Skip to main content

‘కరోనా’ తగ్గే వరకు టెన్త్ పరీక్షలు వద్దు: తెలంగాణ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్‌ఎస్‌సీ బోర్డును హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచందర్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెన్‌‌త పరీక్షలన్నీ వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ పిల్‌ను గతంలో విచారించిన హైకోర్టు ఈ నెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను 30వ తేదీకి వాయిదా వేయాలని గతంలో ఆదేశించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు అన్ని సబ్జెక్టు పరీక్షలను పూర్తిగా వాయిదా వేయాలని ధర్మాసనం మార్చి 30 (సోమవారం)నప్రభుత్వాన్ని ఆదేశించింది. వాయిదా వేసినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, తర్వాత పరీక్షల రీషెడ్యూల్ వివరాలను ప్రకటించాలని సూచించింది. సోమవారం జరిగిన విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ వాదిస్తూ.. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదివారమే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ఆయన ధర్మాసనానికి నివేదించారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ విచారణలో జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నివాసంలో ధర్మాసనం ఉండగా, అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తన నివాసం నుంచి వాదనలు వినిపించారు.

పరీక్ష తేదీలు తరువాత ప్రకటిస్తాం: పరీక్షల విభాగం
వాయిదా పడిన టెన్‌‌త పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. హైకోర్టు తాజా ఆదేశాలతో పరీక్షలను పూర్తిగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.
Published date : 31 Mar 2020 02:20PM

Photo Stories