విద్యార్ధుల మానసిక ఆరోగ్యం జాగ్రత్త: యూజీసీ
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యా సంస్థల మూత, పరీక్షలు వాయిదా తదితర పరిణామాల వల్ల విద్యార్థుల మానసిక స్థైర్యం, ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే అనేక పరీక్షలు వాయిదా పడడం, లాక్‌డౌన్ తర్వాత అవి ఎప్పుడు జరుగుతాయో తెలియక అయోమయంతో ఉన్న విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కాలేజీల నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థులతోపాటు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆయా ఉన్నత విద్యా సంస్థలు దృష్టి సారించాలని స్పష్టం చేసింది.
- కరోనా వ్యాప్తిని ఎదుర్కోవడంలో భాగంగా హాస్టళ్లలో, క్యాంపస్‌ల వెలుపల ఉన్న విద్యార్థుల భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని యూజీసీ ఇప్పటికే సూచనలు చేసింది.
- ఇటీవలి కాలంలో పరీక్షలు, తత్సంబంధిత భవిష్యత్తు వ్యవహారాలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోంది.
- ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతోంది.
- కరోనా వ్యాప్తిని నివారించే చర్యలు ఎంత ముఖ్యమో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక సమస్యల పరిష్కారమూ అంతే ముఖ్యం.
- ఇందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలి.
- విద్యార్థులతో సంప్రదింపుల ద్వారా వారిలో ఒత్తిడి, భయాందోళనలను నివారించి భరోసా కల్పించాలి.
- విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు కొందరు నిపుణులైన అధ్యాపకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగించాలి.
- హాస్టల్ వార్డెన్లు, సీనియర్ ఫ్యాకల్టీల నేతృత్వంలో విద్యార్థులతోనే కరోనా నివారణ సహాయక బృందాలను ఏర్పాటు చేయాలి.
- www.mohfw.gov.in వీడియో లింక్‌లను వర్శిటీ, కళాశాలల వెబ్‌సైట్‌లో పొందుపరిచి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి.
- ఈ యూట్యూబ్ లింకు ద్వారా కరోనా వ్యాప్తి సమయంలో మానసిక, శారీరక ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకోవచ్చు. లింక్.. www.youtube.com/watch?v=uHB3WJsLJ8s&feature=youtu.be
- మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి https://www.mohfw.gov.in/pdf/MindingourmindsduringCoronaeditedat.pdf సందర్శించవచ్చు.
- విద్యార్థులు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ వెబ్‌సైట్లో నిపుణులు సూచించిన మార్గాలను పాటించాలి. వెబ్‌సైట్: www.youtube.com/watch?v=iuKhtSehp24&feature=youtu.be
- ఇంకా ఏమైనా సహాయ, సహకారాలు కావాలంటే టోల్‌ఫ్రీ నంబర్ 0804611007ను సంప్రదించవచ్చు.