Skip to main content

రాజకీయ పార్టీలు

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి, దాన్ని నడిపేవి రాజకీయ పార్టీలే. సరైన దారిలో నడవనప్పుడు ప్రభుత్వాలను కూల్చేయడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఎడ్మండ్ బర్క్ వీటిని ప్రజాస్వామ్యానికి ప్రాణంగా పేర్కొన్నారు. సమర్థమైన, జాతీయ భావం ఉన్న రాజకీయ పార్టీలపైనే ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉంటుంది.
రాజకీయ పార్టీలు 17వ శతాబ్దంలో బ్రిటన్‌లో ఆవిర్భవించాయి. ఆ తర్వాత ఇవి క్రమంగా ఇతర దేశాలకు విస్తరించాయి. ఇటీవల ప్రజాస్వామ్యంలో వీటి ప్రాముఖ్యం బాగా పెరిగింది. రాజకీయ పార్టీల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘స్టాషియోలజీ’ అంటారు.
ప్రపంచంలో ప్రస్తుతం మూడు రకాల పార్టీ వ్యవస్థలు కనిపిస్తాయి. అవి:
1. ఏక పార్టీ విధానం: కమ్యూనిస్టు దేశాల్లో ఈ విధానం ఉంది.
2. ద్వి పార్టీ విధానం: బ్రిటన్, అమెరికా దేశాల్లో ఈ విధానం ఉంది.
3. బహుళ పార్టీ (మల్టీ పార్టీ) విధానం: భారత్, ఫ్రాన్స్ లో ఈ విధానం ఉంది.
మనదేశంలో రాజకీయ పార్టీలు రాజ్యాంగేతర సంస్థలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 19(1)(సి) ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. దీని ఆధారంగా రాజకీయ పార్టీలను స్థాపించుకోవచ్చు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్‌లో చేర్చిన ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’లో రాజకీయ పార్టీల గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ 102, 191లలో వీటి గురించి వివరించారు.
భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు సుమారు 10 పార్టీలు ఉండేవి. ప్రస్తుతం దాదాపుగా 1750 పార్టీలున్నాయి. కులం, మతం, భాష, ప్రాంతీయ ప్రాతిపదికన పార్టీలను స్థాపించడంతో వీటి సంఖ్య బాగా పెరుగుతోంది. 1978లో కుల ప్రాతిపదికన బహుజన సమాజ్ పార్టీ ఏర్పడింది. మత ప్రాతిపదికన ఎంఐఎం, అకాలీదళ్, శివసేన; భాషా ప్రాతిపదికన డీఎంకే, తెలుగుదేశం పార్టీలను ఏర్పాటు చేశారు. ప్రాంతీయ ప్రాతిపదికన టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రజాసమితి పార్టీలు ఏర్పడ్డాయి.
పార్టీల్లో చీలికలు ఏర్పడి కొత్త పార్టీలు ఆవిర్భవించడం వల్ల కూడా వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉదాహరణకు.. కాంగ్రెస్ చీలిపోయి కాంగ్రెస్ (ఓ), జాతీయ తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించాయి. జనతాదళ్‌లో చీలిక ఏర్పడి లోక్ జనశక్తి, జనతాదళ్ సెక్యులర్; తెలుగుదేశం పార్టీ చీలిపోయి ఎన్టీఆర్ తెలుగుదేశం (లక్ష్మీ పార్వతి), ఆ తర్వాత నవ తెలంగాణ ఏర్పాటయ్యాయి. సీపీఐ చీలిపోయి సీపీఐ(ఎం) ఏర్పాటు కాగా, సీపీఐ(ఎం) నుంచి సీపీఐ(ఎంఎల్) ఆవిర్భవించింది.
ఉనికి ఆధారంగా పార్టీలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి: 1) జాతీయ పార్టీలు
2) ప్రాంతీయ పార్టీలు

జాతీయ పార్టీలు
2014 ఎన్నికల నాటికి ఆరు జాతీయ పార్టీలు ఉండేవి. అవి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఐ(ఎం), ఎన్సీపీ. ఎన్నికల తర్వాత సీపీఐ, బీఎస్పీ, ఎన్సీపీ జాతీయ హోదాను కోల్పోయాయి.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
  • నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి చెల్లిన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు పొందాలి. కనీసం 4 సీట్లు గెలుపొందాలి. (లేదా)
  • లోక్‌సభ సీట్లలో 2 శాతం స్థానాలు గెల్చుకోవాలి. (లేదా)
  • కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
ప్రాంతీయ పార్టీలు
2014 ఎన్నికల సమయంలో 47 ప్రాంతీయ పార్టీలున్నాయి.
ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే..
  • విధానసభ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి, రెండు సీట్లను గెలుపొందాలి. (లేదా)
  • లోక్‌సభ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించి, కనీసం ఒక సీటు గెలుచుకోవాలి.
ముఖ్యమైన రాజకీయ పార్టీలు
కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీని 1885 డిసెంబర్ 28న ఎ.ఒ. హ్యూమ్ స్థాపించారు. డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలో మొదటి సమావేశం జరిగింది. ఈ పార్టీ నాయకత్వంలోనే భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది.
స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని నాటి పార్టీ అధ్యక్షుడైన జె.బి. కృపలానికి మహాత్మా గాంధీ సలహా ఇచ్చారు. కానీ రద్దు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 1952-77, 1980-89, 1991-96, 2004-14 వరకు సుమారు 50 ఏళ్లు అధికారంలో ఉంది. 1984 ఎన్నికల్లో అత్యధికంగా 416 సీట్లు గెలుపొందింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువగా 44 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ 1969లో మొదటిసారిగా చీలిపోయి వ్యవస్థాపిత కాంగ్రెస్, 1978లో రెండోసారి చీలిపోయి ఇందిరా కాంగ్రెస్, 1999లో చీలిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు
ఏర్పడ్డాయి.

