మార్చిలో నియామకాలు పెరిగాయ్‌: నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌

ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ ప్రకారం గత నెలలో జాబ్‌ లిస్టింగ్స్‌ 3 శాతం అధికమయ్యాయి.
వివిధ ఉద్యోగాల కోసం నౌకరీ.కామ్‌లో నమోదయ్యే ప్రకటనల ఆధారంగా ప్రతి నెల కంపెనీ నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ విడుదల చేస్తోంది. దీని ప్రకారం.. ఐటీ, రిటైల్‌ రంగాల మూలంగా ఈ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో జాబ్‌ లిస్టింగ్స్‌ 2,356 అయితే, మార్చిలో ఈ సంఖ్య 2,436 ఉంది. జాబ్‌ లిస్టింగ్స్‌ ఐటీ రంగంలో 11 శాతం, రిటైల్‌లో 15 శాతం వృద్ధి చెందాయి. చమురు, సహజ వాయువు రంగంలో 7 శాతం, అకౌంట్స్, ట్యాక్సేషన్‌, ఫైనాన్స్‌ 6, టెలికం, ఐఎస్‌పీ 5, బీపీవో, ఐటీఈఎస్‌ 1, బీఎఫ్‌ఎస్‌ఐలో 1 శాతం పెరిగాయి.

జనవరి–మార్చిలో 23 శాతం..
కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో విద్యా రంగంలో 13 శాతం, ఎఫ్‌ఎంసీజీ 10, హోటల్స్, ఎయిర్‌లైన్స్‌, ట్రావెల్‌ రంగాల్లో 8 శాతం నియామకాలు తగ్గాయి. 2020 అక్టోబర్‌–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రిక్రూట్‌మెంట్‌ 23 శాతం పెరిగిందని నౌకరీ.కామ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ తెలిపారు. వృత్తి నిపుణుల కోసం డిమాండ్‌ మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో 10 శాతం, హెచ్‌ఆర్, అడ్మినిస్ట్రేషన్‌ 8, సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో 6 శాతం పెరిగింది. 4–7, 8–12 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం నియామకాల వృద్ధి 6% నమోదైంది. నాయకత్వ విభాగంలో 16 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారి కోసం జరిగే నియామకాలు 3 శాతం తగ్గాయి.