వార్షిక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం అసాధ్యం: యూజీసీ నిపుణుల కమిటీ

సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో రెగ్యులర్ అకడమిక్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం సాధ్యం కాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ (యూజీసీ) నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయానికి వచ్చింది.
దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట యూనివర్సిటీలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ఆ మేరకు సరిపడా మౌలిక సదుపాయాలు లేవన్న నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా విద్యాసంస్థలను మూసేసిన నేపథ్యంలో ఉన్నత విద్యలో అకడమిక్ వ్యవహారాలు వార్షిక పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందకు హరియాణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆర్‌సీ కువూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని యూజీసీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ అంశాలపై అధ్యయనం చేసి తమ నివేదికను సిద్ధం చేస్తోంది. యూనివర్సిటీల్లో వివిధ కోర్సులకు సంబంధించిన వార్షిక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలు లేనందునే మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించాల్సిన పరీక్షలను యూనివర్సిటీలు వాయిదా వేశాయన్న అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కాదని, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్ సదుపాయం లేదని, అలాంటపుడు వారు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసే అవకాశమే లేదన్న అంశాలను కమిటీ తమ నివేదికలో పొందుపరిచేందుకు సిద్ధమైంది. మరోవైపు ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు ఇళ్లలో ఉండి పరీక్షలు చూసి రాసే అవకాశం ఉంటుందని యూజీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటు ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులంతా గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లిపోయారని, వారు ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేందుకు సరిపడా కంప్యూటర్లు లేవని, అసలు అది సాధ్యమే కాదని యూనివర్సిటీలకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ తర్వాత అన్నింటి కంటే ముందుగా వివిధ కోర్సులకు సంబంధించి ఫైనల్ ఇయర్ పరీక్షలను నిర్వహించడంపై దృష్టి సారించి, వాటి మూల్యాంకన, ఫలితాల ప్రకటన పనులను వేగంగా చేపట్టాలని అధ్యాపకులు పేర్కొంటున్నారు. మిగతా పరీక్షలకు సంబంధించి తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చంటున్నారు. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో దేశంలోని కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఫైనల్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేసి, అంతకుముందు వచ్చిన మార్కుల యావరేజ్ ఆధారంగా మార్కులు వేసి విద్యార్థులను పాస్ చేసిన నేపథ్యంలో మిగతా యూనివర్సిటీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది తేలాల్సి ఉంది. లాక్‌డౌన్ తర్వాత పరీక్షలను నిర్వహిస్తాయా? ఎలా ముందుకు సాగుతాయన్న దానిపై త్వరలోనే యూజీసీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.