జల విద్యుత్ కేంద్రాలు

ఎత్తు నుంచి జాలువారే నీటిని ప్రయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాలను ‘జల విద్యుత్ కేంద్రాలు’ అంటారు. విద్యుత్ లోటును అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం పెంచడం, కొత్తగా ప్రాజెక్టులను చేపట్టడం లాంటివి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధానమైన జల విద్యుత్ కేంద్రాలు, రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..
శ్రీ శైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. ఇది మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్టు ఎత్తు 270 మీ., పొడవు 512 మీ. ఇది 800 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. ఈ కేంద్రంలో 150 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం
ఇది రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం. నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద దీన్ని నిర్మించారు. ఈ కేంద్రం విద్యుదుత్పత్తి సామర్థ్యం 815.6 మెగావాట్లు. ఇక్కడ 110 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 1 టర్బైన్, 100.8 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 టర్బైన్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు. ఈ కేంద్రంలో 30 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న 2 టర్బైన్లు ఉన్నాయి. దీని మొత్తం ఉత్పాదక సామర్థ్యం 60 మెగావాట్లు.

ప్రియదర్శిని జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం
మహబూబ్‌నగర్ జిల్లాలోని రేవులపల్లి గ్రామం వద్ద కృష్ణానదిపై 1995లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ కేంద్రంలో 39 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లు (యూనిట్లు) నెలకొల్పారు. దీని మొత్తం ఉత్పాదక సామర్థ్యం 234 మెగావాట్లు.

దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం
ఇది నిర్మాణ దశలో ఉన్న ప్రధానమైన జలవిద్యుత్ ప్రాజెక్టు. దీన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆత్మకూర్ మండలం, మూలమల్ల గ్రామం వద్ద నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2008లో ప్రారంభించారు. 2015 చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ఉత్పాదక సామర్థ్యం 240 మెగావాట్లు. ఈ కేంద్రంలో 40 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న 6 టర్బైన్లను ఏర్పాటు చేశారు. దీని మొదటి యూనిట్‌ను 2013 డిసెంబర్‌లో, రెండో యూనిట్‌ను 2014 జనవరిలో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

పోచంపాడు జలవిద్యుత్ కేంద్రం
ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శ్రీరాంసాగర్ డ్యాంకు దిగువన నిర్మించారు. ఈ కేంద్రంలో 9 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లను స్థాపించారు. దీని స్థాపిత సామర్థ్యం 36 మెగావాట్లు.

నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం
దీన్ని నిజామాబాద్ జిల్లాలోని ‘హసనపల్లి’ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఉత్పాదక సామర్థ్యం 10 మెగావాట్లు.

సింగూర్ జల విద్యుత్ కేంద్రం
ఈ విద్యుత్ కేంద్రం మెదక్ జిల్లాలోని పులకల్ గ్రామంలో సింగూరు రిజర్వాయర్ వద్ద ఉంది. ఈ కేంద్రంలో 7.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 2 యూనిట్లను ఏర్పాటు చేశారు. దీని మొత్తం స్థాపిత సామర్థ్యం 15 మెగావాట్లు.

పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రం
దీన్ని ఖమ్మం జిల్లా పాలేరు గ్రామంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1993 ఫిబ్రవరి 13 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. దీని స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 2 మెగావాట్లు.

పెద్దపల్లి మినీ జల విద్యుత్ కేంద్రం
ఈ విద్యుత్ కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాకతీయ కాలువపై నిర్మించారు. ఇక్కడ 1986 మార్చి 31 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 9.16 మెగావాట్లు.

