Skip to main content

1999 గ్రూప్-2 నుంచి 240 పోస్టుల తొలగింపు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గతంలో జారీచేసిన 1999 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి తాజా మెరిట్ జాబితాను రెండు వారాల్లో విడుదల చేయనున్నారు.
ఈమేరకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. 1999 గ్రూప్-2 పోస్టుల భర్తీ వ్యవహారం న్యాయ వివాదాల్లో చిక్కుకొని దాదాపు 16 ఏళ్లపాటు విచారణ కొనసాగి చివరకు కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు కొత్త మెరిట్ జాబితాను రూపొందించాలని ఏపీపీఎస్సీని ఆదేశించిన సంగతి తెలిసిందే. జాబితా రూప కల్పనలో ఏపీపీఎస్సీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇప్పటికే 2సార్లు విడుదల చేసిన జాబితాల్లో తప్పులు దొర్లడం, అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో అన్నిటినీ సరిచేసి కొద్దిరోజుల క్రితం జాబితాను ప్రకటించింది. ఆయా అభ్యర్థుల నుంచి విల్లింగ్, రిలింక్విష్‌మెంటు(వదులుకోవడం) లేఖలు కోరింది. రిలింక్విష్ మెంటు లేఖల సంఖ్య మేరకు మెరిట్ జాబితాలోని ఇతర అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. 52 మంది నుంచి రిలింక్విష్‌మెంటు లేఖలు అందాయి.

‘క్యారీ ఫార్వర్డ్’తో కొత్త చిక్కులు..
అయితే గతంలో ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగానికి అర్హత సాధించి జాయిన్ కాని వారు, జాయినయ్యి ఆ తర్వాత ఇతర పోస్టుల్లోకి వెళ్లిపోయిన వారికి సంబంధించిన దాదాపు 240 పోస్టులను గతంలోనే అధికారులు ‘క్యారీ ఫార్వర్డ్’ కింద కొత్త నోటిఫికేషన్లలో కలిపి భర్తీచేశారు. ఇప్పుడా పోస్టులు లేనందున వాటిని తాజాగా జాబితా నుంచి ఏపీపీఎస్సీ అధికారులు తొలగించనున్నారు. వాస్తవానికి గతంలో రీలింక్విష్‌మెంటు లేఖలు తీసుకున్నాకనే ఆయా పోస్టులను క్వారీ ఫార్వర్డ్ చేయాలి. కానీ అలా చేయకుండానే అప్పటి అధికారులు కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసేశారు. ఇప్పుడా పోస్టులు లేనందున వాటిని తొలగించడంతో పాటు అప్పట్లో జాయిన్ కాని, వేరే పోస్టుల్లోకి వెళ్లిపోయిన వారి పేర్లను కూడా తాజా జాబితా నుంచి తొలగించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావచ్చిందని, 2 వారాల్లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. మొత్తం ఎంతమంది కొత్త వారికి ఉద్యోగాలు వస్తాయి? ఎంతమంది పాతవారుంటారు? ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య ఎంతన్నది తుది జాబితా అనంతరమే తేలుతుందన్నారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి సంబంధించి సూపర్‌న్యూమరరీ పోస్టుల కల్పన అంశాన్ని ఫలితాల విడుదల అనంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.

ఏఈఈ, ఏఈ పోస్టుల ఫలితాలు మార్చిలో..
గతంలో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన ఫలితా లను మార్చి తొలిపక్షంలో విడుదల చేసే అవకాశముందని చైర్మన్ చెప్పారు. ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా ఏటా క్యాలెండర్ ప్రకారం పోస్టుల భర్తీకి చర్యలు చేపడు తున్నామన్నారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు.

గ్రూప్-2 నోటిఫికేషన్‌లో తప్పుల సవరణకు అవకాశం:
తాజాగా విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌కు సంబంధించి కొందరు అభ్యర్థులకు కులం, స్థానికత విషయంలో తప్పులు దొర్లాయని, వీటిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని చైర్మన్ అన్నారు. ప్రిలిమ్స్ అనంతరం తప్పులను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు.
Published date : 24 Feb 2017 02:08PM

Photo Stories