Skip to main content

748 ఏఈఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేసింది.
వివిధ విభాగాల్లోని 748 ఇంజనీరింగ్ సర్వీస్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక ప్రక్రియను ఆన్‌లైన్ లో చేపట్టనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ' www.psc.ap.gov.in ' లో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు, దరఖాస్తులకు గడువు సెప్టెంబర్ 21. గడువు చివరి రోజు రాత్రి 11.59 నిమిషాల వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ముందుగా తమ బయోడేటా, ఇతర సమాచారాన్ని ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(ఓటీపీఆర్) ద్వారా అధికారిక వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలి. అనంతరం అభ్యర్థుల మొబైల్ నంబరు, ఈ మెయిల్‌కు యూజర్ ఐడీ అందుతుంది. ఈ యూజర్ ఐడీ ద్వారా ఆయా పోస్టులకు కమిషన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష నవంబర్ 3-5 తేదీల మధ్య జరిగే అవకాశముంది. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారు ఈ పోస్టులకు అర్హులు. పోస్టులు, ప్రభుత్వ సడలింపులు అనుసరించి వయోపరిమితిలో మార్పులున్నాయి. ఆయా పోస్టులకు అర్హతలు, సిలబస్ తదితరాలను నోటిఫికేషన్లో సవివరంగా పొందుపరిచారు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, తెల్లకార్డు ఉన్న ఏపీ అభ్యర్థులు, 18-40 ఏళ్లలోపు వయసున్న నిరుద్యోగులకు రూ.120 పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు (దివ్యాంగులు, మాజీ సైనికులు మినహా) ఈ మినహాయింపు వర్తించదు. ఫీజులను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, లేదా ఏపీ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

పరీక్ష విధానంపై అవగాహనకు మాక్ టెస్టులు :
ఈ పోస్టులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.ఈ విధానంపై అభ్యర్థులు అవగాహన, తర్ఫీదు పొందేందుకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ మెయిన్ పేజీలో ‘మాక్ టెస్టు’లను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని రాయడం ద్వారా అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష విధానంపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన విధివిధానాలు నోటిఫికేషన్లో పొందుపర్చారు.

నాలుగు జోన్లే..:
ఈ పోస్టులకు వయోపరిమితి 18-34 ఏళ్లు కాగా ప్రభుత్వం ఆరేళ్లు పెంచడంతో 40 ఏళ్ల లోపు వారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ, ఎన్‌సీసీ, మాజీ సైనికుల తదితర కేటగిరీల వారీ వయోపరిమితి మినహాయింపులను నోటిఫికేషన్లో పొందుపర్చారు. స్థానిక కోటాకు సంబంధించి అభ్యర్థులు నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ, ఎస్సెస్సీ ధ్రువపత్రాలు పొందుపర్చాలి. స్కూలులో చదవని అభ్యర్థులు సంబంధిత అధికారి ఇచ్చిన సర్టిఫికెట్లు సమర్పించాలి. రాష్ట్ర విభజన జరిగినందున 13 జిల్లాల ఏపీని నాలుగు జోన్లుగా పేర్కొన్నారు. ఒకటో జోన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రెండులో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మూడులో గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, నాలుగో జోన్లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలను చేర్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలను ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఏర్పాటుచేయనున్నారు. అభ్యర్థులు ప్రాధాన్యతలు అనుసరించి మూడు కేంద్రాలను ఎంపికచేసుకోవచ్చు. కేంద్రాల కేటాయింపు అధికారం కమిషన్‌దే.

పోస్టుల సంఖ్య వివరాలు:
ఏఈఈ (సివిల్) పీహెచ్ అండ్ ఎంఈ శాఖ 56
ఏఈఈ (సివిల్/ మెకానిక్) గిరిజన సంక్షేమశాఖ 41
ఏఈఈ (సివిల్) జలవనరుల శాఖ 473
ఏఈఈ (మెకానిక్) జలవనరుల శాఖ 63
ఏఈఈ (సివిల్/ మెకానిక్) పంచాయతీరాజ్ 113
ఏఈఈ (మెకానిక్/అగ్రి) భూగర్భ జలవనరుల శాఖ 02

మొత్తం

748

Published date : 19 Aug 2016 11:18AM

Photo Stories