యాజమాన్య కోటా ఫీజులకు హేతుబద్ధత ఏంటి? యథేచ్ఛగా దందా!!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల్లో దందా కొనసాగుతోంది. కొన్ని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లను అమ్ముకుంటున్నా అధికారులు పట్టించుకోవట్లేదు.

యాజమాన్య కోటాకు కూడా కన్వీనర్ కోటా ఫీజునే వసూలు చేయాలన్న నిబంధనను పాటించకపోయినా చేష్టలుడిగి చూస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా పేరుతో యాజమాన్యాలు వసూలు చేసున్న ఫీజుకు హేతుబద్ధత ఏంటి? యాజమాన్యాలు నిర్ణయించిందే ఫీజా? అలాంటప్పుడు కన్వీనర్ కోటా ఫీజునే యాజమాన్య కోటాకు చెల్లించాలన్న నిబంధన ఎందుకు విధించారన్నది ప్రశ్నార్థకం. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ లో కూడా పారదర్శకత ఉండాలని, మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ఆ దిశగా చర్యలు ఉండట్లేదు. ర్యాటిఫికేషన్ల సమయంలోనూ యాజమాన్యాల తప్పిదాలపై అధికారు లు మిన్నకుంటున్నారే తప్ప యాజమాన్య కోటా సీట్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కూడా తీసుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి.. యాజమాన్యాలకు తలొగ్గి పని చేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ఏం చేసిందంటే..
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 74, 75 జీవోలను, 2012లో 66, 67 జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. వాటిల్లోని వివిధ అంశాలపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా.. 2014 ఆగస్టు 14న 13, 14 జీవోలను జారీ చేసింది. అయితే జీవో 66, 67 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాజమాన్య కోటా లో సీటు కోరుకునే ప్రతి విద్యార్థికి దరఖాస్తు దక్కేలా, ఆ దరఖాస్తుల నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎంపికయ్యేలా చర్యలు చేపట్టింది.

మారదర్శకాలు ఇవీ..
బీ కేటగిరీ సీట్ల భర్తీకి అధికార యంత్రాంగం ఒక వెబ్ పోర్టల్‌ను తయారు చేయాలి. ఈ పోర్టల్‌లో ప్రతి కాలేజీకి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇవ్వాలి. కాలేజీల్లోని ప్రతి కోర్సులో యాజమాన్య కో టాలో ఉండే సీట్ల వివరాలు అందుబాటులో ఉంచాలి. పత్రికల్లో, ఈ పోర్టల్‌లో ఆయా కాలేజీలు ప్రకటనలు ఇవ్వాలి. విద్యార్థులు ఆ పోర్టల్‌కు వెళ్లి తమకు కావాల్సిన కాలేజీకి దరఖాస్తు చేసుకోవాలి. వాటి ఆధారంగా కాలేజీలు విద్యార్థులను ఎంపిక చేయాలి. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను కాలేజీలు వెబ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. మెరిట్ ప్రకారమే ఎంపిక చేశారని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదించాలి. లేదంటే తిరస్కరించాలి. ఇంకా సీట్లు మిగిలితే రెండో జాబితాను రూపొందించాలి.

అమలుకు నోచుకోని ఉత్తర్వులు..
హైకోర్టు సూచించిన మేరకు 66, 74 జీవోలకు సవరణ చేస్తూ ప్రభుత్వం 2014, ఆగస్టు 14న జీవో 13ను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టాలని మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశం మాత్రం లేకుండాపోయింది. దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి, దాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సిన అధికారులు యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

స్పష్టమైన ఉత్తర్వులున్నా వెనుకడుగే..
మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తులను స్వీకరించి మెరిట్ కలిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించాలని.. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఉన్నత విద్యా మండలి దాన్ని అమలు చేయట్లేదు. ముడుపులకు అలవాటు పడిన కొంతమంది అధికారులు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీని యాజమాన్యాలకు అనుకూలమైన వ్యాపారంగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వాన్ని సమర్థించిన హైకోర్టు..
ప్రభుత్వ ఉత్తర్వులపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కోర్టు జీవో 66, 67లను సమర్థిస్తూనే యాజమాన్యాలు కోరిన పలు అంశాలను ఆ జీవోల్లో చేర్చాలని సూచించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు, ఇంటర్వ్యూ చేసే అవకాశం, ఆర్థిక స్తోమతను బట్టి సీట్ల కేటాయింపు చేయాలని పేర్కొంది. 5 శాతం ఉన్న ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను 15 శాతం వరకు పెంచుకునే అవకాశం కల్పించింది.