స్టూడెంట్‌కి మరో కీలకఘట్టం యు.ఎస్. ప్రయాణం

మీకు స్టూడెంట్ వీసా వచ్చిన తర్వాత ఘట్టం మీ అమెరికా ప్రయాణం. ఇన్నాళ్లు మిమ్మల్ని కలలో ఊరిస్తున్న దేశానికి చేరుకోవడం! మీ ఒరిజినల్ డాక్యుమెంట్లని ఫ్లైట్‌లో కూడా మీ వెంటే ఒక సురక్షితమైన చిన్న బ్యాగ్‌లో ఉంచుకోవడం మంచిది. మీ యు.ఎస్. యూనివర్సిటీ/స్కూలు అధికారి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్‌ని, ఆ స్కూలు తాలూకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌ని ప్రయాణంలో మీ వద్ద ఉంచుకోండి.

విమానంలో ఫ్లైట్ అటెండెంట్లు ఇచ్చిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్, అరైవల్ డిపార్చర్ రికార్డులని విమానం దిగడానికి ముందే పూర్తిచేసి దగ్గర పెట్టుకోండి (వీటిని పూర్తి చేసి తర్వాత మళ్లీ ఫ్లైట్ అటెండెంట్లకే తిరిగి ఇవ్వకూడదు). విమానం దిగిన తర్వాత మిగతా ప్రయాణీకులతో పాటు టెర్మినల్ ఏరియాకి వెళ్లి క్యూలో నిలబడి మీ పాస్‌పోర్టు, మిగతా అన్ని పత్రాలను అక్కడి తనిఖీ అధికారికి అందజెయ్యండి. అమెరికా కొత్తగా వెళ్లినవారు ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఎయిర్‌పోర్టులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లో వినిపించే అనౌన్స్‌మెంట్ల మీద, కనిపించే సైన్‌బోర్డుల మీద బాగా దృష్టి పెడితే మీకు కొత్తవిగా, చాలా పెద్దవిగా ఉండే ఆ ఎయిర్‌పోర్టులలో ఏది తెలుసుకోవడమైనా మీకు సులభం అవుతుంది.

అమెరికాలో దిగే విదేశీయులందరూ తాము ఎందుకు అమెరికా వస్తున్నదీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వివరంగా చెప్పవలసి ఉంటుంది. విమానం దిగినచోట నుంచి మళ్లీ ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో కూడా (మీ తుది గమ్యం గురించి) అడిగితే చెప్పాలి. మీరు విద్యార్థి అనేది మిమ్మల్ని అక్కడ ప్రశ్నించే అధికారికి మీరు చెప్పడం కూడా అవసరమే. అలాగే మీరు ఏ కోర్సుకి, ఏ యూనివర్సిటీకి, ఏ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఎంతకాలం ఉండబోతున్నారన్న వివరాలని కూడా మీ నాలుక అంచుల్లో ఉంచుకోండి.

అక్కడ తనిఖీ పూర్తయిన తర్వాత సదరు అధికారి ఎఫ్-వీసాలకి మీ సెవిస్ ఫామ్ మీద డి/ఎస్ (డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్) స్టాంపు వేస్తారు. ఎం-వీసాలకి మాత్రం ప్రోగ్రాం ముగిసే తేదీకి 30 రోజుల తర్వాత తేదీని (యు.ఎస్. నుంచి తిరిగి వెళ్లిపోవలసిన గడువుగా) రాసిస్తారు. స్టాంప్ చేసి ఇచ్చిన ఐ 94 ని మీ పాస్‌పోర్టుతో పాటు భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అదే మీ అసలైన వీసా.

ఒకవేళ తనిఖీలో సంతృప్తి చెందకపోతే అప్పుడు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సిబిపి) అధికారి ‘‘నోటీస్ టు స్టూడెంట్/ఎక్స్‌ఛేంజ్ విజిటర్-ఐ 515 ఏ’’ ఇష్యూ చేస్తూనే యు.ఎస్.లోకి తాత్కాలిక ప్రవేశాన్ని మంజూరు చేయవచ్చు. ఇట్టివారు ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా సరైన డాక్యుమెంట్లు సమర్పించవలసి ఉంటుంది (ఇది అరుదుగా జరుగుతుంది).

ఎయిర్‌పోర్టు నుంచి మీరిప్పుడు విజయవంతంగా బయటకు వెళ్లారు. అమెరికా మిమ్మల్ని చేతులు సాచి ఆహ్వానించింది. ఎప్పుడు చూడాలా అని ఎదురుచూసిన ఆ సుసంపన్న దేశం మీరు అక్కడ అడుగుపెడుతుండగానే మిరుమిట్లు గొలిపే తన అందచందాలతో, నవ నాగరికతతో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే అందులో లీనమై మీకు ప్రవేశం ఇచ్చిన స్కూలులో రిజిస్టర్ చేసుకోవలసిన నిర్ణీత గడువును మిస్ అవ్వకూడదు. సెవిస్ ఐ-20 ఫామ్ మీద ఉండే తేదీకి 30 రోజుల లోగా స్కూలులో రిపోర్టు చేసి మీ కోర్సుకి రిజిస్టర్ చేసుకోలేకపోతే పర్యవసానం క్లిష్టంగా ఉంటుంది.

#Tags