History Notes for Groups: శాతవాహనులు–సంస్కృతి

Satavahanas-Culture: History Notes for Group 1, 2 Exams

శాతవాహనుల చరిత్రకు అనేక ఆధారాలు ఉన్నాయి. శాసనాలు, నాణేలు, శిల్పకళ, పురాణాలు, విదేశీ రచనలు, స్వదేశీ రచనలు వంటివి ముఖ్య ఆధారాలు. వీరిని శాతవాహనులని, శాతకర్ణులనీ సాహిత్యం వర్ణిస్తుంది. వీరు 30 మంది చక్రవర్తులు, సుమారు 450 సంవత్సరాలు(క్రీ.పూ.225 నుంచి క్రీ.శ.225 వరకు) దక్షిణ దేశాన్ని పరిపాలించారు. వీరికి పూర్వం దక్షిణ దేశచరిత్ర స్పష్టంగా తెలియదు. వీరు ‘మౌర్యులకు’ సామంతులు. అశోక చక్రవర్తి మరణానంతరం మౌర్యసామ్రాజ్యం క్షీణించింది. కడపటి మౌర్యుల బలహీనతను ఆధారంగా తీసుకొని.. శాతవాహనులు ‘దక్కన్‌’లో స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ వంశానికి మూల పురుషుడు ‘శ్రీముఖుడు’(మత్స్య పురాణం ప్రకారం). మెదక్‌ జిల్లాలోని ‘కొండాపూర్‌’లో లభించిన నాణెంపై శాతవాహన పేరు ఉంది. అందువల్ల ఈ వంశానికి ఇతడే మూలపురుషుడై ఉంటాడని.. అతని వల్లనే ‘శాతవాహన వంశం’ అనే పేరు వచ్చిందని చరిత్రకారుల భావన.

నాలుగు దశలుగా

శాతవాహనుల చరిత్రను నాలుగు దశలుగా విభజించవచ్చును. అవి..

  • శ్రీముఖుని నుంచి కుంతల శాతకర్ణి వరకు మొదటి దశ. 
  • కుంతల శాతకర్ణి నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు రెండో దశ. 
  • గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి యజ్ఞశ్రీ శాతకర్ణి వరకు మూడో దశ. 
  • యజ్ఞశ్రీ శాతకర్ణి నుంచి చండశ్రీపులోమావి–3 వరకు నాల్గో దశ. 
  • చండశ్రీ పులోమావి చివరి శాతవాహనరాజు. ఇతని కాలంలో ఇక్ష్వాకు ‘శాంతి మూలుడు తదితర సామంతులు తిరుగుబాటు చేసి.. శాతవాహన రాజ్యాన్ని అంతం చేశారు. 

శాతవాహనుల పుట్టుక

  • వీరి పుట్టు పూర్వోత్తరాలు స్పష్టంగా తెలియవు. తొలి శాసనాలు ‘ప్రాకృతం’లో ఉన్నాయి. తొలి స్థావరం మహారాష్ట్ర. తొలి రాజధాని పైఠాన్‌. అందువల్ల వీరు మహారాష్ట్రులని డా.మిరాసి భావించారు. తెలంగాణలోని ‘కోటిలింగాల’ తొలి రాజధాని అని మరికొందరు భావించారు. రాంప్సన్, వి.ఎ.స్మిత్‌ మొదలైన చరిత్రకారులు వీరి తొలి రాజధాని ఆంధ్రలో ఉన్న శ్రీకాకుళంగా పేర్కొన్నారు. (కాబట్టి అభ్యర్థులు శాతవాహనుల తొలి రాజధాని ఏది? ప్రశ్న వస్తే.. పైఠాన్‌(మహారాష్ట్ర), కోటిలింగాల(తెలంగాణ), శ్రీకాకుళం(ఆంధ్ర), మూడు సమాధానాలు వాస్తవాలే అని గుర్తించాలి. కాకపోతే అంత సులభమైన ప్రశ్నలు పరీక్షల్లో రాకపోవచ్చు. పైఠాన్‌ తొలి రాజధానిగా పేర్కొన్న  చరిత్రకారులు ఎవరు? లాంటి ప్రశ్నలు అడగవచ్చు.


