ప్రైవేటు స్కూళ్లలో భారీగా పెరిగిన చేరికలు.. మూడేళ్లలో 1,62,200 మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 40,989 పాఠశాలల్లో గత మూడేళ్లలో 1,70,034 మంది విద్యార్థులు పెరిగారని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 4.6 శాతం పెరిగితే, ప్రైవేటులో ఏకంగా 95.4 శాతం పెరుగుదల నమోదైనట్టు అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో వెల్లడించింది. 2017–18లో ప్రభుత్వ స్కూళ్లలో 27,60,761 మంది విద్యార్థులుంటే.. 2019– 20 నాటికి 27,68,595కు పెరిగింది. అంటే 7,834 మంది విద్యార్థులు పెరిగారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో 2017–18లో 30,75,549 మంది ఉండగా.. 2019–20 నాటికి ఈ సంఖ్య 32,37,749కి పెరిగింది. అంటే లక్షా 60 వేల మందికిపైగా చేరారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవే టు స్కూళ్లలో కలిపి 60,06,344 మంది విద్యార్థులు చదువుతున్నట్టు పేర్కొంది. 2017–18 విద్యా సంవత్సరంతో పోల్చితే 2019–20లో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించింది. మూడేళ్ల కాలంలో మొత్తంగా 28,229 మంది టీచర్లు పెరగగా.. అందులో 8 వేల వరకు ప్రభుత్వ స్కూళ్లలో, 20 వేలమందికిపైగా ప్రైవేటు స్కూళ్లలో ఉన్నట్టు తెలిపింది. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు కలిపి 2019–20 నాటికి 2,76,888 మంది ఉన్నట్టు పేర్కొంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో బాలికల సంఖ్య పెరిగిందని విద్యాశాఖ వివరించింది. 2017–18లో వారి సంఖ్య 28,31,466 మందిగా ఉంటే.. 2019–20 నాటికి 28,63,422కి పెరిగినట్టు తెలిపింది.