ఆర్థ్ధిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి
ఆర్థికాభివృద్ధి కొలమానాలు
ఒక దేశ ఆర్థికాభివృద్ధిని గణించడానికి కింది కొలమానాలను ఉపయోగించవచ్చు.
1. వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల
2. వాస్తవిక తలసరి ఆదాయంలో వృద్ధి
3. ప్రజల శ్రేయస్సు పెరుగుదల
4. కనీస అవసరాల దృక్పథం
5. మానవాభివృద్ధి సూచీ
1970కి ముందు దీర్ఘకాలంలో వాస్తవిక జాతీయోత్పత్తిలో పెరుగుదలను ఆర్థికాభివృద్ధిగా భావించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉత్పత్తిలో పెరుగుదల సాధించడానికి భారీ పారిశ్రామికీకరణ వ్యూహాన్ని అవలంభించాలి. ఇది ఆయా దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యానికి గురి చేస్తోంది.
వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల అనేది ఆర్థికాభివృద్ధికి మరో సంప్రదాయిక కొలమానం. దీర్ఘ కాలంపాటు తలసరి ఆదాయ వృద్ధి రేటు అధికంగా ఉన్నప్పుడు జీవన ప్రమాణం, ఆర్థిక లక్ష్యాలను సాధించే సామర్థ్యం ఎక్కువగా ఉందని భావిస్తాం. ధరల స్థాయిలో పెరుగుదల కంటే ఉత్పత్తి పెంపు సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదల ఏర్పడుతుంది.
ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ‘ప్రజల ఆర్థిక శ్రేయస్సులో మెరుగుదల’ కూడా సంప్రదాయికమైందే. అంతకుముందు కాలంతో పోల్చినప్పుడు దేశంలోని ప్రజలు ఉత్పత్తులు, సేవలను ఎక్కువగా వినియోగించుకోగలిగినప్పుడు ప్రజల ఆర్థిక శ్రేయస్సు మెరుగైందని భావించవచ్చు. ఉత్పత్తుల పెరుగుదల కారణంగా ఆదాయ, సంపద పంపిణీలో సమానత్వం సాధ్యంకాకపోవచ్చు. వినియోగ వ్యయంలోనూ వివిధ వర్గాల ప్రజల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండవచ్చు. భారత్‌లో వివిధ కాలాల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అంచనాల ప్రకారం మొదటి 20 శాతం కుటుంబాల వినియోగ వ్యయం మొత్తం వినియోగ వ్యయంలో 40 శాతానికి పైగా ఉంది. చివరి 20 శాతం కుటుంబాల తలసరి వినియోగ వ్యయం మొత్తం వినియోగ వ్యయంలో 8 నుంచి 9 శాతంగా ఉంది.
కనీస అవసరాల దృక్పథం (ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆప్రోచ్) ఆధారంగా దేశంలో ఆర్థికాభివృద్ధిని గణించడానికి మూడు సూచీలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి.. ఆయుఃప్రమాణం, శిశుమరణాల రేటు, అక్షరాస్యత. ఇందులో భద్రత, న్యాయం, మానవ హక్కులు లాంటి జీవన నాణ్యతను నిర్ణయించే అంశాలను తీసుకోవడం లేదు కాబట్టి ఆర్థికాభివృద్ధికి ఇది కచ్చితమైన కొలమానంగా భావించలేమని విమర్శకుల అభిప్రాయం.
ఆధునిక ఆర్థికవేత్తల అభిప్రాయం
ఆధునిక ఆర్థికవేత్తలకు స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం లాంటి సూచీల సహాయంతో ఆర్థిక ప్రగతిని కొలిచే విధానం సంతృప్తి కలిగించదు. వారి అభిప్రాయంలో వృద్ధిరేటు ఎంత? అని కాకుండా ఏవిధమైన వృద్ధి? అనేది ముఖ్యం. ఈ నేపథ్యంలో మానవాభివృద్ధి సూచీని రూపొందించారు. దీంతోపాటు యూఎన్‌డీపీ కాలానుగుణంగా అనేక సూచీలను ప్రవేశపెట్టింది.
ఆర్థికాభివృద్ధి గణనకు ఆధునిక ఆర్థికవేత్తలు తలసరి వాస్తవిక జీడీపీతో పాటు కింద పేర్కొన్న సూచీలను కూడా ఉపయోగించారు.
