Welfare Hostel: హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన ఆహారం
అత్తిలి: సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి రామన్నపేటలో ఆధునికీకరించిన బీసీ బాలుర వసతి గృహాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ గతంలో ఇక్కడ బీసీ బాలుర వసతి గృహం ఉండేదని, ఆ తరువాత ఈ వసతి గృహాన్ని రేలంగిలో కలపారన్నారు. మండల కేంద్రమైన అత్తిలిలో తిరిగి వసతి గృహం కోసం ప్రతిపాదనలు పంపగా వెంటనే ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రస్తుతం ఈ వసతి గృహంలో 40 మంది విద్యార్ధులు ఉన్నారని, 100 మంది వరకు హాస్టల్‌లో ఉండేందుకు వసతి సదుపాయం ఉందన్నారు. వసతి గృహాల నిర్వహణపై తరచు తనిఖీ చేస్తానని, మెనూ ప్రకారం రుచికరమైన ఆహార పదార్ధాలు అందించాలని వసతిగృహ అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, సర్పంచ్ గంటావిజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, ఎంపీటీసీ రంభ సుజాత, వైఎస్సార్‌సీపీ నాయకులు కందుల సత్యనారాయణ, కాసగాని అబ్బులు, కంకటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: AP Govt Schools: విద్యార్థులకు మెరుగైన బోధనే లక్ష్యం