School Admissions: ప్రభుత్వ బడుల్లో.. గతేడాది కంటే తగ్గిన అడ్మీషన్లు
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు లక్ష్యంగా చేపట్టిన బడిబాట మొక్కుబడిగా సాగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 6నుంచి 19వరకు కార్యక్రమం నిర్వహించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పాఠశాల పునః ప్రారంభం కంటే ముందే ఎంతో ఆర్భాటంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ఒకట్రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో పట్టించుకున్నట్లు కనిపించలేదని తెలుస్తోంది. ఒకటో తరగతిలో ఆన్‌లైన్‌లో నమోదైన విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
వసతులు పెరిగినా..
ప్రభుత్వ బడుల్లో మునుపటి కంటే వసతులు మెరుగయ్యాయి. మన ఊరు–మనబడి, మన బస్తీ–మన బడి, అమ్మ ఆదర్శ కమిటీలతో మౌలిక వసతులు పెరిగాయి. తెలుగుతోపాటు ఆంగ్ల బోధన జరుగుతోంది. తరగతులు ప్రారంభించిన రోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, నోట్‌పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు బడీడు పిల్లలందరికీ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బడిబాట నిర్వహించింది.
ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో కల్పిస్తున్న వసతులు వివరిస్తూ బడీడు పిల్లలను చేర్పించాలని తల్లి దండ్రులకు అవగాహన కల్పించారు. బడిబాట ని ర్వహణ కోసం ప్రతీ పాఠశాలలో కరపత్రాలు త యారు చేయించి ప్రచారం చేశారు. ఇందుకు ప్రతీ పాఠశాలలకు రూ.వెయ్యి చొప్పున మంజూరు చేశారు. బడిబాటలో నిర్ణయించిన కార్యక్రమాలను విధి గా నిర్వహించి చివరి రోజు నివేదికలు పంపాలని ఆదేశించారు. ప్రతీ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు శ్రద్ధ తీసుకోవాల్సి ఉండగా ఒకట్రెండు రోజులు మినహా మిగిలిన కార్యక్రమాలపై అంతగా దృష్టి సారించలేనట్లు తెలుస్తోంది.
TS Gurukulam: గురుకులాలకు ఉద్యోగుల కేటాయింపు.. వారికి తప్ప మిగిలిన వారికి అలాట్‌మెంట్
బదిలీలు, పదోన్నతులతో..
ఓ వైపు బడిబాట నిర్వహిస్తుండగానే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల కావడంతో బడిబాట నత్తనడకన సాగింది. ఉపాధ్యాయులందరూ ఎవరెవరికి పదోన్నతులు వస్తాయని ఆరా తీయడం.. ఆన్‌లైన్ దరఖాస్తుల నుంచి పదోన్నతుల ఆర్డర్ కాపీలు చేతికి వచ్చేంత వరకు అటువైపు ప్రాధాన్యత ఇచ్చారు.
ఇంకోవైపు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్లలో మునిగితేలడం కూడా కారణంగా తెలుస్తోంది. ఈలోపు బడిబాట కార్యక్రమం పూర్తయింది. కానీ.. అడ్మిషన్లు అంతంతగానే మారాయి. ఫలితంగా గతేడాది ఒకటో తరగతిలో 1,458 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించగా ఈ ఏడాది 560 మందికి పరిమితం కావాల్సి వచ్చింది.
Temporary Based Posts : ఐఐఆర్‌ఆర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..
ప్రభుత్వ బడుల్లో కల్పించిన మౌలిక వసతులు నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అమలు ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంలో కొత్త అడ్మిషన్లు మరింతగా పెరుగుతాయి. బడిబాటలో కల్పించిన ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా స్కూల్ ఎడ్యుకేషనల్ యాప్‌లో చేర్చాల్సి ఉంది. బడిబాట ముగిసినా ఆగస్టు వరకు అడ్మిషన్లు కొనసాగిస్తాం. పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపడుతాం.
– ఎస్.యాదయ్య, డీఈవో, మంచిర్యాల
ప్రభుత్వ బడుల్లో కొత్తగా అడ్మిషన్లు పొందిన ఆన్‌లైన్ వివరాలు ఇలా..
- అంగన్‌వాడీ కేంద్రాల నుంచి -396
- ప్రైవేట్ పాఠశాల నుంచి- 107
- నేరుగా చేరిన వారు -55
- బడిబయట పిల్లలు -12
- మొత్తం: 560