JEE Main 2022 Cut Off Marks: మెయిన్.. కటాఫ్ ఎంతో తెలుసా?
జేఈఈ–మెయిన్.. ప్రతిష్టాత్మక ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు.. ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశంతోపాటు ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం ఉద్దేశించిన జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్ష! అందుకే.. ఇంటర్‌లో చేరిన తొలి రోజు నుంచే లక్షల మంది విద్యార్థులు జేఈఈ–మెయిన్‌లో టాప్ స్కోర్ కోసం కృషి చేస్తుంటారు. గత నెలలో(జూన్)లో జరిగిన ఈ ఏడాది తొలి సెషన్‌కు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు కటాఫ్ ఎంత ఉంటుంది.. ఎన్ని మార్కులు వస్తే.. అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది అనే సందేహంలో ఉన్నారు. ఎందుకంటే..జేఈఈ–మెయిన్ నుంచి 2.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో.. గత నెల 23 నుంచి 29 వరకు నిర్వహించిన జేఈఈ–మెయిన్–2022 తొలి సెషన్ పరీక్ష సరళి.. కటాఫ్ మార్కుల అంచనా.. తదితర అంశాలపై విశ్లేషణ..
Online Class: JEE Mains marks vs percentile 2022 and expected cutoff
- జనరల్ కేటగిరీలో 80–85 మధ్య కటాఫ్!
- అప్లికేషన్, అనలిటికల్ ప్రశ్నలకు ప్రాధాన్యం
- ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు
- రెండో సెషన్‌కు ఔపోసన పట్టాల్సిన ఆవశ్యకత
- జూలై 21 నుంచి 30 జేఈఈ–మెయిన్ రెండో సెషన్
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో 300 మార్కులకు జేఈఈ మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మ్యాథమెటిక్స్‌లో న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అభ్యర్థులకు కొంత ఎక్కువ సమయం పట్టిందని.. దీంతో మిగతా ప్రశ్నలకు సమాధానం గుర్తించడంపై ప్రభావం చూపిందంటున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి అడిగిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని.. ప్రశ్నలన్నీ గత రెండేళ్లలో ఆయా విభాగాల్లో అడిగిన కాన్సెప్ట్‌ల నుంచే ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రిపరేషన్ సమయంలో ప్రీవియస్ పేపర్లను సాధన చేసిన వారు తేలిగ్గా సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి కొంత ఎక్కువ వెయిటేజీ కల్పించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జేఈఈ–మెయిన్ పరీక్షల్లో ఈ ఏడాది దాదాపు ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ఆధారంగా చేసుకునే అడగడం గమనార్హం.
JEE Main Previous Papers
సిలబస్ కుదింపు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్టేట్ బోర్డ్ పరిధిలో 30 శాతం సిలబస్‌ను తొలగించిన విషయం తెలిసిందే. కానీ.. జేఈఈ–మెయిన్ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో స్టేట్ సిలబస్‌లో ఉన్న 70 శాతం అంశాలకే ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులకు జేఈఈ–మెయిన్‌లో పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది ఎదురైంది. కాని మెయిన్ సిలబస్‌లోని అంశాలను పూర్తిగా అభ్యసించిన అభ్యర్థులు జేఈఈ–మెయిన్‌తోపాటు బోర్డ్ పరీక్షల్లోనూ మంచి మార్కులు సాధించే అవకాశం ఏర్పడింది.
మొదటి రోజే మ్యాథ్స్ క్లిష్టంగా
- జేఈఈ–మెయిన్ తొలి సెషన్‌లో మొదటి రోజునే విద్యార్థులకు మ్యాథమెటిక్స్ క్లిష్టంగా అనిపించింది. వెక్టార్స్, 3–డి జామెట్రీ, కానిక్ విభాగాలకు ప్రాధాన్యం ఎక్కువ లభించింది. అదే విధంగా ఛాయిస్ విధానంలోని న్యూమరికల్ ప్రశ్నలకు అంచెల వారీగా సాధన చేస్తేనే సమాధానాలు రాబట్టే పరిస్థితి కనిపించింది. దీంతో విద్యార్థులు ఈ విభాగాన్ని కొంత క్లిష్టంగా భావించారు.