పులిచింతల జల విద్యుత్ కేంద్రం
ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. నిర్మాణ దశలో ఉంది. దీన్ని పద్మభూషణ్ కనూర్ లక్ష్మణరావు ప్రాజెక్టుగా కూడా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్టును గుంటూరు జిల్లా పులిచింతల గ్రామం వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్నారు. దీని ప్రతిపాదిత జల విద్యుత్ కేంద్రం నల్గొండ జిల్లా ‘నెమలిపురి’ గ్రామంలో ఉంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 120 మెగావాట్లు. ఇందులో 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 యూనిట్లు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు
1. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO):
1959లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా దీన్ని APGENCO, APTRANSCOగా విభజించారు. విద్యుత్ ఉత్పత్తి బాధ్యతలను APGENCO, సరఫరా బాధ్యతలను APTRANSCO చూసేది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 జూన్ 2న APGENCO నుంచి TSGENCOను ఏర్పాటు చేశారు. TSGENCO ద్వారా 2282.50 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 2081.76 మెగావాట్ల జల విద్యుత్, 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
2. ట్రాన్‌‌సమిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSTRANSCO):
విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 1999 ఫిబ్రవరి 1న APTRANSCOను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2న APTRANSCO నుంచి TSTRANSCO ఏర్పడింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా బాధ్యతలు మొత్తం దీని పరిధిలోనే ఉంటాయి.

తెలంగాణ రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. అవి:
ఎ) తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSNPDCL): దీని ప్రధాన కేంద్రం వరంగల్‌లో ఉంది. ఈ కంపెనీ 5 ఉత్తర జిల్లాల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.
అవి: ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం.
బి) తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSSPDCL): దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. ఈ కంపెనీ 5 దక్షిణ జిల్లాల విద్యుత్ అవసరాలను తీరుస్తోంది.
అవి: హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ.
ఈ రెండు పంపిణీ సంస్థలు దాదాపు రాష్ట్రంలోని 1.2 కోట్ల వినియోగదారుల విద్యుత్ అవసరాలను తీరుస్తున్నాయి.

కేటగిరీలవారీగా విద్యుత్ వినియోగం

కేటగిరీ

విద్యుత్ వినియోగం

గృహావసరాలు

73 శాతం

వ్యవసాయం

17 శాతం

పారిశ్రామిక అవసరాలు

01 శాతం

వాణిజ్య అవసరాలు

08 శాతం

ఇతర అవసరాలు

01 శాతం


రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో ఏడాది కాలంలో ఒక్కో వ్యక్తి ఉపయోగించిన విద్యుత్ శక్తిని ‘రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం’ అంటారు. దీన్ని కిలోవాట్ అవర్ (KWH)లలో కొలుస్తారు. తలసరి విద్యుత్ వినియోగాన్ని దేశాభివృద్ధికి ముఖ్య సూచీగా పరిగణనలోకి తీసుకుంటారు.
  • 2012-13లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం ఉన్న జిల్లాలు వరుసగా..
    మెదక్ 1415 KWH
    నల్గొండ 1310 KWH
    హైదరాబాద్ 1293 KWH
  • 2012-13లో అత్యల్ప తలసరి విద్యుత్ వినియోగం ఉన్న జిల్లాలు వరుసగా..
    ఆదిలాబాద్ 502 KWH
    ఖమ్మం 522 KWH
  • వ్యవసాయ అవసరాలపరంగా సగటు విద్యుత్ వినియోగంలో నల్గొండ జిల్లా మొదటి స్థానం (565 KWH)లో ఉంది.
  • పరిశ్రమల సగటు విద్యుత్ వినియోగంలో మెదక్ జిల్లా మొదటి స్థానం (558 KWH)లో ఉంది.
  • గృహావసరాల విద్యుత్ వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా - హైదరాబాద్ (577 KWH).
తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం- 2015’ ప్రకారం రాష్ట్రంలో 2012-13లో విద్యుత్ తలసరి వినియోగం (985 KWH)గా ఉంది. దేశ తలసరి విద్యుత్ వినియోగం (917 KWH) కంటే ఇది ఎక్కువగా ఉంది.

ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం:
తెలంగాణ ప్రభుత్వం 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో 2015 సెప్టెంబరు 22న రెండు రాష్ట్రాల అధికారులు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. 12 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. తెలంగాణలో విద్యుత్ లోటును అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని మధ్వా థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా మొత్తం 2081.76 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
  • రాష్ట్రంలో విద్యుత్‌ను అత్యధికంగా దాదాపు 73 శాతం గృహావసరాలకు, 17 శాతం వ్యవసాయ అవసరాలకు వినియోగిస్తున్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం - శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం.
  • పరిశ్రమల సగటు విద్యుత్ వినియోగంలో మెదక్, గృహావసరాల విద్యుత్ వినియోగంలో హైదరాబాద్ జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి.





































#Tags

Related Articles