బీజేపీ
1951లో ఏర్పాటు చేసిన భారతీయ జనసంఘ్ 1980లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)గా ఆవిర్భవించింది. దీని వ్యవస్థాపక అధ్యక్షులు అటల్ బిహారి వాజ్‌పేయి. ఈ పార్టీ 1996లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చి 13 రోజులు మాత్రమే ప్రభుత్వాన్ని నడపగలిగింది. 1998లో రెండోసారి అధికారం చేపట్టి 13 నెలల పాటు దేశాన్ని పాలించింది. 1999లో అధికారంలోకి వచ్చి పూర్తి కాలం కొనసాగింది. 1984లో ఈ పార్టీ అతి తక్కువగా రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2014లో అత్యధికంగా 282 సీట్లతో పూర్తి మెజార్టీ సాధించి అధికారం చేపట్టింది.

సీపీఐ

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను 1925లో మానవేంద్రనాథ్ రాయ్ స్థాపించారు. ఈ పార్టీ దేశంలో తొలిసారిగా 1957లో కేరళలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఈ పార్టీకి నేటికీ ఆదరణ ఉంది. అంతర్గత విభేదాల కారణంగా ఈ పార్టీ 1964లో చీలిపోయి సీపీఐ(ఎం) అనే కొత్త పార్టీ ఏర్పాటైంది. సీపీఐ(ఎం) కూడా 1968లో చీలిపోయి సీపీఐ(ఎంఎల్) అనే కొత్త పార్టీ మనుగడలోకి వచ్చింది.

జనతా పార్టీ
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చొరవతో అయిదు పార్టీలు కలిసి 1977లో జనతాపార్టీగా ఆవిర్భవించాయి. అధ్యక్షుడిగా మొరార్జీ దేశాయ్, ఉపాధ్యక్షుడిగా చరణ్‌సింగ్ ఎన్నికయ్యారు. ఈ పార్టీ 1977 నుంచి 1980 వరకు అధికారంలో కొనసాగింది. 2013లో ఈ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

జనతాదళ్ పార్టీ
ఈ పార్టీని 1988లో స్థాపించారు. దీని మొదటి అధ్యక్షుడు వి.పి.సింగ్. జనతాదళ్ పార్టీ 1989-91, 1996-98 వరకు అధికారంలో ఉంది.

బహుజన సమాజ్ పార్టీ
ఈ పార్టీని 1984లో కాన్షీరాం స్థాపించారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయడం ఈ పార్టీ ప్రధాన అజెండా.

ద్రవిడ మున్నేట్ర ఖజగం (డీఎంకే)
1949లో అన్నాదొరై డీఎంకేను స్థాపించారు. 1967లో తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ప్రాంతీయ పార్టీ ఇదే. 1974లో ఎం.జి. రామ్‌చంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు.

తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు 1982లో ఈ పార్టీని స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే (1983లో) అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఇదే. ఈ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983-89, 1994-2004 మధ్య అధికారంలో కొనసాగింది. 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 102 సీట్లు సాధించి అధికారం చేపట్టింది. తెలంగాణలోనూ 15 సీట్లు సాధించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి
2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పార్టీని స్థాపించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని అయిదు లోక్‌సభ, 26 విధానసభ సీట్లను సాధించింది. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని రెండు లోక్‌సభ, 10 విధానసభ సీట్లను సాధించింది. 2014 ఎన్నికల్లో 11 లోక్‌సభ స్థానాలు, 63 విధానసభ స్థానాలను గెలుపొంది, తెలంగాణలో మొదటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రజారాజ్యం పార్టీ
2008లో చిరంజీవి స్థాపించారు. 2009 ఎన్నికల్లో విధానసభలో 18 స్థానాలను గెలుచుకుంది. అనంతరం దీన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ)ని నల్గొండకు చెందిన కొలిశెట్టి శివకుమార్ 2009లో స్థాపించి రిజిస్టర్ చేయించారు. 2011లో వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పార్టీ 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 8 లోక్‌సభ, 67 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణలో 1 లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.

సమాజ్‌వాదీ పార్టీ
దీన్ని 1992లో ములాయంసింగ్ యాదవ్ స్థాపించారు. ప్రస్తుతం ఈ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉంది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
1999లో ప్రముఖ రైతు నాయకుడు శరద్ పవార్ స్థాపించారు. ఇప్పటి వరకు ఇది అధికారంలోకి రాలేదు.

ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)
2012లో అరవింద్ కేజ్రివాల్ స్థాపించారు. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో కొనసాగుతోంది.

శివసేన
దీన్ని 1966లో బాల్ థాకరే స్థాపించారు. ఈ పార్టీ బీజేపీ మిత్రపక్షంగా అధికారంలో భాగస్వామిగా కొనసాగింది.

నేషనల్ కాన్ఫరెన్స్
1939లో షేక్ అబ్దుల్లా ఈ పార్టీని స్థాపించారు. ఇది జమ్ము-కశ్మీర్‌లో మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది.

లోక్‌సత్తా
2006లో జయప్రకాశ్ నారాయణ్ స్థాపించారు.

మాదిరి ప్రశ్నలు

1. భారతదేశంలో ఏ రకమైన పార్టీ వ్యవస్థ ఉంది?
ఎ) ఏక పార్టీ విధానం
బి) ద్వి పార్టీ విధానం
సి) త్రి పార్టీ విధానం
డి) బహుళ పార్టీ విధానం

Published date : 28 Sep 2015 03:40PM

Photo Stories