- ఫిజిక్స్‌లో మాత్రం దాదాపు అన్ని చాప్టర్లకు సమాన వెయిటేజీ కల్పిస్తూ ప్రశ్నలు అడిగారు. మ్యాగ్నటిజం, కైనమాటిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సులభంగా సమాధానాలు గుర్తించగలిగారు.
- మొదటి రోజు మొదటి సెషన్‌లో.. ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ లభించగా.. రెండో సెషన్‌లో మాత్రం ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వెయిటేజీ కనిపించింది. ఈ విభాగంలో అన్ని ప్రశ్నలు సులభంగా ఉండటంతో విద్యార్థులకు ఇది స్కోరింగ్‌గా ఉంటుందని చెప్పొచ్చు.
ఆయా రోజుల్లో క్లిష్టతలు
- రెండో రోజు ఇలా: ఫిజిక్స్‌లో ఫార్ములా బేస్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. ప్రధానంగా సీబీఎస్‌ఈ 11వ క్లాస్(ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం) సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఎనర్జీ, ఆప్టిక్స్, రొటేషనల్ మోషన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. మ్యాథమెటిక్స్‌లో మాత్రం ప్రశ్నల క్లిష్టత స్థాయి ఎక్కువగా కనిపించింది. అధిక శాతం ప్రశ్నలను కాలిక్యులస్ నుంచి అడగడం గమనార్హం. రెండో రోజు సెకండ్ షిఫ్ట్‌లో పేపర్‌లో కూడా మ్యాథమెటిక్స్ విభాగం క్లిష్టంగా, మిగతా రెండు సబ్జెక్ట్‌లు ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి.
- మూడో రోజు ఇలా: రెండు సెషన్లు కూడా ఓ మోస్తరు క్లిష్టతోనే ఉన్నాయని అంటున్నారు. మ్యాథమెటిక్స్‌లో మాత్రం ప్రశ్నలు.. అంచెల వారీగా సాధన చేస్తేనే సమాధానం ఇచ్చేలా ఉన్నాయి. ఫిజిక్స్ నుంచి కమ్యూనికేషన్, కెపాసిటర్స్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ ఫిజిక్స్, పీఓక్యూ, కైనమాటిక్స్, ఎలక్ట్రో స్టాటిక్ వేవ్స్, మోడ్రన్ ఫిజక్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలకు, బయో మాలిక్యూల్స్, నిజ జీవితంలో కెమిస్ట్రీలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ ప్రశ్నలు అడిగారు.
- నాలుగో రోజు: మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కొంత సుదీర్ఘంగా, ఫిజిక్స్ ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతో, కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగానూ ఉన్నాయని అంటున్నారు. మ్యాథమెటిక్స్‌లో సర్కిల్స్, ట్రిగ్నోమెట్రీ, స్ట్రెయిట్ లైన్, కానిక్ సెక్షన్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెమీ కండక్టర్స్, ట్రాన్సిస్టర్, ఎలక్ట్రాస్టాటిక్, పొటెన్షియల్ డిఫరెన్స్ విభాగాలకు కొంత వెయిటేజీ లభించిందని చెప్పొచ్చు.
- అయిదో రోజు: అయిదో రోజు జరిగిన రెండు షిఫ్ట్‌లలో మ్యాథమెటిక్స్ విభాగం క్లిష్టంగా, ఫిజిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో, కెమిస్ట్రీ విభాగం సులభంగా ఉందని పేర్కొంటున్నారు. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి దాదాపు అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడిగారు. ప్రతి చాప్టర్‌కు సమాన వెయిటేజీ కల్పించే విధంగా ప్రశ్న పత్రాలు రూపొందించారని నిపుణులు అంటున్నారు. ఫిజిక్స్‌లో.. ఫ్యాక్ట్ బేస్డ్ కొశ్చన్స్‌కు ప్రాధాన్యత లభించింది. కెమిస్ట్రీలో.. న్యూమరికల్ టైప్ ప్రశ్నల్లో అధిక శాతం ప్రశ్నలు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అడిగారు. అదే విధంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అంశాలకు ఎక్కువ వెయిటేజీ కల్పిస్తూ ప్రశ్నలు అడిగారు.
