Tohfa Handicrafts : ఉద్యోగం పోయింది.. చేతి విద్యతోనే సొంత వ్యాపారం.. ఉపాధి అవకాశాలతో..
సాక్షి ఎడ్యుకేషన్: ఎటువంటి ఉద్యోగం ఉన్న లేకపోయినా వచ్చిన విద్యతోనే బతికేయవచ్చు. అలాగే, ఉద్యోగం కోల్పోయిన మంజూషకు కూడా కుట్టుపని బాగా తెలుసు. ఈ విద్యతోనే అతి తక్కువ పెట్టుబడితో ఫ్యాబ్రిక్ డిజైన్‌లకు సంబంధించిన ‘తోఫా’ బ్రాండ్ ప్రారంభించింది. ముంబైకి చెందిన మంజూష ఆ బ్రాండ్ ద్వారా ఇప్పుడు లక్షలు అర్జించే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది మహిళలకు ఉపాధి ఇస్తోంది. ఇప్పడు తన కథేంటో తెలుసుకుందాం..
లా కంపెనీలో..
52 ఏళ్ల వయసులో మంజూష ఉద్యోగం కోల్పోయింది. బతకడానికి, కుమార్తెను చదివించడానికి మరో ఉద్యోగం వెదుక్కోక తప్పని పరిస్థితి. తన వయసుకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఎంతో అయోమయంలోకి వెళ్లింది. ఈ సమయంలోనే మంజూషకు ఒక లా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాని, రోజూ గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లాలి. నీరసంగా ఉండేది, నిస్పృహగా ఉండేది. అయినప్పటికీ ‘ఇల్లు గడుస్తుందిలే’ అనే చిన్న సంతృప్తితో ఉద్యోగం చేస్తూ ఉండేది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
కూతురి ప్రోత్సాహంతోనే..
కొన్నిసార్లు ఉద్యోగం మానెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చేది. ఇంతలో కూతురు చదువు గుర్తుకు వచ్చి తన నిర్ణయాన్ని మార్చుకునేది. తల్లి మౌనవేదనను గమనించిన కూతురు ఆమెతో వివరంగా మాట్లాడితే.. ఉద్యోగం చేయాలని లేకున్న తప్పని పరిస్థితి అంటూ వివరిస్తుంటే.. ఉద్యోగం చేయకపోతే మనం బతకలేమా అంటూ ప్రశ్నించింది తన కూతురు నజూక.
ఎలా అని తల్లి అడగ్గా.. బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు కదా.. వచ్చిన విద్యతో ఎక్కడైనా బతికేయోచ్చు కదా అని కూతురు చెప్పగా.. ఇంటిలో ఒక మూలన వన్స్ అపసాన్ ఏ టైమ్ కుట్టుమిషన్ ఉంది. ‘నీ కూతురు చెప్పింది నిజమే. ముందుకు వెళ్లు’ అన్నట్లుగా అభయం ఇచ్చింది ఆ పాత కుట్టు మిషన్.
తోఫాతో కొత్త వ్యాపారం..
కుమార్తె నజుకా జేవియర్‌తో కలిసి ‘తోఫా’కు శ్రీకారం చుట్టింది మంజూష. ‘ఒకవేళ ఈ వ్యాపారంలో విఫలమైతే! ఏదో ఒక ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందా....’ ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి మంజూషకు. అయితే ఒక్కసారి పనిలో మునిగిపోయాక ఆ సందేహాలు దూరం అయ్యేవి. ఎంతో ధైర్యం వచ్చేది.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
చెన్నై ఎగ్జిబిషన్‌తో..
చెన్నైలో జరిగిన ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న తరువాత తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఇంటి అలంకరణలు, ఫ్యాబ్రిక్ డిజైన్లకు సంబంధించి తన బ్రాండ్‌కు అక్కడ మంచి స్పందన వచ్చింది. రెండు వేల రూపాయల పెట్టుబడితో మొదలు పెట్టిన ఈ బ్రాండ్ ఇప్పుడు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ‘సొంతంగా ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకునేదాన్ని. కాని ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. మరిచిపోయాను అనుకున్న కళ మళ్లీ నా దగ్గరకు వచ్చింది. కుట్టుపని నాలో ఆత్మవిశ్వాసాన్ని, నా జీవితంలో వెలుగుల్ని నింపింది’ అంటుంది మంజూష.
కూతురి తోడుతోనే..
మార్కెంటింగ్‌లో పట్టా పుచ్చుకున్న కూతురు నజూక బ్రాండ్ రూపకల్పనలో, విజయవంతం చేయడంలో తల్లికి సహాయం అందించింది. ‘అమ్మ దుబారా ఖర్చు చేసేది కాదు. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేది. చిన్నప్పుడు నాకోసం బట్టలు కొనేది కాదు. పాత చీరలు, ఇతర దుస్తుల నుంచి నాకు అందమైన డ్రెస్‌లు కుట్టేది. అప్పటి ఆ విద్య వృథా పోలేదు. మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది’ అంటుంది నజూక.
ఎంతోమందికి ఉపాధిగా తోఫా
‘కుమార్తె రూపంలో యువతరంతో కనెక్ట్ కావడం వల్ల ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను. అప్‌డేట్ అయ్యాను. మా వ్యాపారంలో ఇప్పటి వరకు ప్లాస్టిక్ వాడలేదు’ అంటుంది మంజూష. ‘తోఫా’ ద్వారా తాను ఉపాధి పొందడమే కాదు ఎంతోమంది చేతివృత్తి కళాకారులకు ఉపాధిని ఇస్తోంది మంజూష. వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న మహిళలను ఉద్దేశించి... ‘భయం, సందేహాలు ఎప్పుడూ ఉండేవే. అయితే అవి మన దారికి అడ్డుపడకుండా చూసుకోవాలి’ అంటుంది.