చ‌ద‌వండి: APPSC/TSPSC Group1,2 Exams: చరిత్రను పట్టు సాధించి... విజేతలవ్వండి!​​​​​​​

రాజకీయ చరిత్ర

  • శ్రీముఖుడు రాజ్యస్థాపకుడు. తర్వాత మొదటి శాతకర్ణి ‘మరాఠ’ త్రణకైయిరో కుమార్తె దేవినాగానికతో వివాహం జరిపించుకొని.. తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి.. అశ్వమేధయాగం చేశాడని.. దేవినాగానిక వేయించిన నానాఘాట్‌ శాసనంలో పేర్కొన్నారు. తర్వాత రెండో శాతకర్ణి సుదీర్ఘకాలం సుమారు 56 సంవత్సరాలు పరిపాలన చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఈ వంశంలో గొప్ప రాజు. ఇతని యుద్ధ విజయాల గురించి తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్‌ శాసనంలో పేర్కొన్నారు.  యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి శాతవాహనుల రాజులలో గొప్పవాడు.  హాలుడు 17వ రాజు, గొప్ప కవిగా ప్రసిద్ధి చెంది ‘కవివత్సలుడు’గా బిరుదు పొందాడు. 30వ రాజు మూడో పులోమావి చివరి రాజు. వీరి తర్వాత ఈ రాజ్యాన్ని విజయపురి కేంద్రంగా ఇక్ష్వాకులు పరిపాలించారు.  అదే నేటి నాగార్జున సాగర్‌.

శాతవాహనుల సేవ

శాతవాహనులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించి.. శకుల, గ్రీకుల, ప్రహ్లావుల దండయాత్రల నుంచి దక్షిణ దేశాన్ని కాపాడిన ప్రతిభావంతులైన రాజులుగా కీర్తి పొందారు. దక్షిణ దేశంలో రాజకీయ ఐక్యతను సాధించి.. ఉత్తర–దక్షిణ దేశాలకు వారధిగా నిల్చి.. దక్షిణ దేశ సంస్కృతి, సాహిత్య, శిల్పకళా సేవలు చేశారని కె.ఎం.ఫణిక్కర్‌ చెప్పారు. ఆర్య, ద్రవిడ జాతి విభేదాలు సమసిపోయి.. మిశ్రమ సంస్కృతికి వీరు పునాదులు వేశారని చెప్పవచ్చు. దక్షిణ దేశానికి ప్రథమ రాజకీయ గౌరవం, పటిష్ట పాలన, ఘనమైన సంస్కృతి ఏర్పాటు చేశారు.

పాలనాంశాలు

వీరు ‘పితృరాజ్యపాలన’ను అందించారు. వికేంద్రీకృత పాలనా విధానాన్ని అనుసరించారు. రాజు ‘దైవాంశ సంభూతుడు’ అనే భావన గౌతమిపుత్ర శాతకర్ణి ప్రవేశపెట్టాడు. రాచరికం వారసత్వం. పరిపాలన నిరంకుశం కాదు, మంత్రుల సలహాను పాటించేవారు. రాణులు కూడా పరిపాలనలో భాగం పంచుకునేవారు. పెద్ద కుమారుని ‘యువరాజులు’గా ప్రకటించి.. పరిపాలనా శిక్షణనిచ్చే ఆచారం ఉంది.

