తెలుగులోకి అష్టాదశ పురాణాలు!
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన అష్టాదశ పురాణాల ముద్రణ వేగంగా సాగుతోంది.
ఇప్పటికే మూడు పురాణాలను ముద్రించగా, మత్స్య పురాణం ముద్రణకు సిద్ధమవుతోంది. వీటి అనువాదం, ముద్రణ తదితర అంశాలపై శ్రీవెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ (శ్వేత) సంచాలకులు డాక్టర్ కె.రామాంజులరెడ్డి, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న డాక్టర్ సముద్రాల దశరథ ఆధ్వర్యంలో జనవరి 22 (బుధవారం)నసమీక్ష నిర్వహించారు. సమీక్షలో పండితులు సముద్రాల లక్ష్మణయ్య, కందా రామానుజాచార్యులు, కొంపెల్ల సూర్యనారాయణ, సింగాచార్యులు, శ్రీపాద సత్యనారాయణ, ధూళిపాళ్ల మహదేవమణి, దూళిపాళ్ల అన్నపూర్ణమ్మ, శ్రీపాద సుబ్రహ్మణ్యం, వేదాల సీతారామాచార్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పురాణ, ఇతిహాస ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటివరకు వ్యాస భాగవతం, వాల్మీకి రామాయణంలను తెలుగులో ప్రచురించామన్నారు. 2010 నుంచి అష్టాదశ పురాణాల తాత్పర్యాలను తెలుగులో, తేలికపాటి పదాలతో, సులభశైలిలో ఉండేలా రూపొందిస్తున్నామన్నారు. 18 పురాణాల్లో 4 లక్షల శ్లోకాలున్నాయని, వాటిలో 3.72 లక్షల శ్లోకాలను సేకరించామన్నారు. 47 మంది పండితులు వీటిని సేకరించి 3.40 లక్షల శ్లోకాల అనువాదం పూర్తి చేశారన్నారు. వీటిని మొత్తం 50 పుస్తకాలుగా ముద్రిస్తున్నామన్నారు. ఇప్పటివరకు విష్ణు పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మ పురాణం రెండు భాగాలుగా ముద్రణ పూర్తయి్యందన్నారు. మత్స్యపురాణం ముద్రణకు సిద్ధమైందన్నారు.