ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీలో ఒక్కొక్కరికి రెండేసి పోస్టులు!
Sakshi Education
సాక్షి, అమరావతి: అసలే ప్రభుత్వ కొలువులు లభించడం గగనంగా మారిన తరుణంలో ఒక్కొక్కరికి రెండేసి పోస్టులు వస్తే... ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చేపట్టిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీలో ఇదే పరిస్థితి నెలకొంది. వేర్వేరుగా ఇచ్చిన ఈ రెండు నోటిఫికేషన్లలో పరీక్షలకు దరఖాస్తు చేసి, ఎంపికైన వారు రెండింటిలోనూ ఉండడం విశేషం. దీంతో వీరి ఎంపిక విషయంలో ఏపీపీఎస్సీ తర్జన భర్జన పడుతోంది. రెండింటికీ ఎంపిక చేస్తే ఏదో ఒకదానిలోనే ఆ అభ్యర్థి చేరి ఇంకో పోస్టు ఖాళీగా ఉండిపోతుంది. ఇలా పలు పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఎదురవుతోంది.
ఈనెల 17న ఏపీపీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చించారు. అసలే ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా పోస్టులు భర్తీకాకుండా మిగిలిపోవడం సరికాదన్న అభిప్రాయాన్ని కమిషన్ సభ్యులు వ్యక్తపరిచారు. మెరిట్‌లిస్టులో ఉన్న మిగతా వారికి అవకాశం కల్పించేందుకు వీలుగా కమిషన్ స్థాయిలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. 748 ఏఈఈ పోస్టులకు, 199 ఏఈ పోస్టులకు ఏపీపీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసి పరీక్షలు కూడా పూర్తిచేసింది. ఇటీవల ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో కొందరు అభ్యర్ధులు అటు ఏఈఈ, ఇటు ఏఈ పోస్టులకూ అర్హత సాధించారు. ప్రస్తుతం వీరి ధ్రువపత్రాల పరిశీలన చేసి పోస్టులకు ఎంపిక చేయాల్సి ఉంది. పోస్టులు మిగిలిపోకుండా ఉండేందుకు రెండు పోస్టులకు ఎంపికైన వారిని ఏదో ఒక్క పోస్టుకే ఆప్షన్ ఇచ్చేలా వారి నుంచి ధ్రువపత్రాలను తీసుకోవాలని భావిస్తున్నారు. తద్వారా రెండు పోస్టులకు ఎంపికైన వారు ఏదో ఒక పోస్టుకే వెళితే రెండో పోస్టుకు మెరిట్‌లిస్టులో ఉన్న ఇతర అభ్యర్దులకు అవకాశం కల్పించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. ఈ పోస్టులకు అర్హత సాధించిన వారికి ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తున్నారు. ఏఈఈ పోస్టులకు అర్హత సాధించిన 1,496 మందికి ఈనెల 26వ తేదీ నుంచి మే 16 వరకు మెరిట్ జాబితాను అనుసరించి అభ్యర్ధుల వారీగా ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. అర్హత ధ్రువపత్రాలన్నీ సరిగ్గా ఉన్న 748 మంది ఎంపిక కాగానే ధ్రువపత్రాల పరిశీలన నిలిపివేయనున్నారు. ఏఈ పోస్టుల ధ్రువపత్రాల షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
Published date : 18 Apr 2017 04:12PM