చ‌ద‌వండి: AP History Practice Test

రాష్ట్ర పాలన

  • సామ్రాజ్యం జనపదాలు(సామంత రాజ్యాలు) గాను, రాజ్యాన్ని ‘ఆహారాలు (రాష్ట్రాలు)గాను విభజించారు. జనపదాలకు రాజన్, మహాభోజ మహారథ అని, ‘ఆహార’(రాష్ట్రాల) అధికారులను అమాత్యులనీ, మహా మంత్రులనీ పేర్లు కలవు. పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి ‘పౌరసభలు’ ఉన్నట్లు.. పట్టణ పాలన గురించి.. నిగమసభలు పాలించేవి అని ‘గాథాసప్తశతి’లో ఉంది. నిగమ సభలోని సభ్యులను ‘గహాపతులనీ’ పేర్కొన్నారు.  వీరికి ప్రత్యేక భవనాలు, రికార్డు గదులు ఉన్నట్లు మెగస్తనీస్‌ రాశాడు. ఐదు గ్రామాలను కలిపి ‘గ్రామణి’ పాలనా బాధ్యతలు ఉండేవి. నేరస్థులను చెట్లకు ఉరితీసేవారని ‘గాథాసప్తశతి’ తెల్పుతుంది.
  • రాజు యుద్ధాల్లో విజయానికి గుర్తుగా ‘అశ్వమేధ యాగాలు’ నిర్వహించేవాడు. ఖారవేలుడు శాతవాహన రాజ్యంలోని పితుండ నగరాన్ని ధ్వంసం చేశాడని హాతిగుంఫా శాసనంలో పేర్కొన్నారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి.. నహపాణుని కుటుంబాన్ని వధించాడని జునాగఢ్‌∙శాసనంలో ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి గుర్రాలు మూడు సముద్రాల నీళ్లు తాగాయని..  ‘త్రిసముద్ర తోయ పీతవాహన’ బిరుదు పొందాడని రాశారు. 
  • శాతవాహనులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కల్గి ఉన్నారు. స్కందావారాలు అనే సైనిక బసలను గురించి.. మ్యాకదోని శాసనం వివరించింది. నౌకాదళం నెలకొల్పి గ్రీకులను(యవనులు), ప్రహ్లావులు, శకులను ఓడించినట్లు ‘ఎరాస్మస్‌’ తన గ్రంథంలో పేర్కొన్నాడు. ప్రత్యేక శిక్షణ కల్గిన సైనిక వ్యవస్థతోపాటు మౌర్యుల నుంచి గూఢాచార పద్ధతులను శాతవాహనులు పాటించారు.

రాజ్యాదాయం

  • రాజ్యానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు. దీన్ని భాగ అని పిలిచేవారు. 1/6 వంతు లేదా 18 శాతం శిస్తు ఉండేది. రాజు సొంత భూములు కల్గి ఉండేవాడు(రాజకమ్‌బేట్‌) భాండాగారిక, హేరిణిక వంటి ఉద్యోగులు ఉన్నారు.
  • హిరణ్యకుడు లేదా హేరణీకడు: ద్రవ్యరూపమైన ఆదాయం భద్రపరిచేవాడు. 
  • భాండాగారికుడు: వస్తు సంచయాన్ని భద్రపరిచే అధికారి.
  • నిబంధనకారులు: రాజ్యవ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవాడు. వీరిని నిబంధనకారులని, అక్షకపటలనీ తర్వాత కాలంలో పిలిచేవారు.
  • వృత్తిపన్ను ‘కరుకర’ ద్వారా కూడా రాజ్యానికి ఎక్కువ ఆదాయం వచ్చేది. 18 రకాల వృత్తులు ఉన్నట్లు ‘మ్యాకదోని’ శాసనంలో ఉంది. వాటిలో కొన్ని.. కోలికులు–(సాలెవారు); తెసకారులు (మెరుగు పట్టేవారు) (స్వర్ణకారులు కారు); వధకులు–వడ్రంగులు; సేలవధకులు–శిల్పులు మొదలైనవారు. 
  • ఒక సువర్ణం(బంగారు నాణెం) = 35 కర్షపణాలతో సమానం.