- చివరి రోజు కూడా: జేఈఈ–మెయిన్–2022 తొలి సెషన్ చివరి రోజు జూన్ 29న జరిగిన రెండు షిఫ్ట్‌లలోనూ అంతకుముందు రోజుల మాదిరిగానే క్లిష్టత స్థాయి కనిపించింది. మ్యాథమెటిక్స్ విభాగం ప్రశ్నలు సుదీర్ఘంగా.. అంచెల వారీగా సాధన చేసేలా ఉండగా.. ఫిజిక్స్‌లో న్యూమరికల్, ఫ్యాక్ట్ బేస్డ్ సమ్మిళితంగా ఉండే ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలోనూ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ప్రాధాన్యం లభించింది. దీంతో.. ఈ మూడు విభాగాలకు సంబంధించి అభ్యర్థులు మ్యాథమెటిక్స్‌ను క్లిష్టంగా,ఫిజిక్స్‌ను ఓ మోస్తరు క్లిష్టంగా, కెమిస్ట్రీని సులభంగా భావించారు.
అప్లికేషన్, అనలిటికల్ బేస్డ్
మొత్తంగా చూస్తే జేఈఈ–మెయిన్ తొలి సెషన్‌లోని అన్ని షిఫ్ట్‌లలోనూ ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రశ్నలన్నీ అప్లికేషన్, అనలిటికల్ బేస్డ్‌గా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా అంశాలను, సమస్యలు కాన్సెప్ట్స్‌ను ఆధారంగా చేసుకుంటూ సాధన చేసిన వారు సులభంగానే సమాధానాలు గుర్తించే విధంగా ఉన్నాయని చెబుతున్నారు.
కటాఫ్ పర్సంటైల్ 80–85
- తొలి సెషన్‌లో జేఈఈ–మెయిన్ కటాఫ్ జనరల్ కేటగిరీ 80 నుంచి 85 మధ్యలో; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60–65 మధ్యలో; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40–50 మధ్యలో ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గత ఏడాది కటాఫ్ స్కోర్ జనరల్ కేటగిరీలో.. 87.89, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 66.22, ఓబీసీ కేటగిరీలో 68.023, ఎస్సీ కేటగిరీలో 44.68, ఎస్టీ కేటగిరీలో 34.67గా నమోదైంది.
రెండో సెషన్‌కు హాజరు కావాలా? వద్దా?
ఈ ఏడాది రెండు సెషన్లలో నిర్వహించే జేఈఈ–మెయిన్–2022 తొలి సెషన్ ముగిసిన నేపథ్యంలో.. తొలి సెషన్‌కు హాజరైన అభ్యర్థుల్లో తలెత్తే సందేహం.. జూలై 21 నుంచి మొదలయ్యే రెండో సెషన్‌కు హాజరు కావాలా? వద్దా? అనేది.
తొలి సెషన్‌లో ఆశించిన విధంగా మార్కులు కచ్చితంగా వస్తాయనుకునే అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌పై దృష్టిపెట్టాలని.. అదే ప్రిపరేషన్‌తో జేఈఈ–మెయిన్ రెండో సెషన్‌కు హాజరు కావచ్చొని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్‌లోని మూడు సబ్జెక్టుల్లోనూ.. ప్రతి సబ్జెక్ట్‌లో గరిష్టంగా 18 నుంచి 20 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి.. మంచి స్కోర్ సాధిస్తామనే ధీమా ఉన్న అభ్యర్థులు రెండో సెషన్ గురించి ఆలోచించకుండా.. అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవ్వాలని పేర్కొంటున్నారు.
