Skip to main content

రెండు వారాల్లో టెన్త్ విద్యార్ధులకు గ్రేడింగ్‌!

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్‌ను మరో రెండు వారాల్లో ఇచ్చేలా ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5.21 లక్షల మంది విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారికి గ్రేడ్లు ఎలా ఇవ్వాలన్న విషయాన్ని తరువాత వెల్లడిస్తామంది. అయితే ఈ విషయంలో తాము ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. పాఠశాలల్లో నిర్వహించిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–1 ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని భావించారు. అయితే జాతీయస్థాయిలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలన్న నిర్ణయానికి వచ్చారు. సీబీఎస్‌ఈ కూడా ఇంటర్నల్స్‌ ఆధారంగా విద్యార్థులకు మార్కులను వేస్తామని ఇటీవల ప్రకటించడంతో రాష్ట్రంలోనూ ఎఫ్‌ఏ–1 మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ దిశగానే కసరత్తు ప్రారంభించారు. అవసరమైతే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈలోగా విద్యార్థులకు సంబంధించిన ఎఫ్‌ఏ–1 మార్కుల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థుల వారీగా వివరాలను పరిశీలించి ఆయా విద్యార్థుల మార్కులు, తల్లిదండ్రులు, ఇతర వివరాలను పరిశీలించే పనిని చేపట్టారు. అది పూర్తి కాగానే మరోసారి పరిశీలన జరిపి రెండు వారాల్లో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో వైపు మే 1న ప్రారంభం కావాల్సిన పాలీసెట్‌– 2021 దరఖాస్తుల ప్రక్రియ టెన్త్ విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబరు లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో హాల్‌టికెట్‌ నంబర్లను మరో ఐదారు రోజుల్లో జనరేట్‌ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. తద్వారా వారు పాలీసెట్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కనుంది.
Published date : 05 May 2021 03:44PM

Photo Stories