చ‌ద‌వండి: TS History Practice Test

విదేశీ వ్యాపారం

  • నౌకా ముద్ర కలిగిన యజ్ఞశ్రీ శాతకర్ణి నాణెం.. ప్రకాశం జిల్లాలోని చినగంజాంలో లభించింది. దీన్ని బట్టి వీరు విదేశీ వాణిజ్యం ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. బాణుడు(హర్షుని ఆస్థాన కవి) కదాంబరి గ్రంథంలో.. యజ్ఞశ్రీని త్రిసముద్రాదీశ్వరుడుగా పేర్కొన్నాడు. 
  • శాతవాహనులు తూర్పు తీరంలో.. మైసోలియా, ఘంటసాల, కోరంగి(తూర్పు గోదావరి), కోడూరు, అరికమేడు(నేటి పుదుచ్చేరి) మొదలగు తీర ప్రాంతాల్లో నౌకా కేంద్రాలు నెలకొల్పారు. అరికమేడు మాత్రం వీరి అంతర్జాతీయ నౌకా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పశ్చిమ తీరంలో బరిగజ(బరుకచ్చ) (గుజరాత్‌ రాష్ట్రంలో), సోపార, కళ్యాణి రేవులు సుప్రసిద్ధం. 
  • తొండై(తమిళనాడు).. భారతదేశానికి రోమ్‌ దేశానికి మధ్య ప్రధాన నౌకా కే ంద్రంగా ఉంది. త్రప్పర అనే నావికులు సముద్రం మధ్యలో దారి తప్పిపోయిన నౌకలను సురక్షితంగా గమ్యాన్ని చేర్చేవారు ఉంటారని‘ పెరిప్లస్‌ ఆఫ్‌ ఎరిత్రియన్‌ సి’ డైరీలో రాయడం జరిగింది. ప్లీనీ తన ‘నేచురల్‌ హిస్టరీ’ గ్రంథంలో శాతవాహనులకు, రోమ్‌ దేశాలకు మధ్య వాణిజ్యం  జరిగేదని రాశాడు. భారతీయ వస్త్రాలకు ఐరోపాలో గిరాకీ మెండుగా ఉంటుందని కూడా పేర్కొన్నాడు. అక్కడి నుంచి భారతీయులు బంగారం దిగుమతి చేసుకునేవారు.

పరిశ్రమలు

తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి సమీపంలో ఉరైయూర్‌ వద్ద అద్దకం పరిశ్రమలో ఉపయోగించే పెద్ద తొట్టి బయల్పడింది. అవెసణిలు(చేతిపనివారు), నాయగమిసులు(భవన నిర్మాణ కార్మికులు).. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు. ఇనుము–ఉక్కుకు సంబంధించిన కత్తులు, బరిసెలు.. కరీంనగర్‌ జిల్లాలో, నల్గొండ జిల్లాలో బయటపడ్డాయి. ఎర్రమట్టి పరిశ్రమ ఆనవాళ్లు మెదక్‌(కొండాపూర్‌)లో దొరికాయి.

ఆభరణాలు

సుప్రసిద్ధమైన కోలాపూర్‌లోని బంగారం గనులే కాకుండా మస్కీ తదితర గనులలో కూడా బంగారం లభించేది.బంగారం పరిశ్రమకు ‘మస్కి’ప్రధాన కేంద్రం. 

తెలంగాణ పద ఆవిర్భావం: ‘స్కంద పురాణంలో’ త్రిలింగ దేశమని.. అంగుత్తనియం (తమిళ వ్యాకరణ) గ్రంథంలో ‘త్రిలింగ్‌’ అనే శబ్దాన్ని పేర్కొన్నారు. హేమాద్రి రాసిన ‘వ్రతఖండం’లో కాకతీయ ప్రతాపరుద్రదేవుని(మొదటి ప్రతాపరుద్రుడు) త్రిలింగాధిపతిగా, ఓరుగల్లును ‘ఆంధ్రానగరి’గా వర్ణించాడు. రెండో ప్రతాపరుద్రుని విద్యాధికారి, ఆస్థాన కవి.. విద్యానాథుడు. ఈయన కాళేశ్వరం (తెలంగాణ), ద్రాక్షారామం (ఆంధ్రా), శ్రీశైలం(రాయలసీమ) మధ్య ప్రాంతాలను ‘త్రిలింగదేశం’గా రాశారు. ఇదే అంశాన్ని పిన్నకోట పెద్దన ‘కావ్యాలంకార చూడామణి’ గ్రంథంలో సమర్థించాడు.

