64 ఏళ్ల వయస్సులో ఎంబీబీఎస్.. బాప్‌రే..!!
భువనేశ్వర్: 40 ఏళ్లపాటు బ్యాంకు ఉద్యోగం చేసి, 4 దశాబ్దాల పాటు సంసార సాగరాన్ని ఈది, పిల్లలను పెంచి పెద్దచేసి, ప్రయోజకులను చేశాక ఎవరైనా సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు.
కానీ, ఒడిశాకు చెందిన 64 ఏళ్ళ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి జై కిశోర్ ప్రధాన్ మాత్రం అలా అనుకోలేదు. డాక్టర్ అవ్వాలన్న తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు వయస్సుని పక్కనబెట్టి కృషి చేశారు. ఎట్టకేలకు నీట్‌లో 175 మార్కులు పొంది, 5,94,380 స్కోరుని సాధించి, ఒడిశాలోని బర్లాలో ప్రభుత్వ, వీర్ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ కాలేజీలో నాలుగేళ్ళ ఎంబీబీఎస్ కోర్సులో చేరి తన కల నిజం చేసుకున్నారు. ప్రధాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2016లో డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. 1970లో ఇంటర్మీడియట్ అయిన తరువాత ఒకసారి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు. సీటు రాకపోవడంతో బీఎస్‌సీలో చేరారు. అయితే అప్పటి నుంచి తన కోరిక అసంపూర్ణంగానే ఉండిపోయింది. 15 ఏళ్ళు బ్యాంకు ఉద్యోగం చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఇదే ప్రయత్నం చేయాలను కున్నప్పటికీ కుటుంబం గడవడం కష్టమని భావించారు. కూతుళ్ళిద్దరూ నీట్‌కి ప్రిపేర్ అవుతుండడంతో వారిని చదివిస్తూ తాను కూడా కృషిని కొనసాగించారు ప్రధాన్. 2019లో సుప్రీంకోర్టు నీట్ పరీక్షకు వయోపరిమితిని తాత్కాలికంగా ఎత్తివేయడంతో ఇది సాధ్యమైందంటారు ప్రధాన్. అయితే తన కూతుళ్ళలో ఒకరు ఇటీవల మృతి చెందడంతో ప్రధాన్ కుటుంబాన్ని విషాదం వీడలేదు. తన కూతురుకు గుర్తుగా ఈ చదువుని కొనసాగిస్తానంటున్నారు ప్రధాన్.