ఇక జేఈఈ మెయిన్ ఏడాదికి నాలుగుసార్లు.. అదే సిలబస్..!
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బతో తరగతులు సరిగ్గా జరగక ఇబ్బంది పడుతున్న ఇంటర్ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా కేంద్రం కసరత్తు చేస్తోంది.
తమకు ఇష్టమైన సమయంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు చేపడుతోంది. జేఈఈ మెయిన్ పరీక్షను రెండుసార్లు కాకుండా 4 సార్లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్‌లో ప్రకటించారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, 12వ తరగతి వార్షిక పరీక్షలు, కాలేజీల ప్రారంభం, తదితర అంశాలపై ఆయన గురువారం ట్విట్టర్ లైవ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చర్చించారు. జేఈఈ మెయిన్‌ను వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు నిర్వహిస్తామని చెప్పారు. ఆయా నెలల్లో ఆన్‌లైన్‌లో మూడు నాలుగు రోజులపాటు పరీక్షలను నిర్వహిస్తామన్నారు. తద్వారా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా.. తాము సిద్ధంగా ఉన్నామనుకున్న సమయంలో పరీక్షకు హాజరు కావచ్చన్నారు. ఆయా పరీక్షలకు సంబంధించిన నార్మలైజేషన్ పద్ధతిలోనే విద్యార్థుల స్కోర్‌ను బట్టి ర్యాంకులు కేటాయిస్తామన్నారు. తద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో చేరడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ప్రశ్నల సంఖ్య 100కు పెంపు జేఈఈ మెయిన్ సిలబస్ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని మంత్రి పోఖ్రియాల్ తేల్చిచెప్పారు. అయితే ప్రశ్నల సంఖ్యను పెంచుతామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న 75 ప్రశ్నలకు బదులు 100 ప్రశ్నలు ఇస్తామని తెలిపారు. అందులో 75 ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోయేలా విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచి సమానంగా ప్రశ్నలు ఉంటాయన్నారు. అందులో ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. దీంతో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, చాయిస్‌లు ఎక్కువగా ఉండటం వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని చెప్పారు. జాతీయ నూతన విద్యా విధానానికి విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. ఇక త్వరలోనే నీట్‌కు సంబంధించి ప్రకటన చేస్తామన్నారు. విద్యార్థులు వీలైనంత వరకు ఆన్‌లైన్ /డిజిటల్/ఈ-విద్యలో అందుబాటులో ఉన్న పాఠాలను చూసుకోవాలని, ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకు వాటిని నేర్చుకోవాలని సూచించారు.