సీబీఎస్‌ఈ 11వ తరగతిలో అప్‌లైడ్ మేథమెటిక్స్
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు 11వ తరగతిలో అప్‌లైడ్ మేథమెటిక్స్‌ను ఐశ్చిక (ఎలక్టివ్) సబ్జెక్టుగా సీబీఎస్‌ఈ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పటివరకు స్కిల్ ఎలక్టివ్‌గా ఉన్న ఈ సబ్జెక్టును ఇకపై అకడమిక్ సబ్జెక్టుగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు భవిష్యత్తులో మేథమెటిక్స్ సంబంధ అంశాల్లో అవసరమైన నైఫుణ్యాలను 11వ తరగతిలోనే నేర్పించేలా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులందరికీ ఇది తప్పనిసరి సబ్జెక్టుగా కాకుండా, ఇష్టమైన విద్యార్థులే దీనిని ఎంచుకునేలా ఏర్పాట్లు చేసింది. అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు కలిగిన అనుబంధ పాఠశాలలు దీనిని అమలు చేసేలా చర్యలు చేపట్టినట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. అయితే 11వ తరగతిలో స్కిల్ ఎలక్టివ్ సబ్జెక్టుగా అప్‌లైడ్ మేథమెటిక్స్‌ను ఎంచుకున్న విద్యార్థులు 12వ తరగతిలో అకడమిక్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చని పేర్కొంది. అలాగే ఇకపై ఇది స్కిల్ ఎలక్టివ్ సబ్జెక్టుగా ఉండబోదని స్పష్టం చేసింది.