పైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు...

ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన వెంటనే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాలకు డిసెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
యూనివర్శిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు మైనారిటీ, నాన్‌న్‌మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఇప్పటికే మెరిట్ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అర్హులైన అభ్యర్థులు 17వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు ఇచ్చుకోవడానికి కేవలం 48 గంటలే సమయం ఇవ్వడం గమనార్హం. కళాశాల వారీగా సీట్ల వివరాలను వర్శిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మరింత సమాచారానికి www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.