రెండో సెషన్‌లో రాణించాలంటే
తొలి సెషన్‌లో అంచనా వేస్తున్న కటాఫ్ మార్కులు సాధించలేమని భావిస్తున్న∙విద్యార్థులు.. స్వీయ విశ్లేషణ చేసుకుంటూ.. రెండో సెషన్‌కు సన్నద్ధం కావాలి. తొలి సెషన్‌కు హాజరైన అభ్యర్థులు తమ ‘కీ’ని పరిశీలించుకుని.. తాము చేసిన పొరపాట్లు, ఏ టాపిక్స్‌కు సంబంధించిన అంశాల్లో సమాధానాలు రాయలేదో.. వాటిపై దృష్టి పెట్టాలి. వీటిపై పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అభ్యసనం చేయాలి. అదే విధంగా పునశ్చరణకు ప్రతిరోజు నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి.
- జేఈఈ–మెయిన్ రెండో సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు ప్రశ్నల క్లిష్టత స్థాయిపై ఆందోళన చెందకుండా ప్రిపరేషన్ సాగించాలి. వాస్తవానికి ఇప్పుడు ముగిసిన తొలి సెషన్‌లో.. మొత్తం మూడు విభాగాల్లోనూ ప్రశ్నలు ఓ మోస్తరు క్లిష్టతతోనే అడిగారు. కాబట్టి ఏప్రిల్ సెషన్‌లోనూ ఇదే తీరులో ప్రశ్న పత్రం ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
రెండిటికీ.. సమాంతరంగా
రెండో సెషన్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సిన మరో అంశం.. జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్ష తేదీ. ఈ ఏడాది జేఈఈ–అడ్వాన్స్‌డ్ పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహించనున్నారు. జేఈఈ–మెయిన్ రెండో సెషన్‌ను జూలై 21 నుంచి జూలై 30 వరకు నిర్వహించనున్నారు. జేఈఈ–మెయిన్ రెండో సెషన్ అభ్యర్థులు.. మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు ఒకే సమయంలో సనద్ధమయ్యేలా అడుగులు వేయాలి. జూలై 15వరకు మెయిన్, అడ్వాన్స్‌డ్‌కు చదువుతూ.. జూలై 15 నుంచి పూర్తిగా మెయిన్ పరీక్షకు సమయం కేటాయించాలి.
కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు
జేఈఈ–మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షల విషయంలో బేసిక్ కాన్సెప్ట్‌లపై అవగాహనే కీలకంగా నిలుస్తోంది. కాబట్టి రెండో సెషన్‌కు హాజరయ్యే విద్యార్థులు, అదే విధంగా అడ్వాన్స్‌డ్ అభ్యర్థులు చదవడానికే పరిమితం కాకుండా.. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రశ్నను ఎన్ని విధాలుగా అడగొచ్చో ఊహించి.. దానికి అనుగుణంగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను షార్ట్ నోట్స్ రూపంలో పొందుపర్చుకుంటే పునశ్చరణ ఎంతో సులభంగా ఉంటుంది.
–ఆర్.కేదారేశ్వర్, సబ్జెక్ట్ నిపుణలు
‘కీ’తో సరిచూసుకుని నిర్ణయం
జేఈఈ మెయిన్ రెండో సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు.. తొలి సెషన్‌లో తమ ప్రశ్న పత్రాల ‘కీ’ని సరిచూసుకోవాలి. 80 కంటే తక్కువ స్కోర్ వస్తుందనుకుంటే రెండో సెషన్‌కు ఉపక్రమించాలి. అదే విధంగా తొలి సెషన్‌లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకుని.. సబ్జెక్ట్ పరంగా వాటిని మెరుగుదిద్దుకుంటూ ప్రిపరేషన్ సాగించి రెండో సెషన్‌కు సన్నద్ధం కావాలి. మ్యాథ్స్‌లో న్యూమరికల్ టైప్ కొశ్చన్స్ సాధనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మెరుగైన స్కోర్‌కు ఆస్కారం లభిస్తుంది.
–ఎం.ఎన్.రావు, సబ్జెక్ట్ నిపుణులు