- జీడీపీలో వ్యవసాయ రంగం వాటా అధికంగా ఉంటే ఆ దేశం ఆర్థికవ్యవస్థ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో వెనుకబడి ఉందని భావించవచ్చు.
- తలసరి విద్యుత్ వినియోగాన్ని ఆర్థికాభివృద్ధికి సూచీగా భావించవచ్చు. తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో పారిశ్రామిక వృద్ధి అధికంగా ఉండటంతో పాటు జీడీపీ వృద్ధిలో పెరుగుదల ఏర్పడుతుంది. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటే తయారీ రంగంలో వృద్ధి అధికమై ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తయారీరంగానికి ఉపాధి సామర్థ్యం అధికంగా ఉంది.
- ప్రజలు వినియోగించే ఆహారంలో పిండి పదార్థాల కేలరీల శాతం అధికంగా ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను వెనుకబడిన వ్యవస్థగా భావించవచ్చు.
- ప్రాథమిక, సెకండరీ విద్యలో డ్రాపవుట్ రేటు తక్కువగా ఉండటంతో పాటు పట్టణీకరణ, ఆయుః ప్రమాణం పెరిగిన దేశంలో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతమైంది.
- శిశు మరణాల రేటు, జనసాంద్రత అధికంగా ఉండే పరిస్థితులు ఆర్థికాభివృద్ధికి ప్రతిబంధకంగా ఉంటాయి.
భారత్ నామినల్ జీడీపీలో ప్రపంచంలో ఏడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా, పీపీపీ పరంగా మూడో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2001 తర్వాత సేవారంగంలో 9 శాతం వృద్ధి నమోదవుతోంది. ప్రైవేట్ రంగంలో ఐటీ రంగం అధిక ఉపాధి అవకాశాలు కల్పించింది. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ ఇతర రంగాల వాటా పెరుగుతోంది. దీని ఆధారంగా భారత్‌లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ వేగవంతమైందని చెప్పవచ్చు. మనదేశానికి యూరోపియన్ యూనియన్, అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, సింగపూర్ ఎగుమతుల మార్కెట్‌గా ఉన్నాయి. 2015లో ఐ.ఎం.ఎఫ్. అంచనాల ప్రకారం రాబడులు 420 బిలియన్ డాలర్లు, వ్యయం 570 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2015 సెప్టెంబర్ 25 నాటికి దేశంలో మొత్తం 349.97 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలున్నాయి. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అభిప్రాయంలో ఫిబ్రవరి 2015లో మార్కెట్ కాపిటలైజేషన్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలో 11వ స్థానాన్ని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 12వ స్థానాన్ని పొందాయి.
జీవన ప్రమాణం అంచనాలో సమస్యలు
- కొనుగోలు శక్తి సామ్యం: వివిధ దేశాల ప్రజల మధ్య జీవన ప్రమాణాన్ని పోల్చడానికి భిన్నమైన కొనుగోలు శక్తి సామ్యాలను తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి స్థానికంగా దేశంలోని కొనుగోలు శక్తిని స్పష్టపరచదు. ఉదాహరణకు నమీబియాలో తలసరి ఆదాయం చాలా తక్కువ. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు నమీబియాలో జీవన వ్యయాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. 2014లో నమీబియా తలసరి స్థూల దేశీయోత్పత్తి 8200 డాలర్లు. ఈ మొత్తాన్ని అమెరికాతో పోల్చినప్పుడు ఒక వ్యక్తి నమీబియాలోనే అధిక వస్తువులు, సేవలను వినియోగించుకోగలుగుతాడు. ఈ క్రమంలో వివిధ దేశాల ప్రజల జీవన వ్యయాన్ని అంచనా వేయడానికి తలసరి జీడీపీని కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా అంచనా వేయాలి.
- ఆర్థిక కార్యకలాపాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోకపోవడం: కొన్ని దేశాల్లో బ్లాక్ మార్కెట్ స్థాయి హెచ్చుగా ఉంటుంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాలను అధికార గణాంకాల్లోకి తీసుకోకపోవచ్చు. నమీబియా లాంటి దేశంలో జీవనాధార వ్యవసాయానికి ప్రాధాన్యం ఉంది. ఈ దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా సుమారు 5 శాతం. వ్యవసాయం ఎక్కువగా జీవనాధారం కావడం వల్ల దీని ఉత్పత్తికి సంబంధించి కచ్చితమైన గణాంకాలు లభించవు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ రంగం అంచనాలు కచ్చితంగా లేకపోవడం వల్ల జీడీపీ అల్ప అంచనాకు గురవుతుంది. దీని ఆధారంగా తలసరి ఆదాయం, ప్రజల జీవన ప్రమాణాన్ని కచ్చితంగా అంచనా వేయలేం.
