Skip to main content

ప్రతిధ్వని ఎలా కలుగుతుంది?

Tenth Classమనం గట్టిగా మాట్లాడినపుడు ఆ ధ్వని మనకు మళ్లీ వినపించడాన్ని ‘ప్రతిధ్వని’ అంటారు. ధ్వనితరంగాలు గాలిలో ఒకచోటు నుండి మరొకచోటుకు పయనిస్తుంటాయి. గాలిలో ధ్వనివేగం సెకనుకు 1100 అడుగులు (340 మీటర్లు) ఉంటుంది.

మనం మాట్లాడేటప్పుడు నోటినుండి వెలువడిన ధ్వని తరంగాలు గాలిలో వివిధ దిశలకు వ్యాపిస్తాయి. ఈ ధ్వని తరంగాలకు ఏదైనా గోడ లేదా వస్తువు అడ్డు తగిలినపుడు వెనుకకు వస్తాయి. పరావర్తనం చెందిన ఈ విధమైన ధ్వనితరంగాలనే ప్రతిధ్వని అంటారు. అంటే ధ్వని తరంగాలకు అడ్డు తగిలి పరావర్తనం చెందితే ప్రతిధ్వని పుడుతుంది.

ప్రతిసారి ప్రతిధ్వని కలగదు. మాట్లాడే వ్యక్తికి, అడ్డు తగిలే వస్తువుకు మధ్య కనీసం 17 మీటర్లు (55 అడుగులు) దూరం తప్పనిసరిగా ఉండాలి. దీనికి కారణం ఉంది. ధ్వని ఏదైనప్పటికీ దానిప్రభావం సెకనులో పదో వంతు (1/10) సమయం వరకు మన చెవిలో ఉంటుంది. ధ్వని 1/10 సెకనులో సుమారు 34 మీటర్లు (110 అడుగులు) దూరం వెళుతుంది. కాబట్టి ధ్వని పరావర్తనం చెంది తిరిగి మన చెవికి చేరాలంటే 17 మీటర్లు దూరం తప్పనిసరి అవుతుంది.
Published date : 13 Nov 2013 11:02AM

Photo Stories