Good news for Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ ఇక నుంచి వీరికి...
ఆసిఫాబాద్‌అర్బన్: అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసించే చిన్నారులకు సైతం డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులకే యూనిఫాంలు అందించారు. ఇక నుంచి అంగన్‌వాడీల్లో 3 సంవత్సరాల వయస్సు నుంచి 6 సంవత్సరాల వయస్సులోపు చిన్నారులకు ఉచితంగా ఏకరూప దుస్తులు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు వాటిని కుట్టారు. త్వరలో యూనిఫాంలు పంపిణీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుంది.
తొలివిడతలో 410 కేంద్రాల్లో..
ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో తొలి విడతలో డ్రెస్‌కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో మొత్తం 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో తొలి విడతలో 410 కేంద్రాల్లో 8,818 మంది చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించనున్నారు. తొలి విడతలో జిల్లాకు మొత్తం 8,035 మీటర్ల క్లాత్ రాగా అందులో 8,818 మంది చిన్నారులకు యూనిఫాంలు కుట్టించారు. చిన్నారులు ఇక యూనిఫాంలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సందడి చేయనున్నారు.
అన్ని హంగులతో..
జిల్లాలో పలు అంగన్‌వాడీ కేంద్రాలను సరికొత్త హంగులతో రూపుదిద్దుతున్నారు. తొలి విడతలో 11 కేంద్రాలకు మరమ్మతులు, రంగులు వేయడం, ఇతర అభివృద్ధి పనులకు గాను ఒక్కో కేంద్రానికి రూ. 2లక్షలు కేటాయించారు. కాగా అంగన్‌వాడీ కేంద్రాలకు రంగులు వేసే పనులు పూర్తి కానున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కలర్ బెంచీలు, ర్యాక్‌లు ఏర్పాటు చేయనున్నారు.
పిల్లలను ఆకర్షించేలా డిజైన్‌లు..
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను ఆకర్షించేందుకు పలు రకాల డిజైన్‌లలో ఏకరూప దుస్తులను ప్రభుత్వం ఎంపిక చేసింది. బాలికలకు ఫ్రాక్, బాలురకు నిక్కర్, షర్టు ఇవ్వనున్నారు. యూనిఫాంతో చిన్నారులు మరింత మురిసిపోనున్నారు. తల్లి దండ్రులు కూడా యూనిఫాంలతో తమ పిల్లలను చూసి సంతోషంగా అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా యూనిఫాంల పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్ల అధికారులు పేర్కొంటున్నారు.
పంపిణీకి సిద్ధం
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే అంగన్‌వాడీ సెంటర్‌లకు వస్తున్న చిన్నారులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తొలి విడతలో ఎంపిక చేసిన కేంద్రాల్లోని చిన్నారులకు త్వరలోనే యూనిఫాంలు అందించనున్నాం. ఇప్పటికే డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో దుస్తులు కుట్టించాం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో చిన్నారులకు యూనిఫాంలను అందజేస్తున్నాం. పలు అంగన్‌వాడీ కేంద్రాల కు రంగులు, మరమ్మతులు సైతం చేయిస్తున్నాం.