Telangana Breaking News:ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ: మంత్రి శ్రీధర్‌బాబు

Telangana Breaking News:ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ‘టీజీ ఫైర్‌ సర్వీసెస్, సివిల్‌ డిఫెన్స్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ’లో శనివారం జరిగిన 196 మంది డ్రైవర్‌ ఆపరేటర్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లుగా నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించిందన్నారు. ‘భర్తీ ప్రక్రియలో ఏర్పడిన న్యాయపరమైన ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నియామక పత్రాలను అందజేస్తున్నాం. ఈ విషయంలో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. హోంశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు’అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Telangana Breaking News: 3,673 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన

అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను ఆయన కొనియాడారు. ఎక్కడ విపత్తు తలెత్తినా రంగంలోకి దిగి ప్రజల ప్రాణాలను కాపాడుతారన్నారు. కాగా, ఏడాది వ్యవధిలోనే అగ్నిమాపక శాఖకు సంబంధించిన విభాగాల్లో 878 మందిని భర్తీ చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేస్తామన్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 196 మంది డ్రైవర్‌ ఆపరేటర్లకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఉద్యోగాల్లో చేరిన తర్వాత నీతి, నిజాయితీతో వ్యవహరించాలని, ఆపదలో ఉన్న వారిని కాపాడటం గురుతర బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం అగ్నిమాపక శాఖ కార్యక్రమాలను ఫైర్‌ డీజీ నాగిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నాగపూర్ణ శ్రీనివాస్, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టి.మల్లేశ్‌ ముదిరాజ్, నార్సింగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కె.వేణుగౌడ్, హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రవి గుప్తా, అగ్నిమాపకశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.   

ఇదీ చదవండి: కేలండర్‌ ప్రకారమే ఉద్యోగాలు!... మార్చి 31లోగా గ్రూప్‌–1 నియామకాలు పూర్తి :సీఎం రేవంత్‌

 

#Tags