు గతంలో 18 నుంచి 28 ఏళ్ల వయసును పేర్కొనగా ఈసారి 18 నుంచి 30 ఏళ్లుగా చేశారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పోస్టులకు గతంలో 21 నుంచి 26 ఏళ్లలోపు వారికి అర్హతని పేర్కొనగా.. దాన్నిప్పుడు 21 నుంచి 28 ఏళ్లుగా చేశారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు గతంలో 18 నుంచి 26 ఏళ్లుగా పొందుపరిచారు. దీన్ని 18 నుంచి 28 ఏళ్లుగా మార్చారు.
Published date : 25 Jan 2019 11:42AM