Skip to main content

సీబీఎస్‌ఈ టెన్త్–2021 పరీక్షలు రద్దు.. 12వ తరగతి పరీక్షలు వాయిదా..

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విలయ తాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
ఆస్పత్రులన్నీ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఢిల్లీతో పాటు పలు నగరాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్స్‌ ఖాళీ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాలు పెరిగిపోతుండటంతో చివరకు శ్మశానవాటికల ముందు కూడా భారీ క్యూలు ఏర్పడుతున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కావాలి్సన సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ రమేష్‌ పోఖ్రియాల్‌ ’నిశాంక్‌’, విద్యాశాఖ కార్యదర్శి, సీబీఎస్‌ఈ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పోఖ్రియల్‌ తెలిపారు. జూన్ 1న అప్పటి పరిస్థితిని సమీక్షించి, కొత్త షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ద్వారా మూల్యాంకనం చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ సూచించారు.
Published date : 15 Apr 2021 03:59PM

Photo Stories