  • 1323 సంవత్సరంలో తురుష్కుల దండయాత్రతో ఓరుగల్లు పట్టణం, కాకతీయ రాజ్యం పతనం అయింది. జునాఖాన్‌(మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌) సేనాని అన్వర్‌వలి.. తన శాసనాల్లో  ‘తెలంగాణ’ అని రాశాడు. నిజాం అలీఖాన్‌ కాలంలో బ్రిటిషర్లు ‘ఉత్తర సర్కార్‌’ జిల్లాలు పొందారు. బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని ‘ఆంధ్ర’ గా, నిజాం పాలనలోని ప్రాంతానికి ‘తెలంగాణ’ అని కైఫియత్తులో రాశారు.

ఎంతో మంది పరిశోధనలు

  • తెలంగాణపై అనేక మంది ఆంగ్లేయులు పరిశోధనలు కొనసాగించారు. అలాంటి వారిలో ఎడ్వర్డ్‌ బోస్‌ఫుట్, ఫ్రాంక్‌.పి.మాన్లే, ప్రొఫెసర్‌ హైమన్‌డార్ప్, కాగ్లిన్‌ బ్రేన్, మెడోస్‌ టేలర్‌ మొదలైనవారు ముఖ్యులు. వీరిలో ‘ఎడ్వర్డ్‌ బ్రూస్‌ఫుట్‌’కు ప్రథమ స్థానం దక్కుతుంది. ఆయన ఎంతో కష్టపడి ఎన్నో ప్రదేశాల్లో పరిశోధనలు జరిపి ఆదిమానవుని నాగరికతా అవశేషాలు గుర్తించాడు. 
  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిశోధన చేసిన ఎఫ్‌.ఆర్‌.వి.అల్పిన్, నల్గొండ జిల్లాలోని ‘నార్కట్‌పల్లి’లో పరిశోధనలు చేసిన ‘మెడోస్‌ టేలర్‌’ అనే శాస్త్రవేత్తల కృషి అద్భుతం. నల్గొండ జిల్లాలోని ‘దేవరకొండ’ మున్సిపల్‌ పరిధిలోని ‘ఏలేశ్వరానికి’  ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదేశాల్లో మానవ జనావాసం అతి ప్రాచీనమైన పాతరాతియుగపు తొలిదశ నుంచి చారిత్రక యుగం వరకూ.. అవిచ్ఛిన్నంగా వర్థిల్లినట్లు ‘ఎరాన్‌’ గ్రీకు చరిత్రకారుని రచనల్లో, చైనా యాత్రికుడు‘ఇత్సింగ్‌’ గ్రంథాల్లోనూ మనం గమనించవచ్చు. 
  • మెగస్తనీస్‌ గ్రీకు భాషలో రాసిన ఇండికా గ్రంథం అలభ్యం. ప్రస్తుతం లభించిన ‘ఇండికా’ గ్రంథం ‘ఎరాన్‌’ రాసింది మాత్రమే అని అభ్యర్థులు గమనించాలి. ‘ఇండికా’ అనే గ్రంథం రాసింది ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం.. మెగస్తనీస్, ఎరాన్‌ అని ఇద్దరిని సూచించాల్సి వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లలో.. మెగస్తనీస్‌ లేకుంటే ఎరాన్‌ను గుర్తించాల్సి ఉంటుంది. మెగస్తనీస్‌ తన గ్రంథంలో శాతవాహనులకు ప్రసిద్ధమైన 30 నగరాలు ఉన్నాయని..వాటిలో కొండాపూర్‌(మెదక్‌), ఏలేశ్వరం (వర్తక వాణిజ్యాల్లో ప్రసిద్ధి చెందింది)గా పేర్కొనటం మనం గమనించవచ్చు. ఇక్ష్వాకుల కాలంలో..‘ఏలేశ్వరం’, నాగార్జున కొండ బౌద్ధమత కేంద్రాలకు స్వర్ణయుగంగా మారాయి.

ఐ. నీల, సబ్జెక్ట్‌ నిపుణులు

చ‌ద‌వండి: Indian History Practice Test

#Tags