- వృద్ధికి సంబంధించిన బహిర్గతాలు: అధిక జీడీపీ అధిక జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. కానీ అధిక వృద్ధి కారణంగా కాలుష్యం, అధిక రద్దీ లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ స్థితి జీవన ప్రమాణం తగ్గుదలకు (కాలుష్యం కారణంగా ఆరోగ్య క్షీణత, రద్దీ కారణంగా కాలం వృథా) దారితీస్తుంది. ఉదాహరణకు చైనాలో అధిక వృద్ధితో పాటు కాలుష్యం, రద్దీ లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
- పనిగంటలు: రెండు దేశాలు ఒకే విధమైన జీడీపీని కలిగి ఉండవచ్చు. కానీ ఒక దేశంలో వారంలో సగటు పని గంటలు 60గా, మరో దేశంలో 40గా ఉన్నప్పుడు అధిక సగటు పని గంటలు ఉన్న దేశంలో జీవన ప్రమాణం తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.
- పేదరికం: సమాజంలో ఆదాయం, వ్యయం ఏవిధంగా పంపిణీ జరిగిందో తెలుసుకోవాలంటే జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో అధిక తలసరి జీడీపీ నమోదైనప్పటికీ మరో వైపు పేదరికం ఎక్కువగా ఉండవచ్చు.
- మానవాభివృద్ధి సూచీ: జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి మానవాభివృద్ధి సూచీ ఉపకరిస్తుంది. ఆయుః ప్రమాణం, విద్య, తలసరి ఆదాయం(పీపీపీ) సూచీలుగా మానవాభివృద్ధి సూచీ రూపొందిస్తారు. ఆర్థిక వ్యవస్థల్లో తలసరి ఆదాయం పెరుగుదలకు అక్షరాస్యతకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అక్షరాస్యత అధికమైతే పనిలో పాలుపంచుకునే రేటు పెరగడం వల్ల వనరుల అభిలషణీయ వినియోగం.. తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణంలో పెరుగుదల సంభవిస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. ఒక దేశంలో ఉపాధి కల్పనకు సరిపోయినంతగా ఉత్పాదక సామర్థ్యం లేనప్పుడు ఏర్పడే నిరుద్యోగాన్ని ఏమంటారు?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగం
బి) చక్రీయ నిరుద్యోగం
సి) రుతు సంబంధ నిరుద్యోగం
డి) నిర్మాణాత్మక నిరుద్యోగం
- View Answer
- సమాధానం: డి
2. జాతీయాదాయ గణనలో కిందివాటిలో ఏది భాగం కాదు?
ఎ) భూమి అమ్మకం
బి) సంస్థ అమ్మకాలు
సి) ఉద్యోగుల వేతనాలు
డి) తయారీ రంగం ఎగుమతులు
- View Answer
- సమాధానం: ఎ
3. దేశంలో ద్రవ్య సప్లయ్‌ని నియంత్రించేది?
ఎ) కేంద్ర ప్రభుత్వం
బి) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) నీతి ఆయోగ్
డి) ప్రణాళిక సంఘం
- View Answer
- సమాధానం: బి
4. ఐ.ఎం.ఎఫ్. అంచనా ప్రకారం 2015లో భారత్ రాబడులు?(బిలియన్ డాలర్లలో)
ఎ) 410
బి) 420
సి) 430
డి) 440
- View Answer
- సమాధానం: బి
5. 2015 సెప్టెంబర్ 25 నాటికి భారత విదేశీమారక నిల్వల మొత్తం ఎంత? (బిలియన్ డాలర్లలో)
ఎ) 315
బి) 325
సి) 349
డి) 395
- View Answer
- సమాధానం: సి
6. ఫిబ్రవరి 2015లో మార్కెట్ క్యాపిటలైజేషన్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా స్థానం ఎంత?
ఎ) 12
బి) 15
సి) 20
డి) 25
- View Answer
- సమాధానం: ఎ