తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలు మార్చి 18 (గురువారం)న ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం పూర్తి చేసింది.
ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్ష సమయం కంటే కనీసం గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆలస్యంగా వెళ్లి నష్టపోవద్దని స్పష్టం చేశారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు మాస్క్‌లు ధరించాలని, వాటర్ బాటిళ్లను అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సబ్బులు, లిక్విడ్ సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉన్న వారు ప్రత్యేక గదుల్లో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేకుండానే అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సమస్యలు ఉంటే తమ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు (040-23230942) ఫోన్ చేయవచ్చని సూచించారు. అవిభక్త కవలలు వీణావాణీలకు స్టేట్ హోం సమీపంలోని పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, వారు సొంతంగా పరీక్ష రాస్తామని మొదట్లో చెప్పినా అది సాధ్యమయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకే వారి విజ్ఞప్తి మేరకు సహాయకులను (స్క్రైబ్స్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణ పరీక్ష సమయం కంటే వారికి అదనంగా అరగంట సమయం ఇస్తామని తెలిపారు.
పరీక్ష రాసే విద్యార్థుల వివరాలు
పరీక్ష రాసే విద్యార్థుల వివరాలు
పాఠశాలలు: | 11,045 |
పరీక్ష కేంద్రాలు: | 2,530 |
మొత్తం విద్యార్థులు: | 5,34,903 |
వీరిలో బాలురు: | 2,73,971 |
బాలికలు: | 2,60,932 |
రెగ్యులర్ విద్యార్థులు: | 5,09,079 |
ప్రైవేటు విద్యార్థులు: | 25,824 |
ఇన్విజిలేటర్లు: | 30,500 |
సిట్టింగ్ స్క్వాడ్స్: | 144 |
ఫ్లైయింగ్ స్క్వాడ్స్: | 4 |
Published date : 19 Mar 2020 03:08PM