AP Anganwadi Workers : విధుల్లోకి చేరిన అంగన్‌వాడీ కార్యకర్తలు.. ఇంకా 1413 మంది..

అమరావతి : అంగన్‌వాడీ కార్యకర్తలు జ‌న‌వ‌రి 17వ తేదీన (బుధవారం) విధుల్లో చేరారు. 30 రోజులుగా సమ్మె చేస్తున్న కార్యకర్తలు కొందరు విధుల్లో చేరేందుకు అంగీకరిస్తూ లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. కార్యకర్తలు మాట్లాడుతూ.. తమ సమస్యలలో అత్యధిక భాగం ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.

వేతనాలు వచ్చే జూలైలో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో విధుల్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ షేక్‌ ఇమాంబీ మాట్లాడుతూ.. అమరావతి సెక్టార్‌లో 33 అంగన్‌వాడీ సెంటర్‌లు, ధరణికోట సెక్టార్‌లో 31 సెంటర్‌లు ఉండగా గతంలోనే ధరణికోట సెక్టార్‌లో ఉన్న 31 అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె విరమించి విధులలో చేరారన్నారు.

☛ Anganwadi Workers Demands : అంగన్‌వాడీలకు ఉద్యోగులు అడిగిన డిమాండ్లు అన్ని కూడా..

జ‌న‌వ‌రి 17వ తేదీన అమరావతి సెక్టార్‌లోని 33 కేంద్రాలలో 22 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 15 మంది ఆయాలు లిఖితపూర్వకంగా తాము విధులలో చేరతామని రాసి ఇచ్చి విధులలో చేరారన్నారు. మరికొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులలో చేరటానికి తమను సంప్రదిస్తున్నారని వారు కూడా గురువారం విధుల్లో చేరతారని వెల్లడించారు.

ప్రభుత్వం చేసిన సూచన మేరకు 1413 మంది విధుల్లోకి..
నరసరావుపేట.. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు వెంటనే విధుల్లో చేరాలని జిల్లాలో మహిళా, శిశుసంక్షేమశాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.అరుణ జ‌న‌వ‌రి 17వ తేదీన (బుధవారం) ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లలో 2,031 మంది అంగన్‌వాడీలు పనిచేస్తుండగా వీరిలో కార్యకర్తలు 1996, సహాయకులు 1925 మంది పనిచేస్తున్నారన్నారు. వీరందరూ గత నెల 12 నుంచి సమ్మెలో ఉండగా ప్రభుత్వం చేసిన సూచన మేరకు 1413 మంది విధుల్లోకి చేరారన్నారు.

☛ Anganwadi Jobs : భారీగా అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే జీతాలు పెంపునకు కూడా..: మంత్రి సీతక్క

అంగన్‌వాడీ సహాయకులు కార్యకర్తలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచిందని, టీఏ, డీఏలు పెంచిందని, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు, సేవా ముగింపు ప్రయోజనం పెంచుతూ జీఓలు జారీ చేసిందని చెప్పారు. వీటిని గమనించి మిగతా కార్మికులు కూడా విధుల్లో చేరాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

#Tags